మేయర్ గా మొదటి సంవత్సరం సేవలు సంతృప్తి:  మేయర్

0
59
Spread the love
*మేయర్ గా మొదటి సంవత్సరం సేవలు సంతృప్తి:  మేయర్ గద్వాల్ విజయలక్ష్మి*
 
 
*హైదరాబాద్, ఫిబ్రవరి 10 (Toofan):*   హైదరాబాద్ నగర మేయర్ గా మొదటి సంవత్సరం సేవలు సంతృప్తినిచ్చాయని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. అందుకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.ఆర్, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, అధికారులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నేటికి ఒక సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో మేయర్ డిప్యూటి మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ…. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేసేందుకు కృషి చేసినట్లు తెలిపారు. సిగ్నల్ ఫ్రీ నగరం గా తీర్చిదిద్దడంలో భాగంగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు, రైల్వే ఓవర్ బ్రిడ్జి లు, లింక్, మిస్సింగ్ రోడ్ల నిర్మాణం భారీ ఎత్తున చేపట్టినట్లు తెలిపారు. ఈ సంవత్సరం బాలానగర్, అబ్దుల్ కలామ్ ఫ్లైఓవర్, షేక్ పేట్ ఫ్లైఓవర్ లు అందుబాటులోకి రావడం జరిగింది. మార్చి వరకు మరో మూడు ప్రాజెక్టులు తుకారం రైల్వే గేట్, ఎల్బీనగర్ కుడివైపు అండర్ పాస్ లు, బహదూర్ పుర ఫ్లైఓవర్ లు అందుబాటులోకి వస్తాయని, మిగతా 22 ప్రాజెక్ట్ లు ఈ సంవత్సరం డిసెంబర్ నెలాఖరు లోగా పూర్తి చేసి అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వివరించారు. 
 
                    హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాలు, సుందరీకరణ, రహదారులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. గత సంవత్సరంలో కురిసిన అకాల వర్షాలకు ఏర్పడిన వరదతో చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి, దానిని నివారించేందుకు కేటీఆర్ గారు ముందు చూపుతో నాలా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ఎస్.ఎన్.డి.పి ద్వారా నాలాల అభివృద్ది చేసేందుకు మొదటి దశలో రూ. 858 కోట్లతో 52 పనులను ప్రాతిపాధించగా అందులో 32 పనులు టెండర్లు పిలువడం జరిగిందని వాటిలో ప్రాధాన్యత గల 17 పనులు ప్రారంభమయ్యాయని అట్టి పనులు మే నెలాఖరు లోగా పూర్తి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వేగవంతం గా చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆమె పేర్కొన్నారు. 
 
                        సి.ఆర్.ఎం.పి ద్వారా 709 కిలోమీటర్ల రోడ్డును అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 468 కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగిందని మిగతా రోడ్డును రానున్న నిర్దేశించిన కాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రోడ్లపై ఏర్పడిన గుంతలను సత్వరమే పూడ్చేసినందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, ఇప్పటి వరకు 1670 పాట్ హోల్స్ కు మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ ని నియంత్రణ, క్రమబద్దీకరణ చేసే ప్రక్రియలో 90 కూడళ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించగా ఇప్పటి వరకు 69 జంక్షన్ల అభివృద్ధి చేయడం జరిగింది. మరో 21 ప్రదేశాలలో చేపట్టిన జంక్షన్ అభివృద్ధి పనులు వివిధ అభివృద్ధి దశలో ఉన్నాయన్నారు.
 
                 పాదాచారుల సౌకర్యం కోసం రూ. 128 కోట్ల వ్యయంతో 21 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టగా అందులో 4 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తి అయినట్లు, వివిధ ప్రదేశాలలో చేపట్టిన మిగతా 17 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం నిర్దేశించిన కాల వ్యవధిలో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. 
 
            హైదరాబాద్ నగరంలో పర్యావరణ పరిరక్షణకు పెద్ద ఎత్తున సుందరీకరణ, అర్బన్ పార్కులు, చెరువుల సుందరీకరణ, వర్టికల్ గార్డెన్స్, యాదాద్రి మోడల్ పార్కుల ను విస్తృతంగా చేపట్టి ముందు తరాలకు ప్రాణవాయువును అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మానస పుత్రిక అయిన తెలంగాణకు హరితహారం పథకం ద్వారా 2021 సంవత్సరానికి 1.20 కోట్ల మొక్కల లక్ష్యానికి గాను లక్ష్యాన్ని మించి 1.23 కోట్ల మొక్కలను నాటడంతో పాటు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. గాజులరామారం, శంషాబాద్ మాదన్నగూడ లలో అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. బడ్జెట్ లో పది శాతం నిధులకు గ్రీనరి కోసం కేటాయింపు జరుగుతుందని, జిహెచ్ఎంసి పరిధిలో 4846 కాలనీలు ఉండగా అందులో 900 కాలనీలలో పార్కుల అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. 
 
 
               దేశంలో ఎక్కడ లేని విధంగా నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను అందించడం జరుగుతుందని తెలిపారు. జిహెచ్ఎంసి పరిధిలో 111 లొకేషన్లలో ఒక లక్ష గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 65 వేల గృహాలు వివిధ లొకేషన్లలో నిర్మించడం జరిగిందని తెలిపారు. సుమారు 5 వేల మందికి నిరుపేదలకు పంపిణీ చేయడం జరిగిందని, మిగతా గృహాలను అర్హులైన నిరుపేదలకు లాటరీ ద్వారా అందించడం జరుగుతుందన్నారు. కొల్లూరు -2 హౌసింగ్ ప్రాజెక్ట్ లో 117 బ్లాక్ లలో 15,600 గృహాలను నిర్మించినట్లు కె.టి.ఆర్ ఆదేశాల మేరకు తాను డిప్యూటీ మేయర్ కలిసి పరిశీలించడం జరిగిందని తెలిపారు. 
 
                  కోవిడ్ నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని, కోవిడ్ తో బాధపడుతున్న వారికి  24 గంటల పాటు సేవలు అందించేందుకు కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కంట్రోల్ రూం కు ఫోన్ చేసిన ఫిర్యాదుదారులకు అన్ని విధాల సలహాలు, సహయ సహకారాలు అందించడం జరిగిందని తెలిపారు. ఇంటింటి ఫీవర్ సర్వే, కోవిడ్ టెస్టులు, వ్యాక్సినేషన్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో  అహర్నిషలు కృషిచేసిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. 
 
                 నిరుపేదల ఆరోగ్య పరిస్థితి ని మెరుగుపరచడానికి బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నగరంలో 350 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించగా ఇప్పటి వరకు 256 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయడం వలన నిరుపేదలకు ఎంతో ప్రయోజనం పొందారని, మరో 34 బస్తీ దవాఖానలు త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు, డివిజన్ లో మూడు లేదా నాలుగు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని మంత్రివర్యులను కోరామని అన్నారు.  
 
             లాక్ డౌన్ సమయంలో వీధి వ్యాపారులను ఆదుకునేందుకు పి.ఎం స్వానిధి కింద ఆర్థిక సహాయం అందించడం జరిగిందని, మొదటి దశలో రూ. 52 కోట్లు ఆర్థిక సహాయం అందించడం లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామన్నారు. వీధి వ్యాపారుల వల్ల ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా వెండర్ జోన్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 
 
             నగరంలో సాంప్రదాయబద్దంగా అన్ని పండుగలు ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. గణేష్ ఉత్సవాలు, బతుకమ్మ, బోనాల పండుగలను కోవిడ్ నిబంధనలను పాటిస్తూ నిర్వహించడం జరిగిందని తెలిపారు. 
 
 నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు   డ్రైవర్ కం ఓనర్ పథకం కింద ఇప్పటి వరకు మొత్తం 4500 స్వచ్ఛ ఆటోలను పంపిణీ చేయడం జరిగిందని, ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించడం జరుగుతుందని, ప్రజలు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని, అందుకు చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా స్వచ్ఛ ఆటోలకు అందజేయాలని ఆమె నగర ప్రజలను కోరారు.  మహిళలపై జరుగుతున్న వేధింపులు సహించేది లేదని అన్నారు. ఇటీవల జిహెచ్ఎంసి లో జరిగిన సంఘటనకు సంబంధిత వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అంతకు ముందు  ఏడాది పాటు చేసిన పలు కార్యక్రమాలు, సాధించిన ప్రగతి, సేవా కార్యక్రమాల పై ఆమె అభిమానులు తయారుచేసి తీసిన బుక్ లెట్ ను డిప్యూటీ మేయర్ తో కలిసి మేయర్ విడుదల చేశారు.
 
  డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ… నగర అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.ఆర్ గారు సహకారంతో నగరంలో మౌలిక సదుపాయాలు, ప్రజల అవసరాలను గుర్తించి పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. జిహెచ్ఎంసిలో రహదారుల అభివృద్ధి చేయడం జరిగిందని, భవిష్యత్ లో ప్రజల అవసరాల మేరకు పనులు చేపట్టి జిహెచ్ఎంసి అభివృద్ది పథంలో పయణించేందుకు అందరి సమన్వయంతో ముందుకు పోతామని ఆమె అన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here