*ఎన్నిక‌ల వ్య‌య ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ప‌లు క‌మిటీల ఏర్పాటు – దాన‌కిషోర్‌*

0
199
Spread the love

ప్ర‌స్తుత సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో పోటిచేసే అభ్య‌ర్థి రూ. 70ల‌క్ష‌లు ఎన్నిక‌ల వ్య‌య ప‌రిమితిగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింద‌ని జిల్లా ఎన్నిక‌ల అధికారి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ తెలిపారు. ఎన్నిక‌ల ఏర్పాట్లు, అద‌న‌పు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నిక‌ల ప్ర‌చార వ‌స్తువుల ధ‌ర నిర్ణ‌యం త‌దిత‌ర అంశాల‌పై నేడు జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. హైద‌రాబాద్‌, సికింద్రాబాద్ పార్ల‌మెంట్ స్థానాల రిట‌ర్నింగ్ అధికారులు మాణిక్‌రాజ్‌, ర‌విల‌తో పాటు అసిస్టెంట్ రిట‌ర్నింగ్ అధికారులు, నోడ‌ల్ అధికారులు ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ మాట్లాడుతూ ప్ర‌స్తుత లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పోటీచేసే అభ్య‌ర్థులు నామినేష‌న్ ద‌రావ‌తుకు రూ. 25వేలు చెల్లించాల్సి ఉంటుంద‌ని, ప్ర‌తిరోజు హైద‌రాబాద్, సికింద్రాబాద్ పార్ల‌మెంట్ స్థానాల‌కు నామినేష‌న్ల‌ను 11 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 3గంట‌ల‌లోపు హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో సంబంధిత రిట‌ర్నింగ్ అధికారులు స్వీక‌రించ‌డం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టంచేశారు. రాజ‌కీయ పార్టీలు చేప‌ట్టే ఎన్నిక‌ల వ్య‌యంపై గ‌ట్టి నిఘా ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని, ఇప్ప‌టికే ఎన్నిక‌ల వ్య‌య ప‌ర్య‌వేక్ష‌ణ‌కుగాను ఫ్లైయింగ్ స్క్వార్డ్‌లు, స్టాటిక్ స‌ర్వేలెన్స్‌టీమ్‌లు, వీడియో స‌ర్వేలెన్స్ టీమ్‌లు, అకౌంటింగ్ టీముల‌తో పాటు మీడియా మానిట‌రింగ్ టీమ్‌ల‌ను కూడా ఏర్పాటు చేశామ‌ని స్ప‌ష్టం చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా గోడ‌ల‌పై రాత‌లు, పోస్ట‌ర్ల‌ను అతికించ‌డం, క‌టౌట్లు, బ్యాన‌ర్లు, హోర్డింగ్‌ల ఏర్పాటు చేయ‌రాద‌ని స్ప‌ష్టం చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చార క‌ర‌ప‌త్రాలు, పోస్ట‌ర్ల‌పై త‌ప్ప‌నిస‌రిగా ముద్రించిన‌వారి పేరు, ముద్ర‌ణ ప్రెస్ పేర్ల‌ను విధిగా ముద్రించాల‌ని స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్ జిల్లాలో ప్ర‌స్తుతం 3,976 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయ‌ని, ఇటీవ‌ల నూతన ఓట‌ర్ల చేరిక నేప‌థ్యంలో ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1400 ఓట్లు ఉండాల‌న్న నిబంధ‌న‌ల మేర‌కు అద‌నంగా 19 పోలింగ్ కేంద్రాలు అధిక‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. అయితే ఒక్కో పోలింగ్ స్టేష‌న్‌లో 1500 ఓట‌ర్లు ఉండాల‌నే నిబంధ‌న‌ను ఎన్నిక‌ల సంఘం అంగీక‌రిస్తే కేవ‌లం 3 అద‌న‌పు పోలింగ్ స్టేష‌న్లు మాత్ర‌మే ఏర్పాటు చేయాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే 100 ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మిష‌న్ల ద్వారా న‌గ‌ర ఓట‌ర్ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నామ‌ని, మ‌రో 120 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిష‌న్ల‌తో పిఓ, ఏపిఓల‌కు శిక్ష‌ణ క‌ల్పిస్తున్నామ‌ని వివ‌రించారు. ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక మోడ‌ల్ పోలింగ్ స్టేష‌న్‌ను ఏర్పాటు చేయ‌డంతో పాటు వేస‌విని దృష్టిలో పెట్టుకొని పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఓట‌ర్ల‌కు నీడ‌ను క‌ల్పించేందుకుగాను ప్ర‌త్యేకంగా టెంట్‌ల‌ను కూడా వేయ‌నున్న‌ట్టు తెలియ‌జేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా చేప‌ట్టే ప్ర‌చార సామాగ్రికి ధ‌ర‌లు నిర్థారించ‌డం జ‌రిగింద‌ని, వీటి విష‌యంలో ఏదైనా అభ్యంత‌రాలు ఉంటే తెలియ‌జేయాల‌ని క‌మిష‌న‌ర్ రాజ‌కీయ పార్టీల‌కు సూచించారు. ఈ స‌మావేశంలో నోడ‌ల్ అధికారులు అద్వైత్‌కుమార్‌సింగ్‌, విశ్వ‌జిత్ కంపాటి, ముషార‌ఫ్ అలీ, సిక్తాప‌ట్నాయక్‌, జ‌య‌రాజ్ కెన‌డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here