సరిహద్దులు దాటిన “మేడ్ ఇన్ ఇండియా” వ్యామోహం
భారతదేశ డిజిటైజేషన్ ప్రభావాన్ని ఇప్పుడు ప్రపంచం అంతా గుర్తిస్తోంది. కోవిడ్ తొలి విడత కాలంలో వ్యాక్సినేషన్ కోసం ప్రారంభించిన కోవిన్ యాప్ ను పలు దేశాలు ప్రశంసించాయి. నేపాల్ ఇప్పుడు డిజిటల్ లావాదేవీల కోసం భారతదేశానికి చెందిన యుపిఐని (యునైటెడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్) తమ దేశంలో అమలుపరిచింది. వ్యక్తి-వ్యక్తుల (పి2పి), వ్యక్తులు-వ్యాపారుల (పి2ఎం) మధ్య వాస్తవిక విధానంలో చెల్లింపులకు ఇది ఇంటర్ ఆపరబులిటీ కలిగి ఉంది. ఫలితంగా సరళతరమైన డిజిటల్ చెల్లింపుల సదుపాయం అందుబాటులోకి వచ్చి నేపాల్ ప్రజలు ప్రయోజనం పొందుతారు. ఈ ఏడాది ప్రారంభంలోనే భూటాన్ భీమ్ యుపిఐ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను స్వీకరించింది. 2016 సంవత్సరంలో తొలిసారి భారతదేశంలో యుపిఐ వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయం ఈ సందర్భంలో మనం గమనించాలి. భారత బ్యాంకింగ్ వ్యవస్థలో కొత్త శకానికి అది నాంది పలికింది. ఫలితంగా దేశంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి మారింది. అప్పటి నుంచి దేశంలో డిజిటల్ చెల్లింపులు 19 రెట్లు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలోనే 940 బిలియన్ డాలర విలువకు సమానమైన 3900 కోట్ల చెల్లింపులు జరిగాయి. భారత జిడిపిలో ఇది 31 శాతంతో సమానం.