కొత్త డిజిట‌ల్ చెల్లింపుల విధానం ఇ-రుపీ గురించి తెలుసుకోండి

0
144
Spread the love

కొత్త డిజిట‌ల్ చెల్లింపుల విధానం ఇ-రుపీ గురించి తెలుసుకోండి

(ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆగ‌స్టు 2వ తేదీన న‌గ‌దు ర‌హిత‌, కాంటాక్టు ర‌హిత డిజిట‌ల్ చెల్లింపుల విధానం ఇ-రుపీని ప్రారంభించారు. ఇ-రుపీ వోచ‌ర్ ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ (డిబిటి) విధానంలో కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని, దేశంలో డిజిట‌ల్ లావాదేవీల‌ను మ‌రింత స‌మ‌ర్థ‌వంతం చేయ‌డంతో పాటు డిజిట‌ల్ పాల‌న‌కు కొత్త కోణాన్ని ఆవిష్క‌రిస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. ప్ర‌జ‌ల‌ను టెక్నాల‌జీతో అనుసంధ‌థానం చేయ‌డంలో భార‌త‌దేశం ఏ విధంగా పురోగ‌మిస్తోందో తెలియ‌చేసేందుకు ఇ-రుపీ ఒక చిహ్నంగా నిలుస్తుంద‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.)

ఇ-రుపీ అంటే ఏమిటి, అదెలా ప‌ని చేస్తుంది?

మౌలికంగా ఇ-రుపీ అంటే ఒక డిజిట‌ల్ వోచ‌ర్‌. ల‌బ్ధిదారునికి అది ఒక ఎస్ఎంఎస్ లేదా క్యుఆర్ కోడ్ రూపంలో అందుతుంది. ఇది ప్రీ-పెయిడ్ వోచ‌ర్ కావ‌డం వ‌ల్ల ల‌బ్ధిదారులైన‌ పురుషులు/  మ‌హిళ‌లు  దాన్ని ఆమోదించే ఏ కేంద్రానికైనా వెళ్లి న‌గ‌దుగా మార్చుకోవ‌చ్చు.
ఉదాహ‌ర‌ణ‌కి ప్ర‌భుత్వం ఒక ఉద్యోగికి నిర్దేశిత ఆస్ప‌త్రిలో చికిత్స చేయించి ఖ‌ర్చులు భ‌రించాల‌ని నిర్ణ‌యించిన‌ట్ట‌యితే భాగ‌స్వామ్య బ్యాంకు ద్వారా నిర్దేశిత మొత్తానికి ఇ-రుపీ జారీ చేయ‌వ‌చ్చు. ఆ ఉద్యోగి త‌న ఫీచ‌ర్ ఫోన్/  స్మార్ట్ ఫోన్  పై  ఎస్ఎంఎస్ లేదా క్యుఆర్ కోడ్ రూపంలో దాన్ని అందుకుంటాడు. ఆ ర‌కంగా ఇ-రుపీ ఒక కాంటాక్ట్ ర‌హిత ఏక కాల చెల్లింపుల విధానం. ఎలాంటి కార్డు, డిజిట‌ల్ చెల్లింపుల యాప్ లేదా ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ అవ‌స‌రం లేకుండానే వినియోగ‌దారులు న‌గ‌దు ర‌హిత విధానంలో అందిన ఆ చెల్లింపు మొత్తాన్ని న‌గ‌దుగా మార్చుకోవ‌చ్చు.

ఇ-రుపీని త్వ‌ర‌లో భార‌త రిజ‌ర్వు బ్యాంకు జారీ చేయ‌నున్న డిజిట‌ల్ క‌రెన్సీగా మాత్రం భావించ‌కూడ‌దు. ఇ-రుపీ అనేది ప్ర‌త్యేక ల‌క్ష్యం కోసం ఎవ‌రైనా ఒక వ్య‌క్తి పేరు  మీద‌ జారీ చేసే ల‌క్ష్య నిర్దేశిత డిజిట‌ల్ వోచ‌ర్‌.

ఇ-రుపీ ఏ విధంగా వినియోగ‌దారునికి ప్ర‌యోజ‌న‌క‌రం?

ఇ-రుపీ అందుకునే వ్య‌క్తికి బ్యాంకు ఖాతా ఉండాల్సిన అవ‌స‌రం లేదు. ఇత‌ర డిజిట‌ల్ చెల్లింపు విధానాల‌తో పోల్చితే ఇ-రుపీ విశిష్ట ల‌క్ష‌ణం ఇదే. అది కాంటాక్ట్ ర‌హితంగా రెండంచెల్లో రిడెంప్ష‌న్ (చెల్లింపు) ప్ర‌క్రియ పూర్తి చేసే విధానం. ఇందుకోసం ల‌బ్ధిదారుడు త‌న వ్య‌క్తిగ‌త స‌మాచారం ఎవ‌రికీ  తెలియ‌చేయాల్సిన అవ‌స‌రం లేదు.
బేసిక్ ఫోన్లపై కూడా ప‌ని చేయ‌డం ఇ-రుపీ అందించే మ‌రో ప్ర‌యోజ‌నం.  అంటే స్మార్ట్ ఫోన్లు లేని వారు, ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ అందుబాటులో లేని ప్రాంతాల్లో కూడా దీన్ని వినియోగించుకోవ‌చ్చు.

ఇ-రుపీ స్పాన్స‌ర్ల‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలేమిటి?

ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ విధానం (డిబిటి) ప‌టిష్ఠం చేయ‌డంలో ఇ-రుపీ కీల‌క పాత్ర పోషిస్తుంది. ఆ ప్ర‌క్రియ మ‌రింత పార‌ద‌ర్శ‌కం చేస్తుంది. ఎలాంటి ఫిజిక‌ల్ వోచ‌ర్లు జారీ చేయాల్సిన అవ‌స‌రం లేదు గ‌నుక ఇది వ్య‌యాన్ని పొదుపు చేసే సాధ‌నంగా కూడా చెప్ప‌వ‌చ్చు.

స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌కు చేకూరే ప్ర‌యోజ‌నాలేమిటి?

ఇ-రుపీ అనేది ఒక ప్రీ పెయిడ్ వోచ‌ర్ కావ‌డం వ‌ల్ల స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు ఏ క్ష‌ణంలో కావాలంటే సంబంధిత చెల్లింపు పూర్త‌యిపోతుంది.

ఇ-రుపీ అభివృద్ధి చేసింది ఎవ‌రు?

దేశంలో డిజిట‌ల్ చెల్లింపుల వ్య‌వ‌స్థ‌ను ప‌ర్య‌వేక్షించే నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్ పిసిఐ) న‌గ‌దు ర‌హిత లావాదేవీల‌ను ప్రోత్స‌హించేందుకు వోచ‌ర్ ఆధారిత విధానం ఇ-రుపీని ప్రారంభించింది.
ఆర్థిక స‌ర్వీసుల శాఖ‌, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ‌, జాతీయ ఆరోగ్య సంస్థ స‌మ‌న్వ‌యంతో దీన్ని అభివృద్ధి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here