బీజేపీ కాంగ్రెస్ పార్టీల‌పై విరుచుకుప‌డ్డ మంత్రులు ఎర్ర‌బెల్లి, గంగుల

0
47
Spread the love
  • బీజేపీ బండి సంజ‌య్‌, కాంగ్రెస్ ల‌పై మంత్రులు ఎర్ర‌బెల్లి, గంగుల క‌మలాక‌ర్ ఫైర్‌
  • గ్రామ గ్రామా ప‌ల్లె ప్ర‌గ‌తి
  • ఉత్సాహంగా పాల్గొంటున్న ప్ర‌జ‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు
  • క‌రీంన‌గ‌ర్ జిల్లాలో పాల్గొన్న‌ మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, గంగుల క‌మ‌లాక‌ర్‌

5వ విడ‌త రెండో రోజు ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం ఉధృతంగా సాగింది. నిర్ణీత ల‌క్ష్యానికి అనుగుణంగా గ్రామాల్లో పాద యాత్ర‌లు నిర్వ‌హించి, పారిశుద్ధ్యం చేసి, ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. రాష్ట్ర పంచాయ‌తీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, పౌర స‌ర‌ఫ‌రాలు, బీసీ సంక్షేమ‌శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ క‌లిసి కరీం నగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో పాల్గొన్నారు. గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని మంత్రి గంగుల కమలాకర్, జెడ్పీ చైర్ పర్సన్ కనుమళ్ళ విజయ తో కలిసి ప్రారంభించారు. అనంతరం క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని మానకొండూర్ మండలం లింగాపూర్ లో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. పల్లె ప్రగతి కోసం గ్రామానికి వచ్చిన మంత్రులకు ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ ఆధ్వ‌ర్యంలో స్థానికులు ఘన స్వాగతం పలికారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా తరలివచ్చి జయజయధ్వానాలు పలికారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అక్కడే ఉన్న ఓ ట్రాక్టరెక్కిన మంత్రి గంగుల ఇంజన్ స్టార్ట్ చేసి… ముందుకు తీసుకెళ్ళగా… మంత్రి ఎరబెల్లి దయాకర్ రావు పక్కనే కూర్చుకున్నారు. ట్రాక్టర్ ముందు పెద్ద ఎత్తున మహిళలు… బతుకమ్మలతో ముందుకు సాగారు. మంత్రుల పర్యటనతో లింగాపూర్ లో పండగ సందడి నెలకొంది.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ బీజేపీల‌కు త‌లా తోక తెల‌వ‌దు. అమిత్ షాకు తెలంగాణ పోరాటం గురించి అవ‌గాహ‌న లేదు. అల్లూరి సీతారామ‌రాజు తెలంగాణ తెచ్చాడ‌ట‌? ఇంత‌కంటే తెలివి త‌క్కువ త‌నం ఉంటుందా? అని ప్ర‌శ్నించారు. తెలంగాణ తెచ్చింది సిఎం కెసిఆర్‌. కెసిఆర్ తెలంగాణ గాంధీ. ఇక గాంధీల వార‌సుల‌మ‌ని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఉద్య‌మానికి భ‌య‌ప‌డింది. తెలంగాణ తెగువ చూసి ఇచ్చింది అన్నారు. ఇక బండి సంజ‌య్ దీక్ష చేస్తాన‌ని చెబుతున్నాడు. ఆయ‌న దీక్ష చేయ‌డం కాదు. ద‌మ్ముంటే… ఈ సోమ‌వారం లోగా కేంద్రం రాష్ట్రానికి ప‌డిన బ‌కాయీల‌ను ఇప్పించు అంటూ స‌వాల్ చేశారు. డెడ్ లైన్ విధించారు. ఆ త‌ర్వాతే దీక్ష చేయాల‌ని చెప్పారు. ఇదేదీ చేయ‌కుండా బండి సంజ‌య్ తెలంగాణ‌లో ఎట్ల తిరుగుత‌డో చూద్దామ‌ని అన్నారు.

కెసిఆర్ చెప్పిన‌ట్లు ఇంటే…తెలంగాణ‌కు ల‌క్ష‌ల కోట్లు ఇస్తామ‌ని అమిత్ షా అంటున్నారు. మోటార్ల‌కు మీట‌ర్లు పెట్టాల‌ట‌? పెట్టాలా? అని ప్ర‌జ‌ల‌ను అడిగారు. త‌న బొందిలో పాణం ఉన్నంత వ‌ర‌కు పెట్టిన‌వ్వ‌న‌ని చెప్పిన మ‌హానుభావుడు కెసిఆర్ అని ఎర్ర‌బెల్లి అన్నారు. తెలంగాణ గురించి మాట్లాడే, విమ‌ర్శించే కాంగ్రెస్‌, బిజెపి నేత‌లు వారి పాలిత రాష్ట్రాల్లో ముందుగా చేసి, ఇక్క‌డ‌కు వ‌చ్చి మ‌ట్లాడాల‌ని ఎర్ర‌బెల్లి చెప్పారు.

ఇక ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం ఉధృతంగా సాగుతున్న‌ద‌ని, ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో న‌డ‌స్తున్న ప‌ల్లె ప్ర‌గ‌తి వ‌ల్లే ఇవ్వాళ దేశంలో తెలంగాణ ప‌ల్లెలు ఆద‌ర్శంగా ఉన్నాయ‌ని చెప్పారు. ప‌ల్లె ప్ర‌గ‌తిలో చేప‌ట్టాల్సిన కార్య‌క్ర‌మాల‌ను మంత్రి విరించారు. కేంద్రమే రాష్ట్రానికి బ‌కాయీ ఉంద‌ని, కేంద్రంతో సంబంధం లేకుండా గ్రాంటుని కూడా విడుద‌ల చేసిన‌ట్లు మంత్రి వివ‌రించారు. స‌ర్పంచ్ లు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని, కేంద్రం మెడ‌లు వంచైనా ఆ బ‌కాయీల‌ను తెప్పిస్తామ‌ని చెప్పారు. అలాగే గంగుల క‌మ‌లాక‌ర్ త‌న శిష్యుడ‌ని, మంచి ప్ర‌తిభావంతుడు కాబ‌ట్టే కెసిఆర్ మంత్రి ప‌ద‌వి ఇచ్చార‌ని, ఆ ప‌ద‌వికి న్యాయం చేస్తూ, వ‌డ్ల కొనుగోలులో, ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌లో మంచిగా ప‌ని చేస్తున్నాడ‌ని ప్ర‌శంసించారు.

మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ మాట్లాడుతూ,
తెలంగాణ రాష్ట్రం రాకముందు గ్రామాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఆలోచించాల‌న్నారు. నర దృష్టి పడితే నాపరాయే పలుగుతుందన్న‌ట్లు తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతుంటే ఢిల్లీ నేతలకు కన్నుకుట్టి… తెలంగాణ పై విషం చిమ్ముతున్నారన్నారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులైతే… ఒక అడుగు ముందుకు వేసి… తెలంగాణను మళ్లీ ఆంద్రప్రదేశ్లో కలుపుతామంటున్నారని ఇలాంటి డిల్లీ పరిపాలన మనకు అవసరమా? అంటూ ప్రశ్నించారు. ఇంటి పార్టీ, తెలంగాణ పార్టీ అని… టీఆర్ఎస్ కు, కేసీఆర్ గారికి అండగా ఉండాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here