హ‌రిత‌హారం మొక్క‌ల సంర‌క్ష‌ణ‌కు ఉచితంగా రూ. 30 ల‌క్ష‌ల ట్రీగార్డ్‌లు

Spread the love

*బ‌ల్దియా హ‌రిత‌హారం*
*హ‌రిత‌హారం మొక్క‌ల సంర‌క్ష‌ణ‌కు ఉచితంగా రూ. 30 ల‌క్ష‌ల ట్రీగార్డ్‌లు*
*సీ.ఎస్‌.ఆర్‌లో భాగంగా ట్రీగార్డ్‌ల‌ను బ‌ల్దియాకు అందిస్తున్న కార్పొరేట్ సంస్థ‌లు*

హ‌రిత‌హారంలో భాగంగా నాటే మొక్క‌ల ప‌రిర‌క్ష‌ణ‌కు ట్రీగార్డ్‌ల‌ను కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్స్‌బులిటీ స్కీమ్‌లో భాగంగా అందించాలన్న జీహెచ్ఎంసీ పిలుపు మేర‌కు ఇప్ప‌టి వ‌ర‌కు 30ల‌క్ష‌ల రూపాయ‌ల విలువైన ట్రీగార్డ్‌లు న‌గ‌రంలోని ప‌లు కార్పొరేట్ సంస్థ‌లు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు జీహెచ్ఎంసీకి అంద‌జేశాయి. ప్ర‌స్తుత 4వ విడ‌త హ‌రిత‌హారంలో మొత్తం 40ల‌క్ష‌ల మొక్క‌లు నాటాల‌న్న ల‌క్ష్యంలో భాగంగా కేవ‌లం జీహెచ్ఎంసీ ద్వారా 5ల‌క్ష‌ల మొక్క‌ల‌ను న‌గ‌రంలోని ప్ర‌ధాన ర‌హ‌దారులు, కాల‌నీలు, ఖాళీ స్థ‌లాల్లో నాట‌నుంది. న‌గ‌రంలో చేప‌ట్టిన హ‌రిత‌హారం మొక్క‌ల సంర‌క్ష‌ణ‌కు ఉచితంగా ట్రీగార్డ్‌ల‌ను కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్స్‌బులిటీలో భాగంగా అందించాల‌ని జీహెచ్ఎంసీ ఇచ్చిన పిలుపుమేర‌కు న‌గ‌రంలోని వివిధ ప‌రిశ్ర‌మ‌లు, వ్యాపార సంస్థ‌ల నుండి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. అజామాబాద్‌లోని వ‌జీద్ సుల్తాన్ టోబాకో యాజ‌మ‌న్యం ట్రీగార్డ్‌లకై నాలుగు లక్ష‌ల రూపాయ‌ల‌ను అందించ‌నుంది. ఈ నాలుగు ల‌క్ష‌ల రూపాయ‌ల విలువైన ట్రీగార్డ్‌ల‌ను రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి గురువారం నాడు జీహెచ్ఎంసీకి అంద‌జేయ‌నున్నారు. కాగా కేవ‌లం ఈస్ట్ జోన్‌లోనే వివిధ కార్పొరేట్ సంస్థ‌లు, ప‌రిశ్ర‌మ‌లు, వ్యాపార సంస్థ‌లు 11ల‌క్ష‌ల విలువైన ట్రీగార్డ్‌ల‌ను జీహెచ్ఎంసీకి అంద‌జేశాయి. వీటితో పాటు కుత్బుల్లాపూర్ స‌ర్కిల్‌లో హెట‌రో డ్ర‌గ్స్ యజ‌మాన్యం ల‌క్ష రూపాయ‌లను అందించింది. కాప్రా స‌ర్కిల్‌లో తెలంగాణ ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియాలోని పారిశ్రామిక వేతలు రూ. 3.70 ల‌క్ష‌లు, హోట‌ళ్లు, ఆసుప‌త్రులు, ఫంక్ష‌న్‌హాళ్ల యాజ‌మ‌న్యాలు రూ. 2.10 లక్ష‌ల‌ను ట్రీగార్డ్‌ల కొనుగోలుకు అంద‌జేశాయి. త‌మ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకొని కూడా కొంద‌రు ట్రీగార్డ్‌ల‌కు విరాళాలు అంద‌జేశారు. అయితే నేరుగా ట్రీగార్డ్‌ల కొనుగోలుకు జీహెచ్ఎంసీకి డ‌బ్బులు అంద‌జేయ‌కుండా ఆయా సంస్థ‌లే ట్రీగార్డ్‌ల‌ను కొనుగోలు చేసి జీహెచ్ఎంసీకి అంద‌జేసేందుకుగాను ట్రీగార్డ్‌లు ల‌భ్య‌మ‌య్యే స్థ‌లాలు, కంపెనీల వివ‌రాల‌ను జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌లో ప్ర‌ద‌ర్శించింది. ఇప్ప‌టికే ప‌లు బ్యాంకులు, సంస్థ‌లు ట్రీగార్డ్‌ల‌ను సీ.ఎస్‌.ఆర్ కింద అందించ‌డానికి ముందుకు వ‌చ్చాయ‌ని, ఈ ట్రీగార్డ్‌ల‌ను న‌గ‌రంలో ర‌హ‌దారుల వెంట నాటే మొక్క‌ల సంర‌క్ష‌ణ‌కు వినియోగించ‌డం జ‌రుగుతుంద‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి తెలియ‌జేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*