ఏమైనా చేయగలననే అహంకారం అణువణువునా కలిగిన వ్యక్తి చంద్రబాబు: కొడాలి నాని

0
134
Spread the love

అమరావతి గురించి టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీలు ఎందుకు ధర్నాలు చేస్తున్నాయో తనకు అర్థం కావడం లేదని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదని వ్యాఖ్యానించారు. అమరావతిలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఉన్నాయని… వీటిలో హైకోర్టును కర్నూలుకు తరలించాలని గతంలోనే బీజేపీ చెప్పిందని గుర్తు చేశారు.

కార్యనిర్వాహక వ్యవస్థను వైజాగ్ కు, న్యాయ వ్యవస్థను కర్నూలుకు తరలిస్తామని, శాసన వ్యవస్థ అమరావతిలోనే ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని అన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే సీఎం ఆలోచన అని చెప్పారు. లక్షల కోట్లను ఒక ప్రాంతంలోనే కుమ్మరించకుండా… మూడు ప్రాంతాలను అభివృద్ధి చేద్దామని చెపితే వీరందరికి వచ్చిన బాధ ఏంటని ప్రశ్నించారు.

రాజధాని ప్రాంతంలోని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే… టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన బినామీలు అడ్డుకున్నారని కొడాలి నాని మండిపడ్డారు. ఇంటి స్థలాల కోసం ధర్నా చేస్తున్న వారికి తాను మద్దతుగా ఉన్నానని చెప్పారు. చంద్రబాబుకు కొవ్వెక్కువని, రాజ్యాంగ వ్యవస్థల్లో తన మనుషులను పెట్టుకుని ఏదైనా చేయగలననే అహంకారం అణువణువునా కలిగిన వ్యక్తి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోర్టులను కూడా మేనేజ్ చేయగలిగిన శక్తిసామర్థ్యాలు ఉన్న దొంగ చంద్రబాబు అని అన్నారు. జగన్ ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారని విమర్శించారు.

జగన్ కు అందరం అండగా ఉండాలని… మన కోసం ఎంత వరకైనా పోరాడే వ్యక్తి జగన్ అని కొడాలి నాని అన్నారు. బలహీన వర్గాల వ్యక్తులను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలని భావించే వ్యక్తి అని చెప్పారు. అమరావతిలో జరుగుతున్న కుల అహంకార దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. మరో రెండేళ్లలో చంద్రబాబు ఇంటికి వెళ్తారని, జగన్ మరో 30 ఏళ్లు ఉంటారని చెప్పారు. చంద్రబాబును పక్కన పెట్టి, ప్రభుత్వం కట్టించి ఇవ్వాలనుకుంటున్న ఇళ్లను తీసుకోవాలని అమరావతి రైతులను కోరుతున్నానని అన్నారు. అమరావతిలో ఉన్న ప్రతి పేదను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here