శ్రీ‌మ‌ల్లిఖార్జున స్వామి క‌ల్యాణంతో వైభ‌వోపేతంగా మొద‌లైన కొముర‌వెల్లి బ్ర‌హ్మోత్స‌వాలు

0
341
Spread the love

శ్రీ‌మ‌ల్లిఖార్జున స్వామి క‌ల్యాణంతో వైభ‌వోపేతంగా మొద‌లైన కొముర‌వెల్లి బ్ర‌హ్మోత్స‌వాలు

సిద్దిపేట: సకల జనాల ఆరాధ్య దైవం కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణ మహోత్సవం ఈ రోజు వైభవంగా జరిగింది. స్వామి వారి కల్యాణ మహోత్సవానికి ఆలయవర్గాలు విస్తృత ఏర్పాట్లు చేశారు. మల్లన్న కల్యాణోత్సవానికి శాసన మండలి విప్ బొడెకుంటి వెంకటేశ్వర్లు పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణ మహోత్సవానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మె ల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యే, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

వేలాదిగా తరలి వచ్చిన భక్తులు

స్వామి వారి కల్యాణోత్సవానికి వేలాదిగా భక్తులు హాజరయ్యారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ టంకశాల వెంకటేశ్వర్, పాలక మండలి చైర్మన్ సెవెల్లి సంపత్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. తోటబావి ప్రాంతంలో నిర్మించిన శాశ్వత కల్యాణ వేదిక వద్ద బారికేడ్లు, షామియానులు, పచ్చదనం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. గంగరేగు చెట్టు, కల్యాణ వేదిక వద్ద చలువు పందిళ్లు ఏర్పాటు చేయడంతో పాటు నూతనంగా రాజగోపురం వద్ద క్యూలైన్ల పై భాగంలో, ప్రసాదాల విక్రయ కౌంటర్ల వద్ద తాగు నీటి వసతి ఏర్పాటు చేశారు.

భక్తులకు మిషన్ భగీరథ నీళ్లు

కల్యాణోత్సవంతో పాటు బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు మిషన్ భగీరథ పథకంలో సరఫరా అవుతున్న గోదావరి నీటిని నల్లాల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు స్వామి వారి క్షేత్రంలో గోదావరి జలాలు అందించేందు నల్లాలు బిగించారు. దీనికి తోడుగా ఆలయవర్గాలకు చెందిన 12బోర్లు, 15నీటి ట్యాం కులు, 50 కులాయిలు సిద్ధం చేశారు. నీటి సరఫరాలో ఇబ్బందుల రాకుండా రెవెన్యూ సిబ్బందిని కేటాయించారు.
క్యూలైన్లలో అన్ని వసతులు

స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో గంటల పాటు వేచి ఉండే భక్తుల కోసం ఆలయ అధికారులు మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. క్యూలైన్లలో 5 టాయిలెట్స్‌తో పాటు స్వామి వారి క్షేత్రంలో 3 సులభ్ కాంప్లెక్స్‌లు, బస్ స్టేషన్ వద్ద 40 తాత్కాలిక టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు జీపీ ద్వారా మరో రెండు సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు భక్తుల స్నానాల కోసం 200 షవర్స్ ఏర్పాటు చేశారు. వీటితో పాటు షవర్స్ పక్కనే మహిళలు బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కల్పించారు.

అదనపు ఆర్టీసీ బస్సులు

ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్సులు కాకుండా సిద్దిపేట, జనగామ జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేకంగా బస్సులను ఆర్టీసీ అధికారులు నడిపిస్తున్నారు. రాజీవ్ రహదారిలోని మల్లన్న స్వాగత తోరణాల వద్ద అన్ని ఆర్టీసీ డిపోల బస్సులు నిలపాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఇతర జిల్లాల ఆర్టీసీ ఉన్నతాధికారులకు ప్రత్యేక సమాచారం అందించారు. ముఖ్యంగా కరీంనగర్, సిద్దిపేట, జనగామ, హన్మకొండ, గోదావరిఖని, జగిత్యాల తదితర బస్సులు కొమురవెల్లి స్టేజీ వద్ద అపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

మూడు చోట్ల పార్కింగ్ స్థలాలు

స్వామి వారి క్షేత్రానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వారి వాహనాలను నిలిపేందుకు మూడు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ ఆధ్వర్యంలో భక్తుల కోసం వరంగల్, హైదరాబాద్ నుంచే వచ్చే భక్తులకు వైశ్య సత్రం వద్ద, కరీంనగర్, సిద్దిపేట జిల్లా నుంచి వచ్చే భక్తులకు బతుకమ్మ చెరువు వద్ద, వీఐపీలకు తోటబావి వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు అక్కడే తాత్కాలిక టాయిలెట్స్, నీటి వసతి కల్పించారు. వీటితో పాటు స్వామి వారి క్షేత్రంలో రెండు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. స్వామి వారి క్షేత్రంలో దాతలు నిర్మించిన 150 కాటేజీలు సిద్ధంగా ఉన్నట్లు, దాతలు రాని పక్షంలో వాటిని భక్తులకు కేటాయించనున్నారు. దీంతో పాటు స్వామి వారి క్షేత్రంలో పలు చోట్ల చలువు పందిర్లు వేయించారు. అలాగే 50వేల మంది భక్తులు హాజరుకానుండడంతో వారి కోసం 50వేల లడ్డూలు, 15వేల పులిహోర ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

*** Watch Komuravelli Sri Mallikarjuna Swamy Kalyanam Video Below***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here