హైదరాబాద్‌ విమోచన ఉద్యమం….ఒక గ్లాన్స్‌లో

0
70
Spread the love

హైదరాబాద్‌ విమోచన ఉద్యమం….ఒక గ్లాన్స్‌లో

(తూఫాన్‌, హైద‌రాబాద్‌)

బ్రిటిష్‌ పాలన నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాటం 1857లో ప్రారంభమై ఉండొచ్చుగానీ, దీనికి నాలుగు దశాబ్దాల పూర్వమే 1815లో హైదరాబాద్‌ సంస్థానం నాంది పలికిందని చెప్పవచ్చు. వాస్తవానికి విదేశీ పాలనపై తొలుత పోరాట బావుటా ఎగురవేసింది సాక్షాత్తూ హైదరాబాద్‌ సంస్థానాధీశుడైన మూడో నిజాం కుమారుడు, యువరాజు ముబారిజ్‌ ఉద్‌-దౌలా కావడం విశేషం.

ఆంగ్లేయుల పాలనను వ్యతిరేకిస్తూ 1815-1857 మధ్యకాలంలో పలు ఉద్యమాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని బ్రిటిష్‌ ప్రభుత్వ ప్రతినిధి భవనంపై తుర్రెబాజ్‌ ఖాన్‌, మౌల్వీ అల్లాఉద్దీన్‌ తదితరులు 1857 జూన్‌ 17న దాడిచేశారు. ఆ తర్వాత 1858 ఆగస్టు 8న సోరాపూర్‌ రాజు వెంకటప్ప నాయక్‌ కూడా బ్రిటిష్‌వారిపై తిరుగుబాటు చేశాడు. కాగా, మౌల్వీ అల్లాఉద్దీన్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించి, 1859 జూన్‌ 28న అప్రతిష్టకు మారుపేరైన అండమాన్‌ జైలుకు పంపగా, 1884లో ఆయన కన్నుమూశాడు. ఇక దాడి సమయంలోనే తుర్రెబాజ్‌ ఖాన్‌ కాల్పుల్లో మరణించగా, మృతదేహాన్ని హైదరాబాద్‌ నగరంలోని సుల్తాన్‌ బజార్‌లో విద్యుత్‌ స్తంభానికి బహిరంగంగా వేలాడదీశారు.

అసఫ్‌జాహీ రాజవంశీయులైన నిజాం రాజులు బ్రిటిష్ వారికి విశ్వసనీయ మిత్రులుగా ఉండేవారు. ఆ మేరకు బ్రిటిషర్లపై ఎలాంటి తిరుగుబాటునైనా వారు నిరోధించేవారు. అయినప్పటికీ స్వాతంత్ర్య సమరయోధులు ఈ రెండు దుష్టశక్తులపైనా 1857లో తొలి పోరాటం చేయగా, తర్వాత కూడా అనేక సార్లు సాయుధ తిరుగుబాటు చేశారు. కాగా, 1940 దశకం మధ్యదాకా కొంత స్తబ్దత నెలకొన్నప్పటికీ ఆర్యసమాజ్ తోడ్పాటుతో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వారు స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముమ్మరం చేసి, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌ భారత సమాఖ్యలో విలీనానికి అంగీకరించి లొంగిపోయేలా ఒత్తిడికి గురిచేశారు.

కానీ, నిజాం రాజు 1947 ఆగస్ట్ 15న కూడా భారత సమాఖ్యలో విలీనం కావడానికి అంగీకరించలేదు. మరోవైపు నిజాం రాజు భారత సమాఖ్యలో చేరాలనే డిమాండ్‌తో పలుమార్లు వార్తా కథనాలు రాసిన ఉర్దూ దినపత్రిక ‘ఇమ్రోజ్‌’ సంపాదకుడైన పాత్రికేయుడు షోయబుల్లాఖాన్‌పై 1948 ఆగస్టు 21న రజాకార్లు దాడిచేసి, ఆయన చేతులు నరికివేశారు. అంతేకాకుండా షోయబుల్లా ఖాన్‌పై కాల్పులు కూడా జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన మరునాడు కన్నుమూశారు. ఇక స్వాతంత్ర్య సమరయోధులలో స్వామి రామానంద తీర్థ, మఖ్దూం మొహియుద్దీన్, రావి నారాయణ రెడ్డి, షేక్ బందగీ, బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావులు హైదరాబాద్‌ భారత సమాఖ్యలో విలీనం కావాలని ఆకాంక్షించారు. చివరకు 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌ సంస్థానం భారత సమాఖ్యలో విలీనం చేయబడింది. కాగా, ‘జై హింద్’ అని నినదించిన ఘనత కూడా హైదరాబాద్‌కు దక్కుతుంది. హైదరాబాద్‌ వాస్తవ్యుడైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ సన్నిహితుడు అబిద్ హసన్ సఫ్రానీ ఈ నినాద రూపకర్త కావడమే ఇందుకు కారణం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here