*ఓట‌ర్ల జాబితా ప్ర‌క్షాళ‌న‌కు మూడంచెల విధానం – దాన‌కిషోర్‌*

0
136
Spread the love

 

*ఓట‌ర్ల జాబితా ప్ర‌క్షాళ‌న‌కు మూడంచెల విధానం – దాన‌కిషోర్‌*
*ఓట‌ర్ల జాబితాను జ‌ల్లెడ ప‌ట్టండి…రెవెన్యూ అధికారుల‌తో స‌మావేశం*

హైద‌రాబాద్ జిల్లాలో ఓట‌ర్ల జాబితాను మ‌రింత ప‌క‌డ్బందీగా రూపొందించ‌డానికి ప్రత్యేకంగా నియ‌మించిన ఏడుగురు డిప్యూటి క‌లెక్ట‌ర్లు, 15మంది త‌హ‌శీల్దార్లు, 100మంది వీఆర్వోలతో నేడు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ ప్ర‌త్యేక సమావేశం నిర్వ‌హించారు. హైద‌రాబాద్‌ జాయింట్ క‌లెక్ట‌ర్ ర‌వి, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ కెన‌డి త‌దిత‌రులు కూడా హాజ‌రైన ఈ స‌మావేశంలో క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ మాట్లాడుతూ హైద‌రాబాద్ న‌గ‌ర ఓట‌ర్ల‌ జాబితాను పూర్తిస్థాయిలో ప్ర‌క్షాళ‌న‌చేసి ఆద‌ర్శ‌వంత‌మైన ఓట‌రు జాబితాగా రూపొందించ‌డంలో రెవెన్యూ శాఖ స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని కోరారు. ఇప్ప‌టికే జీహెచ్ఎంసీకి చెందిన ఏడుగురు యువ ఐఏఎస్ అధికారులు, సీనియ‌ర్ అధికారులు, జోన‌ల్ క‌మిష‌న‌ర్లతో క‌లిపి 200మంది అధికారుల‌ను సూప‌ర్‌వైజ‌రీ అధికారులుగా నియ‌మించామ‌ని పేర్కొన్నారు. హైద‌రాబాద్ జిల్లాలో 75,654 డ‌బుల్ ఎంట్రీ ఓట‌ర్లు, 2014 నుండి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన 1.22ల‌క్ష‌ల మంది ఓట‌ర్ల జాబితా, 11,974 చిరునామా మారిన జాబితాలను క్షుణ్ణంగా ప‌రిశీలించేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది, బూత్ లేవ‌ల్ అధికారులకు ఇచ్చామ‌ని తెలిపారు. హైద‌రాబాద్‌లోని 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట‌ర్ల జాబితాలో మార్పులుచేర్పుల‌పై వ‌చ్చిన క్లేయిమ్‌ల‌ను ఇప్ప‌టికే బూత్ లేవ‌ల్ అధికారులు, ప్ర‌తి ఐదు పోలింగ్ బూత్‌ల‌కు ఒక ప‌ర్య‌వేక్ష‌క అధికారి ఇంటింటికి తిరిగి విచారిస్తున్నార‌ని పేర్కొన్నారు. ఈ బీ.ఎల్‌.ఓలు, సూప‌ర్‌వైజ‌రీ అధికారులు మ‌ర‌ణించిన‌వారి ఓట్ల‌ను తొల‌గించ‌డం, డ‌బుల్ ఎంట్రీ ఓట్ల‌ను గుర్తించి నోటీసులు జారీచేయ‌డం, 18 ఏళ్లు నిండిన‌వారిని ఓటర్లుగా న‌మోదు చేయించ‌డంతో పాటు ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో క‌నీసం వెయ్యి మంది ప్ర‌ముఖుల ఓట్ల పై మ‌రోసారి క్షుణ్ణంగా త‌నిఖీచేసే ప్ర‌క్రియ‌ను చేప‌ట్టార‌ని దాన‌కిషోర్ వివ‌రించారు. ఓట‌ర్ల జాబితాలో త‌మ ఓటు ఉన్న‌ది, లేనిది తెలుసుకోవ‌డంతో పాటు క్లేయిమ్‌లు, అభ్యంత‌రాలు స‌మ‌ర్పించాల‌ని కోరుతూ న‌గ‌రంలోని 10,36,000 మంది ఆస్తిప‌న్ను చెల్లింపుదారుల‌కు ఎస్‌.ఎం.ఎస్‌లు పంపించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. హైద‌రాబాద్ జిల్లాలో ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ‌కు జీహెచ్ఎంసీతో పాటు ఇత‌ర శాఖ‌ల అధికారులు, సిబ్బంది సేవ‌ల‌ను ఉప‌యోగించ‌డం జ‌రిగింద‌ని, జాబితా స‌వ‌ర‌ణ‌ను మ‌రింత ప‌క‌డ్బందీగా చేప‌ట్టడానికి మొట్ట‌మొద‌టి సారిగా రెవెన్యూ శాఖ యంత్రాంగాన్ని హైద‌రాబాద్‌లో పూర్తిస్థాయిలో ఉప‌యోగించ‌నున్న‌ట్టు క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు. రెవెన్యూ అధికారుల‌కు ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గాల వారిగా జాబితాల‌ను అంద‌జేశామ‌ని, వాటిలో ఒకే ఓట‌రు ఒకే పోలింగ్ ప‌రిధిలో, నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో, ఇత‌ర జిల్లాల ప‌రిధిలో ఓట‌రుగా న‌మోదు అయితే ఎన్నిక‌ల సంఘం ఇటీవ‌ల అందించిన ఆధునిక సాఫ్ట్‌వేర్ ఇ.ఆర్‌.ఓనెట్ 2.5 ద్వారా గుర్తించడం జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. బ‌హుళ ఓట‌రుగా న‌మోదు అయితే త‌గు నోటీసులు అంద‌జేసి కోరుకున్న ప‌రిధిలోనే ఒకే ఓటు ఉండేవిధంగా చ‌ర్య‌లు చేపడుతున్న‌ట్టు పేర్కొన్నారు. ఈ స‌మావేశంలో ఎన్నిక‌ల విభాగం జాయింట్ క‌మిష‌న‌ర్ పంక‌జ త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here