ఆనందయ్యకు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు సెల్యూట్
చెన్నైజూన్ 25 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: ఆనందయ్య మందుపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీలో కరోనాకు మందు తయారుచేసి ఉచితంగా ఇస్తున్నారంటూ ఆనందయ్యను అభినందించింది. ఈ సందర్భంగా ఆనందయ్యకు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్. కరుబాకరణ్, టీవీ తమిళ్ సెల్వీ సెల్యూట్ చేశారు. డీఆర్డీవో తయారు చేసిన 2-డీజీ మందుపై విచారణ సందర్భంగా ఆనందయ్య మందు ప్రస్తావన వచ్చింది. ప్రభుత్వాలు ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహించడంలో విఫలమయ్యాయంటూ ఆనందయ్యపై అభినందనల వర్షం కురిపించారు. ఆయుర్వేద వైద్యులను కేంద్రం ప్రోత్సహించాలని జస్టిస్ ఎన్. కరుబాకరణ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా భారతీయ ఎడిసన్గా పేర్గాంచిన జీడీ నాయుడును గుర్తు చేశారు. అలాంటి అత్యుత్తమ ఆవిష్కర్తలు కూడా ఉంటారని.. అందరూ రామర్ పిళ్లై లాంటి మోసగాళ్లు ఉంటారన్న ఆందోళన తగదన్నారు. బయో ఇంధనం పేరుతో జనాలను మోసం చేసిన కేసులో రామర్ పిళ్లై అరెస్ట్ అయ్యాడు.