టీటీడి మెంబర్‌గా తొలిసారిగా ఒక సామాన్య జర్నలిస్ట్….!

0
144
Spread the love
టీటీడి మెంబర్‌గా తొలిసారిగా ఒక సామాన్య జర్నలిస్ట్….!

తిరుమల తిరుపతి దేవస్థానం…ప్రపంచ ప్రఖ్యాత తిరుమల క్షేత్రంలో టీటీడీ పాలకమండలి త్వరలో కొలువుదీరనుంది. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా వైవి సుబ్బారెడ్డిని నియమించారు. ఇక త్వరలో పాలకమండలి సభ్యుల ఎంపిక పూర్తి కానుంది. టీటీడీ పాలకమండలిలో ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు కూడా కోటా ఉంటుంది. తెలంగాణ నుంచి ఇద్దరు బోర్డ్ మెంబర్‌లకు అవకాశం ఉంటుంది. తాజాగా టీటీడీ బోర్డ్ మెంబర్‌గా ఖమ్మం జిల్లాకు చెందిన ఓ సామాన్య జర్నలిస్ట్‌కు అవకాశం దక్కనున్నట్లు తెలుగు మీడియాలో ప్రచారం జరుగుతోంది. టీటీడీ బోర్డు మెంబర్ పదవికి దేశం నలుమూలల నుంచి ప్రముఖ వ్యక్తులు పోటీపడతారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు…సినీ సెలబ్రిటీలు ఇలా ప్రతి ఒక్కరూ పోటీపడతారు. ఏపీలో వైసీపీ అఖండ విజయం సాధించిన వేళ…పార్టీకే చెందిన వారికే టీటీడీ బోర్డు మెంబర్‌ పదవి కట్టబెడతారు అంటూ అందరూ ఊహించారు. కానీ సీఎం జగన్ ఎవరూ ఊహించిన విధంగా ఒక సామాన్య జర్నలిస్ట్‌ పేరు పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అటు తెలంగాణ కోటాలో సీఎం కేసీఆర్ కూడా సదరు జర్నలిస్ట్ పేరునే పరిశీలిస్తుండడం మీడియా, రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇంతకీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మనసు గెల్చుకున్న ఆ సామాన్య జర్నలిస్ట్ ఎవరు అనుకుంటున్నారా… ఆయనే…గత ఐదేళ్లుగా తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్న దరువు మీడియాధిపతి సి.హెచ్. కరణ్ రెడ్డి. ఎందుకు..కరణ్ రెడ్డిపై అటు జగన్‌కు, ఇటు కేసీఆర్‌కు ఇంత అభిమానం….ఏకంగా ప్రతిష్టాత్మకమైన టీటీడీ బోర్డు మెంబర్ పదవిని కరణ్ రెడ్డి వంటి ఒక సామాన్య జర్నలిస్ట్‌కు ఇవ్వాలని ఆలోచిస్తున్నారనే విషయంపై తెలుగు మీడియా, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరి అంతలా ఇద్దరు సీఎంల మన్ననలను పొందిన కరణ్ రెడ్డి ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఖమ్మం జిల్లా, సత్తుపల్లిలో ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కరణ్ రెడ్డి తొలుత టీవీ 5 లో ఓ సాధారణ జర్నలిస్ట్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. టీవీ 5, సాక్షి, హెచ్‌ఎంటీవీలలో ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించారు. సాక్షి ఛానల్‌లో పనిచేసేటప్పుడు సిల్లీ, బ్రాండ్, డింగ్ డాంగ్ వంటి సెటైరికల్ ప్రోగ్రామ్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అదే సమయంలో వైయస్ జగన్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. తదనంతరం హెచ్‌ఎంటీవీలో ప్రోగ్రామింగ్ హెడ్‌గా పలు ప్రోగ్రామ్స్‌‌కు పర్యవేక్ష బాధ్యతలు నిర్వర్తిస్తూనే మిష్టర్ మల్లన్న వంటి సెటైర్ ప్రోగ్రామ్‌తో అలరించారు. ఒక జర్నలిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న కరణ్ రెడ్డి తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని అనుకున్నారు. ఒక జర్నలిస్ట్‌గా పని చేయడం కంటే సొంతంగా ఒక సంస్థను ఏర్పాటు చేసి, పది మందికి ఉపాధి కల్పించాలని కరణ్ రెడ్డి ఎప్పుడూ భావించేవారు.
జీవితంలో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని తపించే వారు తాము సాధించే వాటితో సంతృప్తి చెందరు..ఇంకా విభిన్న రంగాల్లో తమ సత్తా చాటాలని అనుకుంటారు. ఆ కోవలో చెందిన వారే కరణ్ రెడ్డి. అప్పటికే మీడియా, యాడ్స్ రంగంలో నిష్ణాతుడైన కరణ్ రెడ్డి 2015 లో కరణ్ కాన్సెప్ట్స్ అనే అడ్వైర్టైజింగ్ సంస్థను నెలకొల్పారు. తెలంగాణలో పొలిటికల్ లీడర్లకు అఫీషియల్‌గా సోషల్ మీడియా క్యాంపెయిన్ రన్ చేయడం అనేది కరణ్ రెడ్డితోనే స్టార్ట్ అయింది. తొలుత జీహెచ్‌ఎంసీ ఎలక్షన్లకు టీఆర్ఎస్ పార్టీ తరుపున సోషల్ మీడియా క్యాంపెయిన్, ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి విజయవంతం అయిన కరణ్ రెడ్డి ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. వరంగల్, ఖమ్మం, మున్సిపాలిటీ ఎన్నికలు, నారాయణఖేడ్ ఉప ఎన్నికలలో కరణ్ రెడ్డి టీమ్ సమర్థవంతంగా పని చేసింది. టీఆర్ఎస్ పార్టీ పథకాలపై ఆయన చేయించిన డిజైన్లు, కంటెంట్, ప్రతిపక్షాలపై వేసే సెటైర్లు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యేవి. ఒక్క ఎన్నికలు ఏంటీ… టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలు, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు..పుష్కరాలు, బతుకమ్మ…బోనాలు..ఇలా ఏ ఈవెంట్ అయినా క్యాంపెయిన్‌కు కరణ్ రెడ్డి ఉండాల్సిందే.. ఎలక్షన్ల సమయంలో అభ్యర్థులకు సోషల్ మీడియా క్యాంపెయిన్ మాత్రమే కాదు…డిఫరెంట్ డిజైన్లతో హోర్డింగులు..ఫ్లెక్సీలు వంటి ఎలక్షన్ మెటీరియల్ కూడా కరణ్ రెడ్డి సకాలంలో అందించేవారు.
కరణ్ రెడ్డి ప్రతిభకు మచ్చుతునకగా ఓ సంఘటన ఇక్కడ ప్రస్తావించుకోవాలి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో మెట్రో ఫిల్లర్ల‌పై టీఆర్ఎస్ పార్టీ కరణ్ రెడ్డి వేయించిన డిజైన్లు, హోర్డింగ్‌లు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాంగ్రెస్ లీడర్లు, కిషన్ రెడ్డి లాంటి బీజేపీ లీడర్లు ఆ హోర్డింగ్‌లు డిజైన్లు ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి అంటూ ప్రింటవుట్స్ తీసుకుని మరీ ప్రెస్‌మీట్లలో వాపోవడం..కరణ్ రెడ్డి టాలెంట్‌కు నిదర్శనం. చేసే పని పట్ల నిబద్దత కలిగిన అతి కొద్ది మందిలో కరణ్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. పక్కా ప్లానింగ్, మేనేజ్‌మెంట్ స్కిల్స్‌తో అతి కొద్ది కాలంలోనే కరణ్ రెడ్డి స్టార్ పొలిటికల్ క్యాంపెయినర్‌గా కేటీఆర్‌కు, సీఎం కేసీఆర్‌కు దగ్గరై పోయారు. అంతే కాదు..టీఆర్ఎస్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు సన్నిహితుడిగా మారిపోయారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకుల ఆదరాభిమానాలు పొందడం కరణ్ రెడ్డికే దక్కింది.
యాడ్ ఏజెన్సీ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నా కరణ్ రెడ్డిలోని జర్నలిస్ట్‌ సంతృప్తిపడలేదు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న అపార అనుభవంతో ఆయన్ని వెబ్‌మీడియా వైపు అడుగులు పడేలా చేసింది. అలా పుట్టుకు వచ్చిందే…తెలుగు వెబ్ మీడియా సంచలనం..దరువు వెబ్‌సైట్. ప్రారంభించిన అనతి కాలంలోనే దరువు వెబ్‌సైట్‌ను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దారు కరణ్ రెడ్డి. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల సమస్యలను చేరవేస్తూ, ఆయా సమస్యల పరిష్కారంలో తన వంతు పాత్ర పోషించింది దరువు. ఒక్కోసారి ప‌్రభుత్వం చేసే చిన్న చిన్న పొరపాట్లపై సునిశతమైన విమర్శలు చేస్తూనే .. ప్రతిపక్షాల కువిమర‌్శలపై చురకలు వేసేది. మరోవైపు ఏపీలో గత అధికార పార్టీ అవినీతిపై దరువు రాజీలేని పోరాటం చేసింది. అధికార పార్టీ పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గర నుంచి గ్రామస్థాయిలో జరుగుతున్న అవినీతిని దరువు ఎప్పటికప్పుడు ప్రశ్నించేది. ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం వంటి అంశాలలో ప్రతి పక్ష పార్టీ గొంతుకకు దరువు తోడైంది. ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు, వెబ్ మీడియాను గుప్పిట్లో పెట్టుకుని, తమను ప్రశ్నిస్తున్న దరువు లాంటి వెబ్‌సైట్లను అధికార పార్టీ భయభ్రాంతులకు గురి చేస్తున్నా కరణ్ రెడ్డి ఏ మాత్రం వెనుకంజ వేయలేదు. ఎంతగా అణగదొక్కితే అంతగా ఎగిసిపడతాం అంటూ…అధికార పార్టీ అక్రమాలను దరువు ఎప్పటికప్పుడు బయటపెట్టేది. టీడీపీ సర్కారు చేస్తున్న అవినీతి, దౌర్జన్యాలను ప్రజలకు తెలియజేసింది. ఎటువంటి వత్తిడులకు, బెదిరింపులకు లొంగక ఏపీ ప్రజల వాయిస్‌గా దరువు వెబ్‌సైట్‌ను నిలిపారు కరణ్ రెడ్డి.
ఇక ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో కరణ్ రెడ్డి ఆధ్వర్యంలోని కరణ్ కాన్సెప్ట్స్ వైసీపీ అభ్యర్థుల తరపున సోషల్ మీడియా, ఎలక్షన్ క్యాంపెయిన్ విజయవంతంగా నిర్వహించింది. మరో పక్క దరువు వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానల్ జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ విస్తృతంగా ప్రచారం చేసింది. నవరత్నాల పథకాలను ప్రజలకు చేరవేయడంలో దరువు మీడియా తన వంతుగా కృషి చేసింది.
2018 సార్వత్రిక ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడంలో, ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంలో కరణ్ కాన్సెప్ట్స్, దరువు మీడియా తన వంతు పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు.
ఏపీలో వైసీపీకి అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్ జగన్‌కు కరణ్ రెడ్డి చేసిన కృషి తెలిసింది. ఇదివరకే తనకు సన్నిహితుడైన కరణ్ రెడ్డి తన పార్టీ విజయం కోసం పడిన తపన సీఎం జగన్‌‌ను సంతోషపెట్టింది.
కరణ్ రెడ్డి సేవలకు ప్రతిఫలంగా టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా బాహాటంగానే చెబుతున్నారు.
ఇటు పార్టీకి కరణ్ రెడ్డి అందించిన సేవలకుగాను తెలంగాణ కోటాలో కరణ్ రెడ్డికి టీటీడీ బోర్డ్ మెంబర్ పదవి ఇవ్వాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఈ విషయాన్ని కేటీఆర్ చేరవేసినట్లు సమాచారం. కరణ్ రెడ్డి పట్ల సీఎం కేసీఆర్ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఆశించిన మైహోం రామేశ్వరరావుపై ఐటీ దాడులు జరుగుతుండడంతో సీఎం కేసీఆర్ ఆయన్ని పక్కనపెట్టినట్లు సమాచారం. మొత్తానికి తెలుగు రాష్ట్రాల సీఎంల మనసులు గెల్చుకున్న దరువు మీడియాధిపతి సి.హెచ్ . కరణ్ రెడ్డికి టీటీడీ మెంబర్ పదవి రావడం ఖాయమని మీడియా, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జర్నలిస్టులు కలలో కూడా ఊహించని టీటీడీ బోర్డు మెంబర్ పదవి కరణ్ రెడ్డి లాంటి సామాన్య జర్నలిస్ట్‌కు దక్కనుందని వస్తున్న వార్తలతో మీడియా వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. నిజంగానే కరణ్ రెడ్డి టీడీపీ బోర్డ్ మెంబర్‌గా ఎంపిక అయితే యావత్ జర్నలిస్టులందరికీ దక్కిన గౌరవంగానే భావించాలి. ఆల్ ద బెస్ట్ కరణ్ రెడ్డి
D Balakrishna, chief Editor - TOOFAN Telugu News Daily. This News Paper and News website runs from Hyderabad, Telangana State India. Telugu breaking news and Current Affairs, Sports, Crimenews, Fashion, Life style, Cricket, Cinema, Tollywood News updates. Political News of India and Telugu States Telangana and Andhrapradesh.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here