హైద‌రాబాద్‌లో 1,180 క్రిటిక‌ల్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తింపు – దాన‌కిషోర్‌

0
97
Spread the love

ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై రిట‌ర్నింగ్‌, పోలీసు, ఎక్సైజ్ అధికారుల‌తో ఉన్న‌త‌స్థాయి స‌మావేశం
*హైద‌రాబాద్‌లో 1,180 క్రిటిక‌ల్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తింపు – దాన‌కిషోర్‌*

హైద‌రాబాద్ జిల్లాలో 1,180 పోలింగ్ కేంద్రాల‌ను సంక్లిష్ట (క్రిటిక‌ల్‌) పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి వాటికి ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేస్తున్న‌ట్టు జిల్లా ఎన్నిక‌ల అధికారి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ వెల్ల‌డించారు. వ‌చ్చే నెల 7వ తేదీన జ‌రుగ‌నున్న శాస‌న స‌భ ఎన్నిక‌ల‌ ఏర్పాటులో భాగంగా న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీకుమార్‌తో క‌లిసి 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో బందోబ‌స్తు ప్ర‌ణాళిక‌, స‌మ‌స్యాత్మ‌క, సంక్లిష్ట పోలింగ్ కేంద్రాలు, ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళి అమ‌లు త‌దిత‌ర అంశాల‌పై రిట‌ర్నింగ్ అధికారులు, పోలీసు, ఎక్సైజ్‌, జీహెచ్ఎంసీ అధికారుల‌తో నేడు స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ మాట్లాడుతూ హైద‌రాబాద్ జిల్లాలో ఉన్న మొత్తం 3,866 పోలింగ్ కేంద్రాల్లో 1,180 పోలింగ్ కేంద్రాల‌ను క్రిటిక‌ల్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామ‌ని తెలిపారు. 15 నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన ఈవీఎంల పంపిణీ, సేక‌ర‌ణ కేంద్రాల‌ను(డి.ఆర్‌.సి) ఈ నెల 9వ తేదీలోగా పూర్తిస్థాయిలో సిద్దం చేస్తున్న‌ట్టు తెలిపారు. ఈ డి.ఆర్‌.సి కేంద్రాల‌పై కేంద్ర ప్యారా మిల‌ట‌రీ బ‌ల‌గాల‌తో రెండంచెల భ‌ద్ర‌త‌తో పాటు స్థానిక పోలీస్‌ల‌తో కూడా భ‌ద్ర‌త ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలియ‌జేశారు. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ జారీ అయ్యే ఈ నెల 12వ తేదీన ఎన్నిక‌ల వ్య‌య ప‌రిశీల‌కులు వ‌స్తున్నార‌ని, సాధార‌ణ ప‌రిశీలకులు ఈనెల 18 లేదా 19వ తేదీల‌లో వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. ప్రిసైడింగ్ ఆఫీస‌ర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీస‌ర్లకు ఈ నెల 14వ తేదీన మొద‌టి ద‌శ శిక్ష‌ణ కార్యక్ర‌మం ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలియ‌జేశారు. ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళి అమ‌లులో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లాలో రూ. 8.60 కోట్ల‌ను స్వాధీనం చేశామ‌ని వెల్ల‌డించారు. రాజ‌కీయ పార్టీలుగాని, అభ్య‌ర్థులుగాని ఎన్నిక‌ల‌కు సంబంధించి ప్ర‌చార స‌భ‌లు, స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌కు 48గంట‌ల ముందు అనుమ‌తుల‌కు ద‌ర‌ఖాస్తు చేయాల‌ని, ఆయా ద‌ర‌ఖాస్తుల‌ను 24గంట‌ల్లోగా ప‌రిశీలించి అనుమ‌తులు ఇవ్వ‌నున్న‌ట్టు తెలిపారు. ఈ నెల 4న నిర్వ‌హించిన ప్ర‌త్యేక ప్ర‌చార కార్య‌క్రమంలో ఫారం-6లో వ‌చ్చిన నూత‌న ఓట‌ర్ల ద‌ర‌ఖాస్తుల‌ను వెంట‌నే ప‌రిశీలించి త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని దాన‌కిషోర్ ఆదేశించారు. హైద‌రాబాద్ జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంపొందించ‌డానికి విస్తృత స్థాయిలో చైత‌న్య కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. ఈ సారి ఎన్నిక‌ల్లో విక‌లాంగుల ఓటింగ్ శాతాన్ని పెంపొందించ‌డంలో భాగంగా న‌గ‌రంలోని అర్హులైన విక‌లాంగులంద‌రిని ఓట‌ర్లుగా న‌మోదు చేసే ప్ర‌క్రియ పురోగ‌తిలో ఉంద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు 15,000 మంది విక‌లాంగుల‌ను ఓట‌ర్లుగా న‌మోదు చేశామ‌ని, మ‌రో 8,000 మందిని ఓట‌రుగా న‌మోదు చేయించాల్సి ఉంద‌ని తెలిపారు.


*ఎన్నిక‌ల‌కు ప‌టిష్ట‌మైన బందోబ‌స్తు – సి.పి. అంజ‌నీకుమార్‌*
హైద‌రాబాద్‌లో జ‌రిగే ఎన్నిక‌ల‌కు ప‌టిష్ట‌మైన బందోబ‌స్తును ఏర్పాటు చేస్తున్న‌ట్టు న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌నీకుమార్ తెలిపారు. హైద‌రాబాద్ జిల్లాకు ఇప్ప‌టికే మూడు కంపెనీల‌ కేంద్ర పారా మిల‌ట‌రీ బ‌ల‌గాలు వ‌చ్చాయని, మ‌రో 25 కంపినీల బ‌ల‌గాలు రానున్నాయ‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సార్లు పారా మిల‌ట‌రీ ద‌ళాల‌చే ఫ్లాగ్ మార్చ్ నిర్వ‌హించామ‌ని చెప్పారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో స‌మ‌స్యాత్మ‌క‌, సున్నిత ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో బందోబ‌స్తును ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. ఇప్ప‌టికే డి.ఆర్‌.సి కేంద్రాల‌ను త‌నిఖీ పూర్తిచేశామ‌ని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 8.60 కోట్ల న‌గ‌దును స్వాధీనం చేసుకోగా 1800 నాన్‌బేల‌బుల్ వారంటీల‌ను అదుపులోకి తీసుకున్నామ‌ని, న‌గ‌రంలోని రౌడీ షీట‌ర్లు, హిస్ట‌రీ షీట‌ర్ల‌ను బైండోవ‌ర్ చేస్తున్నామ‌ని వివ‌రించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here