నగరంలో అంటు వ్యాధుల నివారణకు నెలరోజుల పాటు స్పెషల్ డ్రైవ్

0
155
Spread the love

*నగరంలో అంటు వ్యాధుల నివారణకు నెలరోజుల పాటు స్పెషల్ డ్రైవ్ – మేయర్ విజయలక్ష్మి*

*ఎమ్మెల్యే కాలనీలో పట్టణ ప్రగతిలో పాల్గొన్న మేయర్*

*హైదరాబాద్, జులై 01:*   ప్రస్తుత వర్షాకాల నేపథ్యంలో  డెంగ్యూ, మలేరియా తదితర సీజనల్ వ్యాధుల నివారణకై జులై మాసం మొత్తం నెలరోజుల పాటు  ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి పాల్గొన్నారు. కాలనీ పార్కులో మొక్కలు నాటిన అనంతరం ఎంటమాలజి విభాగం ద్వారా నిర్వహించిన సీజనల్ వ్యాధుల నివారణకు చైతన్య కార్యక్రమం మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ… నాణ్యమైన జీవన ప్రమాణాలతో నివసించేందుకై జులై 1వ తేది నుండి పది రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. మన ఇల్లు మాదిరిగానే పరిసరాలు పరిశుభ్రంగాను, పచ్చదనంతో ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ నిబంధనలో భాగంగా హైదరాబాద్ నగరాన్ని బిన్ లెస్ సిటీగా మార్చామని, డస్ట్ బిన్ లను తొలగించినందున ప్రతిఒక్కరూ తమ ఇళ్లలోని చెత్తను స్వచ్ఛ ఆటోలకు విధిగా ఇవ్వాలని నగరవాసులకు మేయర్ విజ్ఞప్తి చేశారు. వర్షాకాలం ప్రారంభమైనందున నీటి సంబంధమైన వ్యాధులు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వీటి నివారణకు నెల రోజుల పాటు నగరంలో విస్తృతంగా అంటు వ్యాధుల నివారణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఎంటమాలజి విభాగం ద్వారా దోమల నివారణ, యాంటి లార్వా స్ప్రేయింగ్,  పోర్టబుల్ ఫాగింగ్ మిషన్ల ద్వారా గృహాలలో ఫాగింగ్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.  దోమలను ఉత్పత్తి చేసే అవకాశం ఉన్న నీటి నిల్వలను తొలగించడం, యాంటి లార్వా కార్యక్రమాలతో పాటు నగరంలోని చెరువులు, కుంటలలో లార్వా నివారణ చర్యలు, ఆయిల్ బాల్స్ వేయడం వంటి కార్యక్రమాలను చేపట్టినట్టు విజయలక్ష్మి తెలిపారు.  ప్రస్తుత వర్షాకాలంలో నాలాల్లో వర్షపునీరు, మురుగునీరు నిరాటంకంగా వెళ్లేందుకు నగరంలోని అన్ని నాలాల్లో పూడికతీత పనులు ముమ్మరంగా చేపట్టామన్నారు. నగరంలో వ్యర్థ పదార్థాలను తొలగించడం, రోడ్ల పక్కన ఉండే పొదలు, పిచ్చిమొక్కలను తొలగించడం, నిర్మాణ వ్యర్థాలను తొలగించడం, పార్కులను శుభ్రపర్చడం వంటి పనులను ఈ పట్టణ ప్రగతిలో చేపడుతున్నామని తెలిపారు.  నగరంలో పచ్చదనం పెంపుకు ప్రస్తుత సంవత్సరంలో హరితహారం కింద కోటి మొక్కలను పంపిణీ, నాటాలనే లక్ష్యంగా నిర్ణయించగా దీనిలో భాగంగా అవెన్యూలు, మీడియన్ లు, ఖాళీ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.  నగరంలోని గుర్తించిన ప్రాంతాల్లో మల్టీలేవల్ ప్లాంటేషన్ ను చేపడుతున్నట్లు వివరించారు.  మొక్కలను నాటడం, వాటిని సంరక్షించడం అనేది ఒక అలవాటుగా మార్చుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ప్రావిణ్య, చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు, డిప్యూటి కమిషనర్ సేవా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here