బిడ్డా గుర్తు పెట్టుకో..!.. మంత్రి గంగులకు ఈటెల వార్నింగ్
కరీంనగర్ మే 18 (ఎక్స్ ప్రెస్ న్యూస్);: ఈటల రాజేందర్‌పై భూ వ్యవహారాలకు సంబంధించిన ఆరోపణలు వచ్చిన మరుక్షణం నుంచే ఆయన్ను టీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్యశాఖ మంత్రి పదవి నుంచి బర్త్‌రఫ్ చేసిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు ఎమ్మెల్సీ తీవ్ర స్థాయిలో ఈటలపై మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. ఇలా విమర్శించిన వారిలో మంత్రి గంగుల కమలాకర్ కూడా ఒకరు. ఆయన మీడియా ముందుకొస్తే చాలు.. ఇక మాటల యుద్ధమే. ఇలా ఒకసారి రెండు సార్లు కాదు.. ఎన్ని సార్లో.!. అయితే గత కొన్ని రోజులుగా తనపై వరుస విమర్శలు గుప్పిస్తున్న గంగులపై కౌంటర్‌గా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వేదికగా ఈటల మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బిడ్డా.. గంగుల గుర్తుపెట్టుకో అంటూ ఈటల స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘అధికారం ఎవడికీ శాశ్వతం కాదు.. బిడ్డా గంగుల గుర్తు పెట్టుకో. కరీంనగర్ సంపద విధ్వంసం చేశావ్. కరీంనగర్‌ను బొందల గడ్డగా మర్చినావ్. నీ పదవీ పైరవీ వల్ల వచ్చింది. నీ కల్చర్ నాకు తెలుసు. నీ బెదిరింపులకు భయపడను. నా ప్రజలు నిన్ను పాతర పెడతారు. ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు ఒక్క రోజైనా ఇక్కడి ప్రజల బాధను పంచుకున్న వారా?. ఇక్కడ ఎవరి గెలుపులో అయినా సరే మీరు సాయం చేశారా?. నాపై తోడెళ్ళలా దాడులు చేస్తున్నారు. మంత్రిగా సంస్కారం, సభ్యత ఉండాలి. బిడ్డా గుర్తు పెట్టుకో.. ఎవడూ వెయ్యేళ్ళు బ్రతకరు.. అధికారం అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు. హుజురాబాద్ ప్రజలను వేదిస్తున్నావ్’ అని గంగులపై ఘాటు వ్యాఖ్యలు గుప్పిస్తూ ఈటల వార్నింగ్ ఇచ్చారు.