తెలంగాణ ఉద్యమ తరహాలో దళిత బంధు అమలు: సీఎం కేసీఆర్
కొత్తగా మరో నాలుగు మండలాల్లో..
హైదరాబాద్: శాసనసభ సాక్షిగా దళిత బంధు పథకం రూపకల్పన జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ పథకాన్ని రాష్ట్రం నలుదిక్కులా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. దశల వారీగా తెలంగాణ ఉద్యమం తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో దళిత బంధు పైలట్ ప్రాజెక్టు అమలుపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. క్షేత్రస్థాయి అనుభవాలను కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్ ముఖ్యమంత్రికి వివరించారు.
కొత్తగా మరో నాలుగు మండలాల్లో..
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీల ఆర్థిక అవసరాలు, స్థితిగతులను పరిశీలిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. చింతకాని, తుంగతుర్తి, చారగొండ, నిజాంసాగర్ మండలాల్లో దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు అమల్లో ఉన్న హుజూరాబాద్, వాసాలమర్రి మండలాలకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. కొత్తగా అమలు చేయాలని నిర్ణయించిన మండలాలకు కూడా 2, 3 వారాల్లో దశలవారీగా నిధులు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. నాలుగు మండలాల్లోని అధికారులు గ్రామాలకు తరలి వెళ్లాలని ఆదేశించారు. ఎస్సీలను ఆర్థికంగా, వ్యాపార వర్గంగా నిలబెట్టాలని సంకల్పించినట్లు కేసీఆర్ వివరించారు. ఎస్సీ సాధికారత కింద అసెంబ్లీలో రూ.1000 కోట్లు ప్రకటించినట్లు చెప్పారు. ఆర్థిక, సామాజిక వివక్షను తరిమికొట్టాలనే ఆశయంతోనే ఈ పథకాన్ని తీసుకొచ్చానన్నారు. కచ్చితమైన లక్ష్యాన్ని నిర్ధేశించుకొని దళిత బంధు అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దళిత బంధుకు బడ్జెట్లో సైతం నిధులు కేటాయిస్తామన్నారు..