2024 లక్ష్యంగా  పావులు కదుపుతున్న చంద్ర బాబు 

0
98
Spread the love

2024 లక్ష్యంగా  పావులు కదుపుతున్న చంద్ర బాబు 

అమరావతి జూలై 12 (ఎక్స్ ప్రెస్ న్యూస్);మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి 2024 ఎన్నికలు చావోరేవో లాంటివి. ఆ ఎన్నికల్లో ఓటమి ఎదురైతే ఇక తెలుగు దేశం పార్టీ మూటా ముల్లె సర్దుకోవాల్సిందే. ఇప్పటికే తెలంగాణలో ఆ పార్టీకి దిక్కులేకుండా పోయింది.  ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఏపీలోనే ఓడితే టీడీపీ సంగతి ఇక అంతే. అందుకే ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచే అన్ని రకాల సమీకరణలతో ఆయన ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది టీడీపీ నేతల ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థికంగా మెరుగ్గా ఉన్న నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పార్టీలో యవ రక్తాన్ని నింపేందుకూ ఆయన సిద్దమయ్యారు. మరోవైపు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలపైనా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. అందు కోసం సీనియర్ నేతలనూ పక్కనపెట్టాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే యర్రగొండపాలెం ఇన్ఛార్జిగా ఎరిక్సన్ బాబును నియమించారు. ఎరిక్సన్ది కనిగిరి నియోజకవర్గం. అయినప్పటికీ ఎంతో కాలం నుంచి పార్టీని నమ్ముకుని ఉండడంతో స్థానికంగా ఉన్న నేతలను కాదని తిరిగి పార్టీలోకి వచ్చిన డేవిడ్ రాజును  కాదని ఎరిక్సన్ కు  అవకాశం కల్పించారు. యువకుడు కావడంతో పార్టీని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని నమ్ముతున్నారు.ఆర్థిక పరంగానూ ముందు చూపుతో వ్యవహరిస్తున్న బాబు తిరువూరు నియోజకవర్గంలో సీనియర్ నేత స్వామిదాస్ కు  మళ్లీ ఝలక్ ఇచ్చి అక్కడ ఎన్నారై దేవదత్ ను ఇన్ఛార్జిగా నియమించారు. ఎన్నారై కావడంతో ఆర్థికంగా బలమవుతాడని భావించి ఆయనను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ అన్ని రకాలుగా బలవంతుడు. రాజకీయంగా ఆర్థికంగానూ జగన్ను ఎదుర్కోవాలంటే అందుకు తగిన శక్తి సామర్థ్యాలను బాబు సమకూర్చుకోవాల్సి ఉంది.రాబోయే రోజుల్లో మరిన్ని కీలక మార్పలు చోటు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.మహామహా రాజకీయ ప్రత్యర్థులతో తలపడ్డ అనుభవం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది. అయితేనేం 2019 ఎన్నికల్లో యువ రాజకీయ నాయకుడు వైఎస్ జగన్ చేతిలో చిత్తుగా ఓడి ఆంధ్రప్రదేశ్లో అధికారానికి దూరమయ్యారు. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా పోరాడుతున్నా అనుకున్న స్థాయిలో తన ప్రభావాన్ని ప్రదర్శించలేకపోతున్నారు. ఆయన తన మాటలతో   క్షేత్రస్థాయిలో నేతల్లో ధైర్యం నింపలేకపోతున్నారనే అభిప్రాయాలూ ఉన్నాయి. పరిస్థితులు గమనించిన బాబు మరో  మూడేళ్లలో రాబోతున్న 2024 ఎన్నికలపై ఆయన ఇప్పటి నుంచే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మరి ఈ మార్పులు జగన్ దూకుడుకు అడ్డుకట్ట వేస్తాయా? తిరిగి బాబును గద్దెక్కిస్తాయా అన్నది తేలాలంటే వచ్చే2024  ఎన్నికల ఫలితాల వరకూ ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here