మహిళలతో సమానంగా పురుషులకు ప్రసూతి సెలవులు
NewDelhi – Toofan – ప్రముఖ గ్లోబల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ సైయెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో మహిళలతో సమానంగా పురుషులకు 12 వారాల పాటు ప్రసూతి సెలవులు ఇస్తున్నట్లు కొత్త విధానాన్ని ప్రకటించింది.ఈ సెలవుల సమయంలో ఉద్యోగులు పూర్తి వేతనాన్ని అందుకొనున్నారు. దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పాలసీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైయెంట్ ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. ఈ సందర్బంగా సైయెంట్ ప్రెసిడెంట్, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ పీఎన్ఎస్వీ నరసింహం మాట్లాడుతూ “సైయెంట్ సంస్థను పని చేయడానికి గొప్ప ప్రదేశంగా మార్చడానికి మేము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తున్నాము. తల్లిదండ్రులు తమ కుటుంబాలతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఈ విధానం సహాయపడుతుంది” అని తెలిపారు. సైయెంట్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కృష్ణ బోడనాపు మాట్లాడుతూ “తల్లిదండ్రులైన వారికి కొన్ని దేశాల్లో ఇస్తున్న సెలవులు సరిపోవడం లేదని తమ దృష్టికి తీసుకొనిరావడంతో ఈ కొత్త విధానాన్ని ప్రకటించినట్లు, పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఇద్దరు సమాన బాధ్యతలు పంచుకునేందుకు కొత్త విధానం తోడ్పడుతుందని” తెలిపారు.