నిర్దేశించిన కాల వ్యవధిలో నాలా పనులు పూర్తి చేయాలి – మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్, జూలై 05: వరదల వలన ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్దేశించిన కాల వ్యవధిలో నాలా పనులు పూర్తి చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. నల్లకుంటలోని నాగమయ్య కుంట నాలా పై హెరిటేజ్ షాపు వద్ద రూ. 12 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు మేయర్ మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… జిహెచ్ఎంసి పరిధిలో సుమారు రూ. 1000 కోట్ల వ్యయంతో 37 పనులు నాణ్యత ప్రమాణాలు పాటించి వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. వర్షం కాలంలో పనులకు అంతరాయం లేకుండా నిరంతరంగా పనులు జరిగేందుకు మేన్ మెటీరియల్ సిద్ధంగా పెట్టుకోవాలని అధికారులను కోరారు.
ప్రజలు చెత్త, వ్యర్థాలు, పనికిరాని వస్తువులు నాలాలో వేయవద్దని మేయర్ కోరారు. నాలా పనులు ప్రాధాన్యత క్రమంలో ఫిజ్డ్ మ్యానర్ లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నల్లకుంట రామాలయం నుండి మెయిన్ కాలువకు కలిపే ఇటీవల మంజూరు చేసిన నేపథ్యంలో రూ. 64 లక్షలతో చేపట్టే నాలా పనులు కూడా వెంటనే ప్రారంభించాలని జోనల్ కమిషనర్, సి.ఇ నీ కోరారు. వర్షాల నేపథ్యంలో శానిటేషన్ వ్యవస్థను మెరుగు పరచాలని జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ని ఆదేశించారు. స్వచ్ఛ ఆటో ల పై ఎప్పటి కప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు.
ఈ సమావేశం జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్.ఎన్.డి.పి ఈ.ఈ కిషన్. ఎస్.సి భాస్కర్ రెడ్డి, ఇ.ఇ తదితరులు పాల్గొన్నారు.