*న‌గ‌రంలో 7,300 మెట్రిక్ ట‌న్నుల అద‌న‌పు వ్య‌ర్థాల‌ను తొల‌గించిన బ‌ల్దియా*

0
321
Spread the love
*న‌గ‌రంలో 7,300 మెట్రిక్ ట‌న్నుల అద‌న‌పు వ్య‌ర్థాల‌ను తొల‌గించిన బ‌ల్దియా*
*80వేల విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం*
 
  గ‌ణేష్‌ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా న‌గ‌రంలో గ‌త నాలుగురోజులుగా అద‌నంగా  దాదాపు 7,300 మెట్రిక్ ట‌న్నుల వ్య‌ర్థాలు, చెత్త‌ను జీహెచ్ఎంసి తొల‌గించింది.  ప్ర‌తిరోజు దాదాపు 4,500 మెట్రిక్ ట‌న్నుల చెత్త న‌గ‌రంలో ఉత్ప‌త్తి అవుతుండ‌గా కేవ‌లం ఆదివారం నాడు అద‌నంగా 2,060 మెట్రిక్ ట‌న్నుల‌ చెత్తను ప్ర‌త్యేకంగా సేక‌రించారు. ప్ర‌ధానంగా ఈ నెల 21వ తేదీ మోహ‌ర్రం నుండి నేడు ఉద‌యం వ‌ర‌కు అద‌నంగా 7,100 మెట్రిక్ ట‌న్నుల వ్య‌ర్థాల‌ను తొల‌గించి న‌గ‌రంలోని 17 ట్రాన్స్‌ఫ‌ర్ స్టేష‌న్‌ల‌కు పంపించారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో నిమ‌జ్జ‌న శోభ‌యాత్ర జ‌రిగిన 370 కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో దాదాపు 8,600 మంది పారిశుధ్య కార్మికులను ప్ర‌త్యేకంగా జీహెచ్ఎంసీ నియ‌మించింది. ప్ర‌ధానంగా  ట్యాంక్‌బండ్, న‌క్లెస్‌రోడ్‌, ఎన్టీఆర్ మార్గ్‌, బ‌షిర్‌బాగ్ త‌దిత‌ర మార్గాల్లో జ‌రిగిన గ‌ణేష్ నిమ‌జ్జ‌నానికి వేలాది మంది ప్ర‌జ‌లు రావ‌డం, గ‌ణేష్ మండ‌పాల నుండి వ‌చ్చిన‌ ప‌త్రి, పూలు, ఇత‌ర ప‌దార్థాల‌తో అద‌నంగా చెత్త ఏర్ప‌డింది. వీటిని తొల‌గించ‌డానికి జీహెచ్ఎంసి నియ‌మించిన ప్ర‌త్యేక గ‌ణేష్ యాక్ష‌న్ బృందాలు రేయింప‌గ‌ళ్లు కృషిచేసి ఈ చెత్త‌ను ఎత్తివేయ‌డంలో స‌ఫ‌లీకృత‌మ‌య్యారు. ముఖ్యంగా ప్ర‌ధాన ర‌హ‌దారులలో పారిశుధ్య సిబ్భంది నిర్వ‌హించిన సేవ‌లు శ్లాగ‌నీయ‌మ‌ని, గ‌తంలో జ‌రిగిన నిమ‌జ్జ‌నాల సంద‌ర్భంగా క‌నీసం రెండు రోజుల పాటు ఈ మార్గాలు చెత్తాచెదారంతో ఉండేవ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డ్డారు. నిమ‌జ్జ‌నం రోజైన ఆదివారం నాడు 10వేల మంది పారిశుధ్య, ఎంట‌మాల‌జి సిబ్బంది నిమ‌జ్జ‌న శోభ‌యాత్ర మార్గాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచేందుకు విశేషంగా కృషిచేశార‌ని  జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దానకిషోర్ తెలిపారు.  అదేవిధంగా నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను డ‌య‌ల్ 100, మైజీహెచ్ఎంసీ యాప్‌, జీహెచ్ఎంసీ కాల్ సెంట‌ర్ల ద్వారా అతిత‌క్కువ ఫిర్యాదులు అందాయ‌ని తెలిపారు. ఫిర్యాదుల్లో ప్ర‌ధానంగా  వీధిదీపాల స‌మ‌స్య‌, మ్యాన్‌హోల్ ఓవ‌ర్ ఫ్లో, విద్యుత్ క‌ట్ త‌దిత‌ర అంశాల‌పై అధికంగా ఉన్నాయ‌ని తెలిపారు. 
*గ్రేట‌ర్‌లో 80వేల‌కు పైగా విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం*
న‌గ‌రంలో హుస్సేన్ సాగ‌ర్‌తో పాటు 35 ప్రాంతాల్లో 80వేల‌కు పైగా విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం జ‌రిగింద‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ పేర్కొన్నారు. ఒక హుస్సేన్ సాగ‌ర్‌లోనే 15,500ల‌కు పైగా విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం అయ్యాయ‌ని పేర్కొన్నారు. వివిధ శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యంతో ఏవిధ‌మైన స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా ముగిసింద‌ని క‌మిష‌న‌ర్ తెలిపారు. రికార్డు స్థాయిలో 80వేల విగ్ర‌హాల నిమ‌జ్జ‌నానికి, పారిశుధ్య కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌ను స‌మ‌ర్థ‌వంతంగా చేప‌ట్టినందుకు జీహెచ్ఎంసీ కార్మికుడి నుండి ఉన్న‌తాధికారుల‌ను అభినందిస్తున్న‌ట్టు క‌మిష‌న‌ర్ తెలిపారు.  
*నిమ‌జ్జ‌న కొల‌నుల్లో అధిక సంఖ్య‌లో విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం*
న‌గ‌రంలో చెరువులు కాలుష్యానికి గురికాకుండా ఉండేందుకు గ‌ణేష్ నిమ‌జ్జ‌నానికి ప్ర‌త్యేకంగా నిర్మించిన 23 ప్ర‌త్యేక నిమ‌జ్జ‌న కొల‌నుల‌లో 34,886 విగ్ర‌హాల‌ను నిమ‌జ్జ‌నం చేయ‌డం జ‌రిగింద‌ని క‌మిష‌న‌ర్ తెలియ‌జేశారు. కొన్ని నిమ‌జ్జ‌న కొల‌నుల్లో అధిక సంఖ్య‌లో విగ్ర‌హాల నిమ‌జ్జనం జ‌రిగింద‌ని తెలిపారు. ప్ర‌ధానంగా నెక్నాంపూర్ చెరువు కొల‌నులో 3,659, దుర్గం చెరువులో 3,608, మ‌ల్కం చెరువులో 2,584, రాజేంద్ర‌న‌గ‌ర్ ప‌త్తికుంట కొల‌నులో 2,667, కూక‌ట్‌ప‌ల్లి రంగ‌దామునిచెరువులో 3,214, కుత్బుల్లాపూర్ లింగంచెరువు పాండ్‌లో 2,012, అల్వాల్ కొత్త చెరువులో 2,234 విగ్ర‌హాలను నిమ‌జ్జ‌నం చేశారని దాన‌కిషోర్ పేర్కొన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here