ఒక్కో నియోజకవర్గానికి ఒక ఇంజనీరింగ్ శాఖను కేటాయించాలి – మంత్రి హరీష్ రావు

0
137
Spread the love


ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులు సమకూరుస్తూ, అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి ,మన బస్తీ – మన బడి కార్యక్రమం పకడ్బందీగా, ప్రణాళికతో అమలు చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు.

బుధవారం సంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్లు, ఎంపీలు, జడ్పీ చైర్పర్సన్ లు, ఎమ్మెల్సీలు, శాసన సభ్యులు, అదనపు కలెక్టర్లు, ఇంజనీరింగ్ శాఖల అధికారులు, విద్యాశాఖ, ఎస్సీ కార్పొరేషన్, అనుబంధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రెవిన్యూ డివిజనల్ అధికారులతో మన ఊరు- మన బడి, దళిత బంధు, మున్సిపాలిటీలలో నిర్మిస్తున్న సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లూ, వైకుంఠ ధా మా ల పురోగతి తదితర అంశాలపై మంత్రి సమీక్షించి, ఆయా అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మన ఊరు – మన బడి అమలును పకడ్బందీగా చేపట్టాలన్నారు. పన్నెండు రకాల మౌలిక వసతులతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో తొలి విడతగా విద్యార్థుల సంఖ్య ప్రాతిపదికన 1097 ఎంపిక చేశామని, అందులో సంగారెడ్డి జిల్లాలో 441, మెదక్ జిల్లాలో 313, సిద్దిపేట లో 343 పాఠశాలలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆయా బడులలో అవసరమైన మౌలిక సదుపాయాలను గుర్తించాలన్నారు. పాఠశాల నిర్వహణ కమిటీ బాధ్యులు, స్కూల్ హెచ్ ఎం, స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం పెంపొందించుకుని వాస్తవంగా అవసరం ఉన్న పనుల గుర్తింపు జరిగేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. ఈ విషయంలో ఇంజినీరింగ్ అధికారులు కూడా పక్కాగా ఆయా పనుల అంచనాలు రూపొందించాలన్నారు.

ప్రతి పాఠశాలలోను నిర్వహణ కమిటీల ఆధ్వర్యంలోనే పనులు జరిపించాలన్నారు. పనులు నాణ్యత గా చేయాలని స్పష్టం చేశారు. ఇందులో ఎస్ ఎం సి చైర్మన్, పాఠశాల హెచ్ ఎం, స్థానిక సర్పంచ్, ఇంజినీరింగ్ విభాగం ఏ.ఈ లు ఉంటారన్నారు. ఎస్టిమేషన్ ఏవిధంగా చేయాలన్నది ప్రభుత్వం నిర్ణయించిందని ఆ మేరకు చేయాలన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయాలన్నారు. మంజూరు అధికారాలు జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రికి ఇచ్చారన్నారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ కే మంజూరీ అధికారాలు ఉన్నాయని, కలెక్టర్లకే నిధులు విడుదల చేస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు మనబడి కార్యక్రమానికి రూ.7289/- కోట్లు ఖర్చవుతుందని అంచనా ఉందన్నారు.
ఒక్కో నియోజకవర్గానికి ఒక ఇంజనీరింగ్ శాఖను కేటాయించాలని కలెక్టర్లకు సూచించారు. ఈనెల 9వ తేదీ నుండి ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి మెదక్ లోని మూడు జిల్లాల్లో ప్రారంభించాలని మంత్రి సూచించారు. మంజూరు కూడా త్వరితగతిన ఇవ్వాలని కలెక్టర్లను కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎక్కడా ఇసుక సమస్య లేకుండా ముగ్గురు కలెక్టర్లు సమన్వయం చేసుకుని పనులు వేగవంతం చేయాలన్నారు. ఈనెల 9వ తేదీ లోపు అంచనా చేయించి కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల స్థాయిలో స్క్రూటినీ చేసి మంజూరు ఇవ్వాలని సూచించారు.

నియోజకవర్గ స్థాయిలో ఎంపికైన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎం ఈ ఓ లు, ఇంజనీరింగ్ శాఖ, ప్రజాప్రతినిధులతో అవగాహన సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో మొదటి విడతగా 35 శాతం పాఠశాలలను తీసుకుంటున్నప్పటికీ 60 శాతం మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. రాబోయే విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే చేపట్టిన పనులన్నీ పూర్తి కావాలన్నారు. పూర్వ విద్యార్థులు, ఎన్నారైలు, దాతల నుండి నిధులు సమకూర్చు కొని పాఠశాలలు మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా వేదిక పైన ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ తమ వంతు గా మన ఊరు మన బడి కార్యక్రమానికి విరాళాలను మంత్రి సమక్షంలో ప్రకటించారు. ఎంపీ బి బి పాటిల్ మూడు లక్షల రూపాయలు, కొత్త ప్రభాకర్ రెడ్డి ఒక నెల జీతం, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, నారాయణఖేడ్ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి, దుబ్బాక శాసన సభ్యులు రఘునందన్ రావు, పటాన్చెరు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి, జహీరాబాద్, మెదక్ శాసనసభ్యులు ఒక నెల జీతం చొప్పున విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. అందోల్ శాసనసభ్యులు క్రాంతి కిరణ్ ఒక లక్ష, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి రెండు లక్షలు, రఘోత్తం రెడ్డి లక్ష రూపాయలు, జడ్పీ చైర్మన్ లు మంజుశ్రీ జైపాల్ రెడ్డి, రోజా శర్మ ఒక లక్ష చొప్పున, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి రెండు లక్షలు, అటవీ అభివృద్ధి సంస్థ అధ్యక్షులు ప్రతాపరెడ్డి ఒక లక్ష ,డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఒక లక్ష, లైబ్రరీ చైర్మన్ నరహరి రెడ్డి 51వేలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. పటాన్చెరు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి ఎనిమిది లక్షల ఫర్నిచర్ను భూంపల్లి పాఠశాలకు ఇస్తామని , రఘునందన్ రావు ఒక పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు.

పనుల్లో నాణ్యత లోపాలకు తావులేకుండా ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు.

దళిత బంధు

దళిత బంధు యూనిట్ల గ్రౌండింగ్ మార్చి 31లోగా పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. 
డైరీ యూనిట్లను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకునే యూనిట్ లాభదాయకంగా, వారిని ఆర్థికంగా నిలబెట్టేది గా ఉండాలన్నారు. వారికి సరియైన సలహాలు సూచనలు ఇచ్చి లబ్ధి చేకూర్చే యూనిట్లను ఎంపిక చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. డైరీ యూనిట్ కు సంబంధించి కలెక్షన్ పాయింట్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. పౌల్ట్రీ ఫామ్ లకు బోరు యూనిట్ కూడా ఇవ్వాలని సూచించారు. అధికారులు తామే లబ్ధిదారుల మన భావనతో దళిత బంధు లబ్ధిదారులకు లాభదాయక యూనిట్ ఎంపిక జరిగేలా చూడాలన్నారు. ఈనెల 31లోగా రోజువారి సమీక్ష నిర్వహిస్తూ వంద శాతం గ్రౌండింగ్ జరిగేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. వాహనాలు కొనే వారందరికీ లైసెన్సు, శిక్షణ ఇప్పించే బాధ్యత ఆయా సంబంధిత శాఖల అధికారులద ని, మెడికల్ షాప్, డయాగ్నస్టిక్ ల్యాబ్స్ పెట్టుకునే వారికి లైసెన్స్ ఫీజు మినహాయింపు ఇస్తామని మంత్రి తెలిపారు. కుటుంబసభ్యుల్లో ఎవరైనా డి ఫార్మసి, బి ఫార్మసీ చేసి ఉంటే మెడికల్ షాప్ పెట్టుకోవడానికి, అదేవిధంగా కుటుంబంలో ఎవరికి డిగ్రీ ఉన్నా ఫెర్టిలైజర్ షాప్ పెట్టుకోవడానికి అనుమతి కోసం సడలింపు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. దళిత బంధు పథకంలో ఏప్రిల్ నుండి పెద్ద మొత్తంలో లక్ష్యం వస్తుందని, కలెక్టర్లు సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మంత్రి సూచించారు. అనంతరం ఉమ్మడి జిల్లాలోని మున్సిపల్ పట్టనాలలో చేపట్టిన సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ లు, వైకుంట దామల పురోగతిని మంత్రి సమీక్షించారు. ఆయా మున్సిపాలిటీలలో త్వరితగతిన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ లు, వైకుంఠ దా మా ల నిర్మాణాలు పూర్తి కావాలన్నారు . ఇంకా స్థలం తదితర ఏవేని సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించి ప్రారంభించాలని ప్రజాప్రతినిధులకు ,కలెక్టర్లకు సూచించారు. 

ఇటీవల నారాయణఖేడ్ సభలో సి.ఎం. సంగారెడ్డి జిల్లాకు 390 కోట్లు మంజూరు చేసినందుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని 8 మున్సిపాలిటీలకు 250 కోట్లు, గ్రామ పంచాయతీలకు 140 కోట్లు ప్రకటించిన 24 గంటల్లో గా మంజూరు  ఇచ్చారని మంత్రి తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న పనులను గుర్తించాలన్నారు. ప్రాపర్ అంచనాలతో పని వారిగా ప్రతిపాదనలు కలెక్టర్ ద్వారా పంపాలని సూచించారు. అప్పుడే పనివారీగా నిధులు విడుదల అవుతాయని, ఈ ప్రక్రియ పదిహేను రోజుల్లోగా పూర్తి చేయాలని సూచించారు.

అంతకుముందు విర్చోస్ కంపెనీ అందజేసిన 2 వై కుం ట రథాలను మంత్రి జెండా ఊపి, జహీరాబాద్ మున్సిపాలిటీకి అందజేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దళిత బంధు కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సమీక్షలో ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బి బి పాటిల్, జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ, రోజా శర్మ, ఉమ్మడి మెదక్ జిల్లా శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా కలెక్టర్లు హనుమంతరావు, హరీష్, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, muzammil ఖాన్, ప్రతిమ సింగ్ , ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డిసిసిబి చైర్మన్,జిల్లా లైబ్రరీ చైర్మన్ నరహరి రెడ్డి, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, నియోజకవర్గ అధికారులు, రెవిన్యూ డివిజనల్ అధికారులు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here