అన్నంపెట్టే రైతన్న ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండాలి – చంద్ర‌బాబు

0
154
Spread the love

ఇవాళ జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. పదిమందికీ అన్నంపెట్టే రైతన్న ఎల్లప్పుడూ సుఖశాంతులతో ఉండాలని టీడీపీ కోరుకుంటుందని స్పష్టం చేశారు. కానీ, ఏపీలో రైతు ఆత్మహత్యలు నానాటికి పెరిగిపోతుండడం, రైతుల ఆత్మహత్యల్లో మన రాష్ట్రం మూడోస్థానంలో ఉండడం విషాదకరమని పేర్కొన్నారు.

అటు, ప్రజా రాజధాని అమరావతి ప్రాంత రైతులు 372 రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఉద్యమిస్తున్నారని, వీరిలో 110 మంది అన్నదాతలు అమరులయ్యారని చంద్రబాబు తెలిపారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం తన అప్పు పరిధిని పెంచుకోవడం కోసం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి రైతులపై మరింత భారం మోపనుందని ఆరోపించారు.

వరుసగా సంభవించిన వరదలు, నివర్ తుపాను విధ్వంసంతో రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులు అసెంబ్లీలో బైఠాయించి పట్టుబట్టేంత వరకు ఈ ప్రభుత్వం పంట బీమా కట్టలేదంటే రైతుల పట్ల ఈ పాలకులకు ఎంత నిర్లక్ష్యమో తెలుస్తుందని పేర్కొన్నారు. పైగా, రైతులకు పరిహారం అడిగామని సభలో మాపైనే దాడికి తెగబడ్డారు అంటూ చంద్రబాబు మండిపడ్డారు.

ఇకమీదట అయినా పాలకులు తీరు మార్చుకోవాలని, పంటలకు గిట్టుబాటు ధరలు అందించాలని, పంట కొనుగోళ్లలో అవినీతికి స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల బకాయిలు తక్షణమే చెల్లించాలని, ఇన్ పుట్ సబ్సిడీలు, విపత్తు పరిహారం, బీమా సకాలంలో అందించి రైతుల్లో భవిష్యత్ పై భరోసా పెంచాలని కోరుతున్నానని వెల్లడించారు.

టీడీపీ హయాంలో ఇచ్చినట్టుగా సబ్సిడీపై యంత్ర పరికరాలు అందించాలని, సబ్సిడీ ఇచ్చి సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. “ఎద్దు ఏడ్చిన చోట వ్యవసాయం నిలవదు, రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదు అంటారు… పాలకులు ఇది గ్రహించకపోతే పుట్టగతులు ఉండవు” అని హితవు పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here