పోలీసు కుటుంబాల కోసం ఫంక్షన్ హాళ్ల నిర్మాణం – డీజీపీ మహేందర్ రెడ్డి

0
126
Spread the love

పోలీసు కుటుంబాల కోసం ఫంక్షన్ హాళ్ల నిర్మాణం – డీజీపీ మహేందర్ రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 29 :: రాష్ట్రంలో పోలీస్ సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షల కనుగుణంగా ప్రతీ జిల్లాలో పోలీసు శాఖకు చెందిన స్థలాల్లో ఫంక్షన్ హాళ్ల నిర్మాణం చేసి వీటిని పోలీసు కుటుంబాల సౌకర్యార్థం ఉపయోగించనున్నట్టు రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ ఎం. మహేందర్ రెడ్డి తెలియ చేశారు. తెలంగాణా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు ఏదుల గోపిరెడ్డి పోలీసు సంక్షేమంపై రచించిన వ్యాసాల సంపుటి “సంక్షేమ పోలీసు – వ్యాసాలూ, నివేదికలు” అనే పుస్తకాన్ని నేడు డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఇతర శాఖల ఉద్యోగులకు పోలీసు ఉద్యోగులకు వ్యత్యాసం ఉందని, ఈ నేపథ్యంలోనే పోలీసు సిబ్బందికి, అధికారుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత నిస్తున్నామన్నారు. ఇటీవల సిద్ధిపేట జిల్లాల్లో నిర్మించిన కన్వెన్షన్ హాల్ పోలీసు కుటుంబాలు నిర్వహించే పలు కార్యక్రమాలకు ఉపయోగపడుతోందని, ఇదేమాదిరిగా ప్రతీ జిల్లాలో ఫంక్షన్ హాళ్ల నిర్మాణానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. పోలీసు శాఖలో అమలవుతున్న ఆరోగ్య భద్రత పధకం ఇప్పటికీ ఆదర్శవంతంగా కొనసాగుతోందని గుర్తు చేశారు. ప్రతీ పోలీసు తన పదవీ విరమణ నాటికి కనీసం స్వంత ఇల్లు నిర్మించుకోవాలనే లక్ష్యంగా తగు సహాయ, సహకారాలను శాఖ పరంగా కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. పోలీసు విధి నిర్వహణలో వస్తున్న మార్పులు, సంక్షేమ కార్యక్రమాలు, ఆధునిక పరిజ్ఞానం అమలు తదితర అంశాలను స్పృశిస్తూ గోపీ రెడ్డి రాసిన ఈ వ్యాసాల సంపుటి ముందు ముందు మంచి రెఫరెన్స్ బుక్ గా ఉపయోగపడుతుందని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఈ “సంక్షేమ పోలీసు – వ్యాసాలూ, నివేదికలు” పుస్తకాన్ని పంపించనున్నట్టు తెలిపారు. కాగా, ఈ పుస్తక రచయిత, తెలంగాణా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు ఏదుల గోపిరెడ్డి మాట్లాడుతూ, నిరంతరం ప్రజల రక్షణకై విధినిర్వహణలో ఉండే పోలీసు శాఖ పట్ల ప్రజలలో సానుకూల వైఖరి కల్పించేందుకై ఈ వ్యాసాలను రాశానని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here