నాగార్జునసాగర్‌లో లక్షన్నర మందితో
బహిరంగసభలో జరిపే యోచనలో సీఎం కెసిఆర్
ఇటీవల జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకొని మరీ… నిర్మాణాత్మక అడుగులు వేస్తోంది టి.ఆర్.ఎస్. పార్టీ. ఈ సారి ఎలాగైనా నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశం ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు. ఈ నియోజవర్గంలోని హాలియాలో పెద్ద ఎత్తున బహిరంగసభను నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నిక కు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోంది. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖ ర్రావు హాజరయ్యే ఈ బహిరంగ సభకు సుమారు లక్షన్నర మందిని సభకు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అనూహ్యంగా దుబ్బాకలో ఓటమి చవిచూసిన తర్వాత సీఎం కెసిఆర్ ఏ విషయాన్ని సాధారణంగా తీసుకోవడం లేదు. నాగార్జునసాగర్ కు ఉప ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయన ఈ అంశంపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు సీఎం కెసిఆర్. ఇప్పటికే ఆయన అన్ని రకాలుగా కసరత్తులు చేస్తూ.. వివిధ రకాల ఈక్వేషన్లను పరిశీలిస్తున్నారు. అభ్యర్థి ఎంపిక విషయంలో ఎలాంటి పొరపాటు జరగకూడదన్న భావనకు వచ్చారు. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఉండకూడదనే భావనతో… అభ్యర్థి ఎంపిక కోసం వివిధ రకాల సర్వేలు చేయిస్తున్నారు సీఎం కెసిఆర్. మొత్తం మీద ఎలాగైనా నాగార్జునసాగర్ సీటు గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు సీఎం కెసిఆర్. అందులో భాగంగానే ఈ బహిరంగసభను భారీ స్థాయిలో నిర్వహించే ఆలోచనలో ఉన్నారు కెసిఆర్. ఇప్పటికే జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో సీఎం బహిరంగసభ నిర్వహణ తేదీల విషయాన్ని చర్చించినట్లు తెలుస్తోంది.