కేంద్రప్రభుత్వ విధానాలు.. పత్రికాస్వేచ్ఛకు ప్రమాదకరం – ఐ.జే.యూ. ఆందోళన

0
140
Spread the love

కేంద్రప్రభుత్వ విధానాలు.. పత్రికాస్వేచ్ఛకు ప్రమాదకరం !
ఐ.జే.యూ. ఆందోళన !


మథుర ,( ఉత్తరప్రదేశ్ ) ఏప్రిల్ 25 : ప్రజాస్వామ్య మనుగడకి అత్యంత ఆవశ్యకమైన భావప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించుకునేందుకు పాత్రికేయులు సంఘటితంగా పోరాడాలని ఐ.జే.యు. జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రెడ్డి , సెక్రెటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ పిలుపు ఇచ్చారు! ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ రెండురోజుల జాతీయ కార్యవర్గ సమావేశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథుర లోని గోవర్ధన్ ప్యాలస్ సమావేశమందిరంలో ఏప్రిల్ 25 ఉదయం ప్రారంభం అయ్యింది. అధ్యక్షత వహించిన కే.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో పత్రికా స్వేచ్ఛకు మున్నెన్నడూ లేనంత స్థాయిలో ప్రమాదాలు ముంచుకొస్తున్నాయని అన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని రద్దుచేయడం, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుల ఎన్నిక విధానాన్ని మార్చడం , ప్రెస్ కౌన్సిల్ కు ఆరునెలలుగా కొత్త అధ్యక్షుని నియమించక పోవడం, అక్రెడిటేషన్ జారీకి అనుసరించాల్సిన నియమాలను ఏకపక్షంగా కఠినతరంగా మార్చివేయడం , పాత్రికేయులపై దాడులను నివారించలేక పోవడం వంటి చర్యలవల్ల దేశంలో పత్రికాస్వేచ్ఛకు ముప్పు ఏర్పడిందన్నారు. ప్రధానస్రవంతి మీడియాలో విద్వేషప్రచారం పెచ్చుమీరిపోవడం పై శ్రీనివాసరెడ్డి తీవ్రఆందోళన వ్యక్తం చేశారు. మీడియా స్వేచ్ఛకు సంబంధించిన 180 దేశాల అంతర్జాతీయసూచీలో భారత్ స్థానం 142 కి దిగజారిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రప్రభుత్వ విధానాలే అందుకు కారణమని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో మీడియారంగం ఎదుర్కుంటున్న సమస్యలు, వృత్తి భద్రత ,పాత్రికేయులకు రక్షణ , వారి జీవన స్థితిగతులు తదితర సమస్యలపై రెండురోజుల జాతీయ కార్యవర్గసమావేశం చర్చించి తగు కార్యాచరణ రూపొందిస్తుందని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఐ.జే.యు. పదవ ప్లీనరీ సమావేశాలను తమిళనాడులో నిర్వహించడానికి నిర్ణయించామన్నారు. అందుకు సన్నాహాలు మొదలయ్యాయని తెలిపారు. ఐ.జే.యు. సెక్రెటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ యూనియన్ కార్యకలాపాల నివేదికనిస్తూ కరోనా కారణంగా రెండేళ్ళుగా నిలిచిపోయిన యూనియన్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అయ్యాయన్నారు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత విధినిర్వహణలో జమ్మూ కాశ్మీర్ పాత్రికేయులు పలు నిర్బంధాలు ఎదుర్కుంటున్నారని తెలిపారు. వారికి ఐజేయూ తరపున సంఘీభావాన్ని ప్రకటించారు. మధ్యప్రదేశ్ లో వీడియో జర్నలిస్ట్ పై జరిగిన క్రూరదాడిని ఖండించారు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం వర్కింగ్ జర్నలిస్ట్ ల సమస్యల పరిష్కారంకోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటాల్లో ఐ.జే.యు. ముందున్నదని తెలిపారు.


ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , పంజాబ్ ,తమిళనాడు , కర్ణాటక ,యూపీ, సహా పలు రాష్ట్రాల్లో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రస్థాయిలో పోరాటాలు జరుగుతున్నాయని వివరించారు.
కార్మికచట్టాల పరిరక్షణకు కేంద్ర కార్మికసంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మెపోరాటంలో ఐ.జే.యు. చురుగ్గా పాల్గొన్నదని ఆయన అన్నారు. హర్యానా ,మహారాష్ట్ర ,రాష్ట్రాల్లో ఐ.జే.యు.కు అనుబంధంగా కొత్త సంఘాలు ఏర్పడ్డాయని తెలిపారు. త్వరలో రాజస్థాన్ ,హిమాచల్ ప్రదేశ్ , రాష్ట్రాల్లో ఐ.జే.యు. కు అనుబంధంగా కొత్తగాసంఘాలు ఏర్పడనున్నాయని వెల్లడించారు. పత్రికాస్వేచ్ఛ పరిరక్షణకు, జర్నలిస్టుల హక్కులకొరకు మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని బల్విందర్ సింగ్ జమ్మూ పిలుపు ఇచ్చారు. సమావేశం ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ , మథుర జిల్లాశాఖ అధ్యక్షుడు నరేందర్ భరద్వాజ్ వక్తలను ఆహ్వానించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ శంకర్ పాండే స్వాగతం పలికారు. అక్టోబర్లో జరిగిన గత కార్యవర్గ సమావేశం తర్వాత మృతి చెందిన పాత్రికేయులకు సమావేశం నివాళులు అర్పించింది. సమావేశంలో యూనియన్ పూర్వాధ్యక్షుడు ఎస్.ఎన్. సిన్హా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా ,అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారు దేవులపల్లి అమర్ , జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు , కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి , ఉత్తరప్రదేశ్ వర్కింగ్ జ‌ర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు రాజేష్ త్రివేది మాట్లాడారు. తొలిరోజు ఉదయం సెషన్ లో సమావేశం రెండు తీర్మానాలను ఆమోదించింది. “ప్రధానస్రవంతి మీడియాలో గణనీయమైన భాగం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షవాణిని , ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించకపోవడాన్ని” ఐజేయు ఒక తీర్మానంలో ఖండించింది. జాతీయకార్యవర్గ సభ్యుడు ఆలపాటి సురేష్ కుమార్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రధానన్యూస్ ఛానళ్లలో యాంకర్లు విద్వేషప్రచారానికి తావిచ్చేవిధంగా వ్యాఖ్యలు చేయడం, సామాజిక సామరస్యాన్ని భంగపరిచే విద్వేష ప్రచారంలో భాగస్వాములు కావడంపై ఐ.జే.యూ. ఆ తీర్మానంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మీడియా తన నిష్పాక్షికపాత్రను బాధ్యతాయుతంగా నెరవేర్చాలని ఆతీర్మానం కోరింది. అక్రెడిటేషన్ జారీకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇంతవరకూ అనుసరిస్తున్న నియమాలను ఎవరితోనూ చర్చించకుండా ఏకపక్షంగా మార్చివేయడాన్ని తీవ్రంగా నిరసిస్తూ సమావేశం మరో తీర్మానాన్ని ఆమోదించింది. జాతీయకార్యవర్గ సభ్యుడు డి.సోమసుందర్ ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సెంట్రల్ ప్రెస్ అక్రెడిటేషన్ కమిటీలో జాతీయ పాత్రికేయ సంఘాలకు , సంపాదకులకు స్థానం కల్పించకుండా , ప్రభుత్వఅనుకూల ప్రతినిధులతో ఏర్పాటు చేయడాన్ని ఆ తీర్మానం ఖండించింది. సంబంధిత అన్నిపక్షాలతో సంప్రదించి అక్రెడిటేషన్ నియమాలను రూపొందించాలని , సెంట్రల్ ప్రెస్ అక్రెడిటేషన్ కమిటీలో గుర్తింపు పొందిన అన్ని పాత్రికేయ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆ తీర్మానం డిమాండ్ చేసింది. జాతీయ కార్యవర్గ సమావేశంలో రెండు తెలుగురాష్ట్రాల నుండి అంబటి ఆంజనేయులు , ఆలపాటి సురేష్ కుమార్ , డి.సోమసుందర్ , ఐ. వి. సుబ్బారావు , నల్లి ధర్మారావు , వై.నరేందర్ రెడ్డి నగునూరి శేఖర్ , విరాహత్ ఆలీ , దాసరి కృష్ణారెడ్డి , కే. రామ నారాయణ్ , పాల్గొన్నారు.

ఉత్సాహపూరితంగా ప్రారంభసభ:

ఐ.జే.యు. జాతీయకార్యవర్గ సమావేశం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభం అయ్యింది. యూపీ మాజీ డిజిపి శైలజా కాంత్ మిశ్రా , శాసనసభ్యులు ఠాకూర్ మేఘ్ శ్యామ్ సింగ్ , శాసనమండలి సభ్యులు ఓం ప్రకాష్ సింగ్ , యువ పారిశ్రామికవేత్త, ఆత్మనిర్భర్ ప్రాజెక్ట్ వ్యవస్థాపకుడు రంజిత్ పాఠక్, స్వామీ నాగేంద్ర మహారాజ్ , సీనియర్ పాత్రికేయుడు పద్మశ్రీ అవార్డుగ్రహీత మోహన్ స్వరూప్ భాటియా , జిల్లాకాంగ్రెస్ అధ్యక్షుడు భగవాన్ సింగ్ వర్మ, బిజేపి జిల్లా అధ్యక్షురాలు మధుశర్మ తదితరులు మాట్లాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here