సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా
జస్టిస్ ఎన్వీ రమణ నియామకం
న్యూఢిల్లీ ఏప్రిల్ 6 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: భారత సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియమితులయ్యారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనను నూతన సీజేఐగా నియమించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 24వ తేదీన ఎన్వీ రమణ సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీజేఐ ఎస్ఏ బోబ్డే ఈ నెల 23న పదవీ విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో నూతన సీజేఐగా ఎన్వీ రమణను నియమించారు. వచ్చే ఏడాది ఆగస్టు 26 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.కాగా, తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్వీ రమణ పేరును ప్రస్తుత సీజేఐ ఎస్ఏ బోబ్డే ఇటీవల సిఫారసు చేశారు. బోబ్డే తర్వాత ఎన్వీ రమణనే సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉండటంతో ఆయన తదుపరి సీజేఐగా అవకాశం దక్కింది. జస్టిస్ ఎన్వీ రమణ 1957, ఆగస్ట్ 27న కృష్ణా జిల్లా పొన్నవరంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు.2017, ఫిబ్రవరి 14 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు.