‘జీఇఎం’ స్థూల వాణిజ్య సరకుల విలువే పోర్ట‌ల్ విజ‌యాన్ని సూచిస్తోంది – విక్రమజీత్

0
57
Spread the love

ప్రభుత్వ ఇ-మార్కెట్‌ వేదిక పారదర్శకత.. సామర్థ్యంపై
‘జీఇఎం విక్రేతల కార్యశాల’ సందర్భంగా ప్రభుత్వానికి విక్రేతల ప్రశంసలు

(TOOFAN – Hyderabad)

ప్రభుత్వ కార్యాలయాల ద్వారా వస్తుసేవల ఆన్‌లైన్‌ కొనుగోలుకు వీలుకల్పించే ప్రభుత్వ ఇ-విక్రయ వేదిక (జీఇఎం) హైదరాబాద్‌కు చెందిన విక్రేతలతో ఇవాళ నగరంలోని పత్రికా సమాచార సంస్థ ప్రాంగణంలో కార్యశాల (వర్క్‌ షాప్‌) నిర్వహించింది. ‘జీఇఎం’ (gem.gov.in) అంటే- ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వంలోని ఇతర ఉన్నత, స్వయంప్రతిపత్తిగల వ్యవస్థల ద్వారా వస్తుసేవల కొనుగోలుకు ఉద్దేశించిన ప్రభుత్వ వ్యవస్థ. దీనికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 25 మంది విక్రేతలు ఈ ‘విక్రేతల కార్యశాల’లో పాల్గొన్నారు. వీరిలో అధిశాతం తొలిసారి ‘ఎంఎస్‌ఎంఈ’ వ్యవస్థాపకులే కావడం విశేషం. 
ఈ సందర్భంగా ‘జీఇఎం’కు సంబంధించిన వివరాలను సేవల విభాగం డైరెక్టర్‌ శ్రీ విక్రమజీత్ వర్మ వెల్లడించారు. ఇదొక ప్రగతిశీల వినియోగహిత, స్వయంచాలక పోర్టల్‌ అని, దీన్ని కేంద్ర వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2016 ఆగస్టు 9న ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు. ఈ వేదిక కింద నమోదైన దాదాపు 51,23,042 మంది విక్రేతలు సుమారు 50 లక్షల ఉత్పత్తులు, సేవలను అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ‘జీఇఎం’ స్థూల వాణిజ్య సరకుల విలువ ప్రస్తుతం రూ.1,06,647 కోట్లుగా ఉందని, దీన్నిబట్టి పోర్టల్ ఎంతగా విజయవంతమైందో అర్థం చేసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. 
‘జీఇఎం’ ద్వారా విక్రేతలు తమ ఉత్పత్తులు, సేవలను నమోదు చేసుకుని, విక్రయించడానికి వీలుగా ఇలాంటి కార్యశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ సమాచార సాంకేతిక-ఎలక్ట్రానిక్స్‌-కమ్యూనికేషన్స్‌ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ పెండ్యాల ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాకుండా వస్తుసేవల కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలుదారు సంస్థలకూ కార్యశాలలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. వ్యక్తిగత పారిశ్రామికవేత్తలతోపాటు ‘ఎంఎస్‌ఎంఈ’లు కూడా వీటిలో పాల్గొనేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు ‘జీఇఎం’ వ్యాపార సమన్వయకర్త శ్రీ రవివర్మ ఈ వేదిక ప్రత్యేకతల గురించి వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు. ఇది ప్రత్యక్ష ప్రమేయ రహిత, కాగిత రహిత, నగదు రహిత ప్రత్యకతలు కలిగినది మాత్రమేగాక సామర్థ్యం, పారదర్శకత, సార్వజనీనతలతో కూడినదని ఆయన స్పష్టంగా వివరించారు. అనంతరం కొందరు విక్రేతలు తమ అనుభవాలను పంచుకుంటూ తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా తమ వ్యాపార విస్తరణకు ‘జీఇఎం’ వేదిక ఏ విధంగా తోడ్పడిందీ వెల్లడించారు. 
అంతకుముందు పీఐబీ డైరెక్టర్ శ్రీమతి శృతి పాటిల్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులను పరిచయం చేశారు. దేశవ్యాప్తంగా ఇటువంటి ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యవస్థాపకులు-కొనుగోలుదారులు తమ విజయగాథలను ఈ కార్యక్రమాల్లో పరస్పరం వెల్లడించుకునే వీలు కలుగుతుందని ఆమె అన్నారు. తద్వారా బలమైన ‘జీఇఎం’ వేదికపై ప్రభుత్వ కొనుగోళ్లలో సంపూర్ణ ప్రయోజనం పొందగలగడం సాధ్యం కాగలదని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here