మంబాపూర్-నల్లవెల్లి అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న ఫార్మా దిగ్గజ సంస్థ హెటిరో డ్రగ్స్

0
74
Spread the love

మంబాపూర్-నల్లవెల్లి అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న ఫార్మా దిగ్గజ సంస్థ హెటిరో డ్రగ్స్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో 2,543 ఎకరాల అటవీ ప్రాంతం అభివృద్దికి ప్రణాళిక

అర్బన్ పార్క్ ఏర్పాటు, రక్షణ చర్యలు, పునరుద్దరణ పనుల ద్వారా అటవీ ప్రాంతం అభివృద్ది

ఐదు కోట్ల రూపాయల చెక్ ను ప్రభుత్వానికి అందించిన హెటిరో చైర్మన్ డాక్టర్ పార్థసారధి రెడ్డి

ఫార్మా దిగ్గజం హెటిరో డ్రగ్స్ సామాజిక బాధ్యతలో భాగంగా పెద్ద ముందడుగు వేసింది. పచ్చదనం పెంపు, అటవీ ప్రాంతాల రక్షణ, అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలో తాను కూడా భాగం అయ్యేందుకు హెటిరో సంస్థ ముందుకు వచ్చింది. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ స్పూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సంగారెడ్డి జిల్లా మంబాపూర్- నల్లవెల్లి అటవీ ప్రాంతాన్ని హెటిరో డ్రగ్స్ ఇవాళ దత్తత తీసుకుంది. దీనిలో భాగంగా ఐదు కోట్ల రూపాయల చెక్ ను హెటిరో చైర్మన్ డాక్టర్ పార్థసారధి రెడ్డి
ప్రభుత్వానికి అందించారు. అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించి, మొక్కలు నాటారు.

హైదరాబాద్ శివారు నర్సాపూర్ రోడ్డులో ఉన్న మంబాపూర్ అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ మూడు కంపార్ట్ మెంట్లలో విస్తరించి ఉంది. దీనిలో మంబాపూర్ (1777 ఎకరాలు), నల్లవెల్లి (766 ఎకరాలు) మొత్తం కలిపి 2,543 ఎకరాల అటవీ భూమి ఉంది. ఇది సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుంది.

గుండ్లపోచంపల్లి, దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కేవలం 15 కిలో మీటర్ల దూరం, 18 నుంచి 20 నిమిషాల ప్రయాణంలో ఈ అటవీ ప్రాంతం ఉంది. ఇటీవల నర్సాపూర్ లో పర్యటించిన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఈ అటవీ ప్రాంతాన్ని తగిన రక్షణాత్మక చర్యల ద్వారా అభివృద్ది పరచాలని ఆదేశించారు. ఔటర్ పక్కన విస్తరిస్తున్న అభివృద్ది చెందుతున్న ప్రాంతాలతో పాటు, సమీప గ్రామాలకు, దుండిగల్ ఎయిర్ ఫోర్స్, పారిశ్రామిక వాడలకు, నర్సాపూర్- మెదక్ – బోధన్ రహదారిపై ప్రయాణీకులకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు.

తెలంగాణకు హరితహారం ద్వారా పచ్చదనం పెంపుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు చాలా గొప్పగా ఉన్నాయని హెటిరో డ్రగ్స్ చైర్మన్ డాక్టర్ పార్థసారధి రెడ్డి ప్రశంసించారు. అదే విధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో ఎం.పీ సంతోష్ కుమార్ కృషి తమకు ఆకర్షించిందని, అందుకే సామాజిక బాధ్యతగా అడవిని దత్తత తీసుకుని అభివృద్దికి సంకల్పించామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా హెటిరో డ్రగ్స్ చొరవను ఎం.పీ సంతోష్ అభినందించారు. ఇటీవల హీరో ప్రభాస్, ఇప్పుడు హెటిరో డ్రగ్స్ వారు పర్యావరణ స్ఫూర్తితో ముందడుగు వేయటం అత్యంత అభినందనీయం అన్నారు. వీరి దారిలోనే మరికొందరు ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. అటవీశాఖ ద్వారా చేపట్టిన వినూత్న కార్యక్రమాలను హెటిరో ప్రతినిధులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివరించారు.

మంబాపూర్ అటవీ ప్రాంతం- ప్రాధాన్యత
నర్సాపూర్ రహదారి పక్కనే ఉన్న మంబాపూర్ అడవిలో కొద్ది ఎకరాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కు అభివృద్ది చేయనున్నారు. అలాగే మొత్తం 2,543 ఎకరాల అటవీ ప్రాంతాన్ని స్థిరీకరించటం, ఆక్రమణలకు గురికాకుండా సుమారు 25 కిలో మీటర్ల పరిధిలో అటవీ ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్ వేయటం, రక్షిత అటవీ ప్రాంతంలోకి మానవ, పెంపుడు జంతువుల ప్రవేశాన్ని నియంత్రించటం ద్వారా సహజ అడవి పునరుద్దరణ హెటిరో అందించే నిధుల ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్ తో పాటు, అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ విస్తరిస్తున్న టౌన్ షిప్ లకు ఈ అడవి స్వచ్చమైన ఆక్సీజన్ ను అందించే లంగ్ స్పేస్ గా మారుతుంది.
నర్సాపూర్ రోడ్డు నుంచి అడవిలో ప్రవేశించిన తర్వాత 2 కిలోమీటర్ల దూరంలో చుక్క గుట్ట అనే కొండ ప్రాంతం ఉంది (సుమారు 630 మీటర్ల ఎత్తు) అక్కడ వ్యూ పాయింట్ ఏర్పాటు, ఎకో ట్రెక్కింగ్, విద్యార్థులకు పర్యావరణ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉంది. ఈ అడవి పచ్చని ప్రకృతితో పాటు, అరుదైన వృక్షజాతులకు, అలాగే జింకలు, మనుబోతులు, తోడేళ్లు, కుందేళ్లు, నెమళ్లు .. లాంటి వన్యప్రాణులకు నెలవుగా ఉంది. తగిన రక్షణ చర్యలు తీసుకుంటే ఈ జంతువుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అటవీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్సీ వి. భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే జీ.మహిపాల్ రెడ్డి, జెడ్పీ చైర్మన్, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు, పీసీసీఎఫ్ ఆర్.శోభ, పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం. దోబ్రియల్, మెదక్ సర్కిల్ సీఎఫ్ శరవణన్, సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు, డీఎఫ్ఓ వెంకటేశ్వరరావు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి రాఘవ, తదితరులు పాల్గొన్నారు.

D Balakrishna, chief Editor - TOOFAN Telugu News Daily. This News Paper and News website runs from Hyderabad, Telangana State India. Telugu breaking news and Current Affairs, Sports, Crimenews, Fashion, Life style, Cricket, Cinema, Tollywood News updates. Political News of India and Telugu States Telangana and Andhrapradesh.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here