పౌరులందరి భాగస్వామ్యంతో శ్రేష్ఠ భారత్ సాధ్యం

0
112
Spread the love

పౌరులందరి భాగస్వామ్యంతో శ్రేష్ఠ భారత్ సాధ్యం

చలకుర్తి న‌వోద‌య విద్యాలయంలో ఏక్‌భార‌త్ -శ్రేష్ఠ‌భార‌త్ పై అవగాహన కార్యక్రమంలో వక్తలు

వ్యాస రచన, డ్రాయింగ్ పోటీల విజేతలకు బహుమతులు పంపిణీ

ఆకట్టుకున్న విద్యార్థుల కళారూపాలు


పెద్దవూర‌, డిసెంబ‌రు16, 2021 : పౌరులందరి భాగస్వామ్యం, క్రమశిక్షణా యుత సమాజమే భారత దేశాన్ని ప్రపంచ పటంలో ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్ గా నిలబెడుతుంది అని నాగార్జున సాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై.జి.నాయుడు పేర్కొన్నారు.
దేశ స‌మైఖ్య‌త‌, స‌మ‌గ్ర‌త‌ను పెంపొందించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన పిలుపు మేర‌కు కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ‌శాఖ ప‌రిధిలోని ఫీల్డ్ ఔట్‌రీచ్ బ్యూరో, న‌ల్గొండ జిల్లా యూనిట్ ఆధ్వ‌ర్యంలో గురువారం పెద్ద‌వూర మండ‌లం చెల‌కుర్తి జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యంలో ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్ (ఈబీఎస్‌బీ) అనే అంశంపై అవ‌గాహ‌న స‌ద‌స్సు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఐ మాట్లాడుతూ విద్యాలయాలు దేశ సమగ్రత, అభివృద్ధికి పునాదులుగా పేర్కొన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే నైతిక విలువలు, కష్టపడే తత్వం అలవరుచుకోవాలి అని పిలుపునిచ్చారు. అక్కడి నుంచే ఉత్తమ పౌరులుగా ఎదగాలని, అప్పుడే దేశం శ్రేష్ఠంగా నిలబెడుతుంది అని పేర్కొన్నారు. పెడ్డవూర మండల ఎంపీడీఓ శ్యామ్ మాట్లాడుతూ ఉన్నతమైన సంస్కృతి, సంప్రదాయాలను మరింత ముందుకు తీసుకుపో వాల్సిన బాధ్యత నేటి తరాలపై ఉందన్నారు. జిల్లా క్షేత్ర ప్రచార అధికారి కోటేశ్వర రావు మాట్లాడుతూ దేశ సమగ్రత కోసం పాటు పడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ను స్మరించుకుంటూ ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్ పేరుతో అన్ని ప్రాంతాల ప్రజలలో పరస్పర అవగాహన, అనుబంధం పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ నాగరాజ కుమార్ మాట్లాడుతూ ఏకత్వం లో భిన్నత్వం మన దేశ ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది అన్నారు. విభిన్న భాషలు, అలవాట్లు, సంస్కృతులు ఉన్నా ప్రజల మధ్య, రాష్ట్రాల మధ్య ఐక్యత మన దేశ సుసంపన్నతకు నిదర్శనం అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మాజీ ప్రాజెక్టు డైరెక్టర్ సుఖ జీవన బాబు మాట్లాడుతూ అందరూ సమానంగా ఎదగడం, సమాజంలో అన్ని రకాల వివక్షలు పోవాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల‌కు దేశ‌భ‌క్తి, స్వాతంత్ర ఉద్య‌మం త‌దిత‌ర అంశాల‌పై వ్యాస‌ర‌చ‌న‌, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి సర్టిఫికెట్స్, బహుమతులు అందజేశారు. ఆయా రాష్ట్రాల కళ, సంస్కృతితో పాటు పర్యావరణం, దేశ భక్తి పై విద్యార్థులు పాటలు, డ్యాన్స్ రూపంలో కళారూపాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో విద్యార్థులతో పాటు పెద్దవూర ఎస్ఐ పరమేశ్వర్, నవోదయ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here