*హైద‌రాబాద్‌ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు 20వేల మంది ఉద్యోగులు – దాన‌కిషోర్‌*

0
230
Spread the love

*హైద‌రాబాద్‌ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు 20వేల మంది ఉద్యోగులు – దాన‌కిషోర్‌*
*రాజ‌కీయ పార్టీల‌తో స‌మావేశం*

హైద‌రాబాద్ జిల్లాలో నిర్వ‌హించ‌నున్న ఎన్నిక‌ల‌కుగాను 20వేల మంది ఉద్యోగుల‌ను గుర్తించి విధుల‌ను కేటాయించిన‌ట్టు హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల అధికారి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ తెలియ‌జేశారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ఏర్పాట్ల‌పై నేడు సాయంత్రం జిల్లాలోని రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల స‌మావేశాన్ని నిర్వ‌హించారు. న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీకుమార్‌, అడిష‌న‌ల్ పోలీస్ కమిష‌న‌ర్ దేవేంద‌ర్‌సింగ్ చౌహాన్‌, రిట‌ర్నింగ్ అధికారులు, ఎక్సైజ్ పోలీసు అధికారులు ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. దాదాపు మూడున్న‌ర గంట‌ల పాటు సుదీర్ఘంగా కొన‌సాగిన ఈ స‌మావేశంలో దాన‌కిషోర్ మాట్లాడుతూ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు గాను సిబ్బంది నియామ‌కం, పోలింగ్ కేంద్రాల‌కు సిబ్బంది నియామ‌కం, సెక్టోరియ‌ల్‌, రూట్ అధికారుల నియామ‌కం పూర్త‌య్యాయ‌ని తెలిపారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఇప్ప‌టికే 20వేల సిబ్బంది, అధికారుల‌కు తోడు అద‌న‌పు సిబ్బందిని కూడా వివిధ శాఖ‌ల నుండి సేక‌రిస్తున్నామ‌ని తెలియ‌జేశారు. ఎన్నిక‌లను మ‌రింత ప‌క‌డ్బందీగా పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించేందుకుగాను బూత్‌లేవ‌ల్ అధికారుల‌కు ఈ నెల 25 నుండి 30వ తేదీలోపు ప్ర‌త్యేక శిక్ష‌ణ స‌మావేశాల‌ను నిర్వ‌హించనున్నామ‌ని తెలిపారు.
*నియ‌మావ‌ళి అమ‌లుకు సి-విజిల్ యాప్‌*
ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళి మ‌రింత ప‌టిష్టంగా అమ‌లు చేసేందుకుగాను సి-విజిల్ అనే ప్ర‌త్యేక యాప్‌ను భార‌త ఎన్నిక‌ల సంఘం ప్ర‌వేశ‌పెడుతుంద‌ని తెలిపారు. ఎక్క‌డైన ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళి అతిక్ర‌మించే సంఘ‌ట‌న‌లు ఎదురయితే వాటిని వీడియో తీసి ఈ యాప్‌లో అప్‌లోడ్ చేయాల‌ని న‌గ‌రవాసుల‌కు సూచించారు. ఈ యాప్ ద్వారా అందే ఫిర్యాదుల‌పై వెంట‌నే చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. అదేవిధంగా ఎన్నిక‌ల ప్ర‌చారానికి సంబంధించి ర్యాలీలు, స‌భ‌లు, స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌కు ముంద‌స్తు అనుమ‌తి పొంద‌డానికి ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ఇ-సువిధను కూడా ప్ర‌వేశ‌పెడుతున్నామ‌ని తెలిపారు. ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని అనుస‌రించి ఉద‌యం 6గంట‌ల నుండి రాత్రి 10గంట‌ల లోపు మాత్ర‌మే ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హించాల‌ని పేర్కొన్నారు.
*న‌గ‌రంలో మ‌ద్యం అమ్మ‌కాల‌పై నిఘా*
ఎన్నిక‌ల నేప‌థ్యంలో హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌ద్యం అమ్మ‌కాలపై ప్ర‌త్యేక నిఘా ఉంచామ‌ని దాన‌కిషోర్ వెల్లడించారు. ప్ర‌తిరోజు జ‌రిగే మ‌ద్యం అమ్మ‌కాలపై నియంత్ర‌ణ‌, గ‌తంలో జ‌రిగిన అమ్మ‌కాలకు గ‌ల వ్య‌త్యాసాన్ని కూడా ప‌రిశీలిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. ఇందుకుగాను హైద‌రాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారులతో ప్ర‌త్యేక నిఘా ఏర్పాటు చేసిన‌ట్టు పేర్కొన్నారు.
*దివ్యాంగుల సౌక‌ర్యానికి ప్ర‌త్యేక యాప్‌*
ఈ సారి ఎన్నిక‌ల్లో దివ్యాంగుల ఓటింగ్ శాతాన్ని పెంపొందించేందుకు చేప‌ట్టిన చ‌ర్య‌లో భాగంగా ప్ర‌త్యేక యాప్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్టు హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల అధికారి ఎం.దాన‌కిషోర్ తెలిపారు. ఈ యాప్ ద్వారా దివ్యాంగులు తాము ఓటింగ్‌కు ఎప్పుడు వ‌చ్చేది వాయిస్ మెస్సేజ్ పంపిస్తే వారికి త‌గు ర‌వాణా, స‌హాయ‌కుల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు వివ‌రించారు. ఇప్ప‌టికే ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ దివ్యాంగుల ఓట‌ర్లను గుర్తించే ప్ర‌క్రియ పురోగ‌తిలో ఉంద‌ని పేర్కొన్నారు.
*ఎన్నిక‌ల సంఘం అనుమ‌తితోనే అధికారుల బ‌దిలీలు*
హైద‌రాబాద్ జిల్లాలో వ‌రుస‌గా మూడు సంవ‌త్స‌రాలు ప‌నిచేయ‌డం, గ‌త ఎన్నిక‌ల్లో రిట‌ర్నింగ్ అధికారి లేదా అసిస్టెంట్ రిట‌ర్నింగ్ అధికారిగా ప‌నిచేసిన అధికారుల‌ను ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని అనుస‌రించి ప్ర‌స్తుత ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో ఆర్వో లేదా ఏఆర్వోగా నియ‌మించ‌డంలేద‌ని దాన‌కిషోర్ స్ప‌ష్టం చేశారు. ఎన్నిక‌ల సంఘం అనుమ‌తితోనే అధికారుల బ‌దిలీ చేసిన‌ట్టు తెలియ‌జేశారు.
*ఓటింగ్ శాతాన్ని పెంపుకు ముమ్మ‌ర ప్ర‌చారం*
హైద‌రాబాద్ జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు గ‌త ఎన్నిక‌ల్లో 50శాతం ఓటింగ్ మాత్ర‌మే జ‌రిగింద‌ని, ఈ సారి ఎన్నిక‌ల్లో ఓటింగ్ శాతాన్ని పెంపొందించడానికి ఓట‌రు చైత‌న్య కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్టు జిల్లా ఎన్నిక‌ల అధికారి దాన‌కిషోర్ అన్నారు. ఇప్ప‌టికే 84 ప్రాంతాల్లో శాశ్వ‌త ఈవీఎం, వీవీప్యాట్‌ల అవ‌గాహ‌న కేంద్రాల‌ను ఏర్పాటుచేశామ‌ని, మ‌రో 18మొబైల్ వాహ‌నాల ద్వారా చైత‌న్య కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. ఒకే ఇంటి నెంబ‌ర్‌పై పెద్ద సంఖ్య‌లో ఓట‌ర్లు ఉన్నార‌ని ప‌లువురు చేసిన ఆరోప‌ణ‌ల‌పై పూర్తిస్థాయిలో విచార‌ణ నిర్వ‌హించామ‌ని తెలిపారు.
*ప్ర‌తి 1,400 ఓట‌ర్ల‌కు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు*
హైద‌రాబాద్ జిల్లాలో ప్ర‌తి 1,400 ఓట‌ర్ల‌కు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామ‌ని, 1,400 ఓట్లు మించితే అద‌నంగా ఆగ్జిల‌రి పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. హైద‌రాబాద్ జిల్లాలో ప్ర‌స్తుతం ఉన్న 3,826 పోలింగ్ కేంద్రాల‌కు అద‌నంగా పెరిగిన ఓట‌ర్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ఆగ్జిల‌రీ పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. పోలింగ్ స్టేష‌న్ల మార్పిడి గురించి రిట‌ర్నింగ్ అధికారులు త‌మ ప‌రిధిలోని రాజ‌కీయ పార్టీల‌తో స‌మావేశం నిర్వ‌హించి వివ‌రించాల‌ని సూచించారు. ఏదైన పోలింగ్ కేంద్రాన్ని త‌ప్ప‌నిస‌రిగా మార్చాల్సి వ‌స్తే ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌లో ఏర్పాటు చేయ‌డానికి ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్టు తెలియ‌జేశారు.
*రూ. 2.26 కోట్ల స్వాధీనం*
ప్ర‌స్తుత ఎన్నిక‌ల సంద‌ర్భంగా హైద‌రాబాద్ జిల్లాలో జ‌రిపిన సోదాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 2.26 కోట్లను స్వాధీన‌ప‌ర్చుకున్న‌ట్టు హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీకుమార్ వెల్ల‌డించారు. న‌గ‌రంలో ఎన్నిక‌ల‌ను ప్ర‌శాంతంగా, నిస్పాక్షికంగా నిర్వ‌హించేందుకు పోలీసు శాఖ కృషిచేస్తుంద‌ని అన్నారు. ఇప్ప‌టికే ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని అనుస‌రించి దీర్ఘ‌కాలికంగా ప‌నిచేసే పోలీసు అధికారుల బ‌దిలీల‌ను ఎన్నిక‌ల సంఘం అనుమ‌తితో 80శాతం పూర్తిచేశామ‌ని అంజ‌నీకుమార్ తెలిపారు. అనంత‌రం రిట‌ర్నింగ్ అధికారులు పోలీసు అధికారుల‌తో జిల్లా ఎన్నిక‌ల అధికారి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ ఎన్నిక‌ల సంద‌ర్భంగా పోలీసు అధికారులు, రిట‌ర్నింగ్ అధికారులు మ‌రింత స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని దాన‌కిషోర్ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here