మానవ సాధికారత కోసం పరిశుభ్ర పర్యావరణం – ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ

0
2
Spread the love

“ఐక్య‌రాజ్య స‌మితి ‘చాంపియ‌న్స్ ఆఫ్ ద ఎర్త్’ పుర‌స్కారం అందుకున్న సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రాసిన వ్యాసం’’

మానవ సాధికారత కోసం పరిశుభ్ర పర్యావరణం

   ఐక్యరాజ్యసమితి నిన్న ‘‘చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’’ పురస్కారంతో నన్ను సత్కరించింది. ఈ గౌరవాన్ని అందుకుని, నేను పులకాంకితుడనయ్యాను. అయితే, ఇది ఒక వ్యక్తికి దక్కిన గౌరవంగా కాక.. ప్రకృతిమాతతో సామరస్య పూర్వక జీవన విధానాన్ని సర్వదా బోధించే భారతీయ సంస్కృతి, విలువలకు లభించిన గుర్తింపుగా పరిగణిస్తున్నాను. వాతావరణ మార్పుల నుంచి మానవాళికి ఉపశమనం దిశగా భారతదేశం పోషిస్తున్న చురుకైన పాత్రకు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెజ్, ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం కార్యనిర్వాహక సంచాలకుడు ఎరిక్ సొహైమ్‌ ల‌ గుర్తింపు, ప్రశంసలు దక్కడం భారతీయులందరికీ గర్వకారణం.

   మానవాళికి ప్రకృతితో ప్రత్యేక అనుబంధం ఉంది. మనలను పెంచి పోషించింది ఆ ప్రకృతి మాతే. మానవ తొలి నాగరకత నదీ తీరాలలోనే మొగ్గ తొడిగింది. అందువల్ల ప్రకృతితో సామరస్య పూర్వక సాహచర్యం కొనసాగించే సమాజాలు సర్వతోముఖ వికాసంతో, సౌభాగ్యంతో పరిఢవిల్లుతాయి. ఇవాళ మానవ సమాజం ఒక ప్రధాన కూడలిలో నిలిచి ఉంది. ఇక్కడి నుంచి మనం ఏ బాట పడతామో అది మన శ్రేయస్సునేగాక, మన తర్వాత ఈ భూమి మీద జీవించబోయే మన ముందు తరాల భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. మన అవసరాలు, అత్యాశ మధ్య అసమతౌల్యం అత్యంత తీవ్ర పర్యావరణ అసమతౌల్యానికి దారితీసింది. మనం ఈ వాస్తవంతో ఏకీభవించి, మన పనేదో మనం చూసుకుంటూ ముందుకు వెళ్లగలగాలి లేదా ఈ అసమతౌల్యాన్ని సరిదిద్దే కార్యాచరణకు ఉపక్రమించాలి. ఒక సమాజంగా మనం సానుకూల మార్పు ఎలా తీసుకు రాగలమన్న దాన్ని మూడు అంశాలు నిర్ధారిస్తాయి.

   ఈ అంశాలలో మొదటిది- అంతఃకరణ శుద్ధి… ఇందుకోసం మన ఉజ్వల గత చరిత్రకన్నా దృష్టి సారించగల ప్రదేశం మరొకటి లేదు. ప్రకృతిని గౌరవించడమన్నది భారత సంప్రదాయాలలో అత్యంత కీలకమైనది. మన ‘అథర్వ’ వేదంలోని ‘పృథ్వీ సూక్తం’ ప్రకృతి, పర్యావరణాల గురించి మనకు అసమాన జ్ఞానాన్ని ప్రసాదించింది. ఈ వేదంలోని అద్భుత శ్లోకం… “यस्यां समुद्र उत सिन्धुरापो यस्यामन्नं कृष्टयः संबभूवुः । यस्यामिदं जिन्वतिप्राणदेजत्सा नो भूमिः पूर्वपेये दधातु ॥३॥” అంటే- ‘‘భూమాతకు వందనం. సముద్ర, నదీజలాలను ఏకం చేసి తనలో ఇముడ్చుకున్నదీ మాత. తనను దున్నినపుడు తన గర్భంలోని ఆహారాన్ని ఆ మాత అందిస్తుంది. నిజానికి అన్ని ప్రాణులూ నివసిస్తున్నది ఆమెలోనే… ఆ జీవశక్తిని భూమాత సదా మనకు ప్రసాదించుగాక!’’ అని అర్థం. పంచభూతాలైన… పృథ్వి (భూమి), వాయువు (గాలి), జలం (నీరు), అగ్ని (నిప్పు), ఆకాశం (శూన్యం), వాటి సమన్వయంపై మన జీవన వ్యవస్థలు ఏ విధంగా ఆధారపడి ఉన్నదీ మన పూర్వికులు వివరించారు. ప్రకృతిలో భాగమైన ఈ పంచభూతాలే దైవత్వానికి నిదర్శనాలు.

   మహాత్మాగాంధీ కూడా పర్యావరణం గురించి విస్తృతంగా రాశారు. అంతేగాక పర్యావరణంతో సహానుబంధం అత్యావశ్యకమని నిరూపించే జీవనశైలిని ఆచరించారు. ప్రకృతి వనరులకు మనం.. అంటే ప్రస్తుత తరం ధర్మకర్తలుగా ఉండాల్సిన అవసరాన్ని ఆయన ప్రబోధించారు. రానున్న తరాలకు పరిశుభ్ర భూగోళం వారసత్వంగా సంక్రమించేలా చూసే బాధ్యతను ఈ ధర్మకర్తృత్వం మనపై ఉంచుతుంది. ప్రపంచానికి వనరుల కొరత రాకుండా చూడాలంటే అవసరాలకు అనుగుణంగా వినియోగం అవశ్యమని ఆయన పిలుపునిచ్చారు. ఆ విధంగా సామరస్యపూర్వక, అవసరానుగుణ వినియోగంతో కూడిన జీవనశైలి మన విలువల్లో ఒక భాగం. అటువంటి సుసంపన్న సంప్రదాయానికి పతాకధారులం మనమేనన్న వాస్తవాన్ని మనం గుర్తిస్తే, సహజంగానే అది మన చర్యలపై సానుకూల ప్రభావం చూపుతుంది.

   ఇక రెండో అంశం- ప్రజా చైతన్యం… పర్యావరణ సంబంధ ప్రశ్నలపై మనం వీలైనంత ఎక్కువగా మాట్లాడాలి.. రాయాలి.. చర్చించాలి.. సంభాషించాలి.. వివరించాలి. అదే సమయంలో పర్యావరణ సంబంధిత అంశాలపై పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడం కూడా ముఖ్యమే. ఇలా చేసినప్పుడే మనం నేడు ఎదుర్కొంటున్న తీవ్ర సవాళ్ల గురించి మరింత మంది ప్రజలు తెలుసుకుని, వాటి పరిష్కార మార్గాన్వేషణకు ఉద్యుక్తులవుతారు. పర్యావరణ పరిరక్షణతో ఒక సమాజంగా మనకు గల బలమైన బంధాల గురించి మనం తెలుసుకుంటే… దాన్ని గురించి తరచూ మాట్లాడుతూంటే, సువ్యవస్థిత పర్యావరణం దిశగా మనం ‘చురుకుదనం’తో  వ్యవహరిస్తున్నట్లే అవుతుంది. అందుకే ‘చురుకుదనాన్ని’ సానుకూల మార్పు తీసుకురాగల మూడో అంశంగా నేను పరిగణిస్తాను. ఈ నేపథ్యంలో భారతదేశం లోని 130 కోట్ల మంది భారతీయులూ చురుకుదనం గల వారేనని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. ఆ మేరకు వారంతా పరిశుభ్ర, పచ్చదనం నిండిన పర్యావరణం దిశగా సాగే కృషిలో ముందు వరుసన ఉన్నారని చెబుతున్నాను.

   సుస్థిర భవితతో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్న స్వచ్ఛ భారత్ ఉద్యమంలో ఈ చురుకుదనాన్ని మనం చూస్తున్నాం. దేశంలో తొలిసారిగా ప్రజానీకం ఆశీస్సులతో 8.5 కోట్ల కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే 40 కోట్ల మంది భారతీయులకు బహిరంగ విసర్జన దుస్థితి తప్పింది. పారిశుధ్యం 39 శాతం నుంచి 95 శాతం ప్రజానీకానికి విస్తరించింది. మన ప్రకృతి సహజ పరిసరాల పై దుష్ప్రభావాన్ని తగ్గించాలన్న మన లక్ష్యం దిశగా ఈ కృషి ఒక మైలురాయి. అలాగే ‘ఉజ్వల యోజన’ విజయవంతం కావడంలోనూ ఇదే చురుకుదనాన్ని మనం చూస్తున్నాం. వంటచెరకు తో ఆహారం తయారీ వల్ల తలెత్తే గృహ వాతావారణ కాలుష్యం శ్వాసకోశ వ్యాధులకు దారితీసే దుస్థితిని ఈ పథకం గణనీయంగా తగ్గించింది. ఈ పథకం ప్రవేశపెట్టాక ఇప్పటిదాకా 5 కోట్ల ఉచిత వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వబడ్డాయి. తద్వారా మహిళల, వారి కుటుంబాల మెరుగైన, పరిశుభ్ర జీవనానికి హామీ లభించింది.

   నదుల ప్రక్షాళనలోనూ భారత్ వేగంగా ముందుకెళ్తోంది. భారత జీవనరేఖ అయిన గంగానదీ జలాలు దేశంలోని అనేక ప్రాంతాల్లో కలుషితమయ్యాయి. ఈ చారిత్రక తప్పిదాన్ని నేడు ‘నమామి గంగ’ పథకం సరిదిద్దుతోంది. తదనుగుణంగా మురుగును సవ్యంగా శుద్ధి చేసే ప్రక్రియకు నేడు ప్రాధాన్యం ఇస్తున్నాం. ‘‘అమృత్, స్మార్ట్ సిటీస్’’ పేరిట చేపట్టిన కీలక కార్యక్రమాల్లో పర్యావరణ సంరక్షణతో పట్టణాభివృద్ధిని సమతౌల్యం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.  అలాగే రైతులకు జారీచేసిన 13 కోట్లకు పైగా భూసార కార్డులు పంటల సాగులో వారికి ఎంతగానో తోడ్పడుతున్నాయి. భూసార వృద్ధితో పాటు ఉత్పాదకతను పెంచుకునేందుకు, తద్వారా భావితరాలకు ప్రయోజనం కల్పించేందుకు ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతోంది.

   నైపుణ్య భారతం లక్ష్యాలను కూడా మేము పర్యావరణ రంగంతో సమన్వయం చేశాం. అందులో భాగంగా ‘‘పర్యావరణం, అటవీ అభివృద్ధి, వన్యమృగ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, వాతావారణ మార్పు’’ తదితర రంగాల్లో 2021 నాటికి ప్రగతి సాధించే దిశగా దేశంలోని 70 లక్షల మంది యువత కోసం ‘‘హరితాభివృద్ధి నైపుణ్య కార్యక్రమం’’ కింద పథకాలను ప్రారంభించాం. వీటివల్ల పర్యావరణ రంగంలో నైపుణ్యంతో కూడిన ఉద్యోగాలతోపాటు పారిశ్రామిక వ్యవస్థాపన కింద అనేక అవకాశాలు సృష్టించ బడతాయి. అంతేకాదు… నవ్య, పునరుత్పాదక ఇంధన వనరులపై మన దేశం అసమాన శ్రద్ధ చూపుతోంది. గడచిన నాలుగేళ్లలో ఈ రంగం మరింత అందుబాటు, గిట్టుబాటు స్థాయికి చేరింది. ‘ఉజాలా యోజన’ కింద దేశవ్యాప్తంగా దాదాపు 31 కోట్ల ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేయబడ్డాయి. ఈ బల్బుల ధర తగ్గించబడటమేగాక వాటి వినియోగంతో విద్యుత్ బిల్లుల భారం, వాతావరణం లోకి కర్బన వాయువుల విడుదల కూడా తగ్గుముఖం పట్టాయి.

   భారత్ చురుకుదనాన్ని ప్రపంచమంతా గమనిస్తోంది. పారిస్ నగరంలో 2015నాటి కాప్-21 సంప్రదింపులకు సంబంధించి భారత్ ముందు వరుసలో ఉండటం నాకు గర్వకారణం. అంతేకాకుండా 2018 మార్చిలో పలువురు దేశాధినేతలు న్యూఢిల్లీలో సమావేశమై ‘‘అంతర్జాతీయ సౌర కూటమి’’ ఏర్పాటుకు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచారు. సూర్యశక్తిని అధికంగా పొందే దేశాలలో ఈ సుసంపన్న ఇంధన వనరును ఒడిసిపట్టుకునే కృషికి కూటమి ఎంతగానో తోడ్పడగలదు. ప్రపంచం ఒకవైపు వాతావరణ మార్పు గురించి చర్చిస్తున్న తరుణంలో వాతావరణ న్యాయం గురించి కూడా భారత అంతటా ప్రతిధ్వనించింది. వాతావరణ మార్పులవల్ల తీవ్రంగా బాధపడుతున్న పేద, బలహీన దేశాల ప్రయోజనాలు, హక్కుల పరిరక్షణ లక్ష్యంగా భారత్ దీనిపై గళమెత్తింది.

   నేను ఇంతకుముందు రాసిన వ్యాసంలో పేర్కొన్న విధంగా- వర్తమాన పరిస్థితులతో పోలిస్తే నేడు మేం తీసుకుంటున్న చర్యలు మున్ముందు మానవ నాగరికతపై సత్ ప్రభావం చూపగలవు. ఈ భౌగోళిక జవాబుదారీతనం పతాకాన్ని సుస్థిర భవిష్యత్తు దిశగా తీసుకెళ్లడం మన బాధ్యత. ప్రభుత్వ నిబంధనల కన్నా పర్యావరణ స్పృహ ఇరుసుగా పర్యావరణ తాత్వికతకు సంబంధించి ప్రపంచం నేడు సరికొత్త స్వభావం సంతరించుకోవాలి. ఈ దిశగా ఎంతో శ్రద్ధ తో కృషి చేస్తున్న వ్యక్తులను, సంస్థలను అభినందిస్తున్నాను. మన సమాజంలో చారిత్రక మార్పులకు వారు వైతాళికులయ్యారు. వారి ప్రయత్నాలకు వ్యక్తిగతంగా, ప్రభుత్వపరంగా అన్నివిధాలా నా మద్దతు ఉంటుందని హామీ ఇస్తున్నాను. తదనుగుణంగా మానవ సాధికారతకు పునాదిరాయి వంటి పరిశుభ్ర పర్యావరణ సృష్టికి కలసికట్టుగా ముందడుగేద్దాం రండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here