వర్షాకాలంలో ముంపుకు గురికాకుండా పటిష్ట చర్యలు

0
91
Spread the love

వర్షాకాలంలో ముంపుకు గురికాకుండా పటిష్ట చర్యలు: మేయర్ విజయలక్ష్మి*

*హైదరాబాద్, జూన్ 07:*  ప్రస్తుత వర్షాకాల సీజన్ లో నగరంలోని లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురికాకుండా నాలాల పూడికతీత పనులు త్వరితగతిన పూర్తిచేసి నాలా విస్తరణ, అభివృద్ది పనులను పూర్తిచేయాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసి పరిధిలో చేపట్టిన నాలా విస్తరణ, పూడికతీత పనుల పురోగతిపై నేడు జిహెచ్ఎంసి కార్యాలయంలో జోనల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటి మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, ఎస్.ఎన్.డి.పి చీఫ్ ఇంజనీర్ వసంతలు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ… గత సంవత్సరం వచ్చిన భారీ వర్షాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సాధించి ప్రస్తుత వర్షకాలంలో తిరిగి ఆయా పరిస్థితులు ఎదురవకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఇప్పటికే జిహెచ్ఎంసి పరిధిలో నాలా పూడికతీత పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలాఖరు వరకు పూర్తిచేయాలని అన్నారు. అదేవిధంగా నగరంలో వర్షపునీరు సులభంగా వెళ్లేందుకుగాను నాలా విస్తరణ, అభివృద్ది పనులకు సంబంధించి రూ. 858 కోట్ల వ్యయంతో అంచనాలు రూపొందించారని, వీటికి సంబంధించి డి.పి.ఆర్ లను పూర్తిచేయడం, పూర్తైన డి.పి.ఆర్ లకు సంబంధించి టెండర్లను ఆహ్వానించాలని మేయర్ పేర్కొన్నారు. నగరంలో వర్షకాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు గాను ఏర్పాటుచేసిన వర్షకాల అత్యవసర బృందాలకు సంబంధించిన సమాచారం, సంబంధిత అధికారి వారి మొబైల్ నెంబర్లను కార్పొరేటర్లకు, ఇతర ప్రజాప్రతినిధులకు అందజేయాలని అన్నారు. దీంతో పాటు పూడికతీత పనులు, కూలిన చెట్లను తొలగించే అధికారుల వివరాలను కూడా కార్పొరేటర్లకు అందించాలని కోరారు. నగరంలోని పలు సమస్యలపై పౌరులు ట్విట్టర్, ఫేస్ బుక్ తదితర సామాజిక మాద్యమాల ద్వారా మున్సిపల్ శాఖ మంత్రికి తనకు విజ్ఞాపనలు వస్తున్నాయని, వీటిపై తక్షణమే తగు చర్యలు చేపట్టాలని మేయర్ తెలిపారు. జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ…నగరంలో ముమ్మరంగా జరుగుతున్న పూడికతీత పనులకు సంబంధించిన సమాచారాన్ని వార్డులవారిగా జియో మ్యాపింగ్ తో కూడిన ఫోటోల వివరాలను సంబంధిత కార్పొరేటర్లు, శాసన సభ్యులకు అందజేయాలని జోనల్ కమిషనర్లకు తెలిపారు. ఇప్పటికే నాలా పూడికతీత పనులు పూర్తయ్యాయని, తిరిగి వర్షం కురిసిన అనంతరం కూడా ఆయా పరిధిలోని నాలాలను పూడికతీతను చేపట్టాలని స్పష్టం చేశారు. ఎస్.ఎన్.డి.పి చీఫ్ ఇంజనీర్ వసంత మాట్లాడుతూ… జిహెచ్ఎంసి పరిధిలో నాలాల అభివృద్దికి రూ. 850 కోట్ల పనులకు ప్రభుత్వం పరిపాలన సంబంధిత ఆమోదం జారిచేసిందని, ఈ పనులకు సంబంధించి పూర్తిస్థాయి ప్రాజెక్ట్ నివేదికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్లు ప్రావిణ్య, రవికిరణ్, శ్రీనివాస్ రెడ్డి, రుపేందర్ రెడ్డి, మమత, అశోక్ సామ్రాట్, ఎస్.ఎన్.డి.పి ఎస్.ఇ, ఇఇ లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here