పార్టీ శ్రేణులంతా జెండాపండుగలో పాల్గొనాలి : కేటీఆర్‌

0
62
Spread the love

పార్టీ శ్రేణులంతా జెండాపండుగలో పాల్గొనాలి : కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు జెండాపండుగలో పాల్గొనాలని ఐటీ పురపాలకశాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ జనరల్ సెక్రెటరీలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గ్రామ కమిటీ, సర్పంచ్, ఎంపీటీసీ, రైతు బంధు కమిటీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు అంతా కలిసి గ్రామంలోని పార్టీ శ్రేణులతో అందరినీ కలుపుకొని ఈ జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఉదయం 9గంటలకు తెలంగాణలో ఉన్న అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలనీ, దీంతోపాటు పట్టణాల్లోని బస్తీలు వార్డ్ కమిటీల ఆధ్వర్యంలో జెండాలు ఎగురవేయాలని సూచించారు. జెండా పండుగకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లను ఇవాళ సాయంత్రం వరకు పూర్తి చేసుకోవాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమం పార్టీ ప్రతినిధుల కార్యక్రమం అనే విషయాన్ని మనం నియోజకవర్గాల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు పార్టీ శ్రేణులకు తెలియజేయాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. కేవలం పార్టీ పంపించిన పాస్ ఉన్న వారికి మాత్రమే ఆహ్వానం ఉన్నదన్న విషయాన్ని అందరూ గమనించాలన్నారు. ఇప్పటి నుంచే పార్టీ నిర్దేశించిన ప్రతినిధులకు పాసులు అందినవో, లేవో చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపైన ఉందని.. ఈ అంశానికి సంబంధించి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే పార్టీని సంప్రదించాలన్నారు. దీంతోపాటు సరైన సమయానికి రేపు 9 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకునేందుకు అవసరమైన రవాణా, వాహన సదుపాయాలకు సంబంధించి కూడా ఏర్పాట్లను ఒకసారి పర్యవేక్షించాలని ఆదేశించారు.

 

                                పార్టీ ప్రతినిధులకు సూచనలు

  • ఖచ్చితంగా హైటెక్స్ ప్రాంగణానికి 9 గంటల లోపల చేరుకొని, తమ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి.
  • ప్రతి ఒక్కరు గులాబీ దుస్తులను ధరించి రావాలి.
  • 10 గంటల లోపల సమావేశమందిరంలో ఆసీనులు కావాలి.
  • పార్టీ సమావేశం ప్రారంభమైన 10 గంటల నుంచి కార్యక్రమం ముగిసేంత వరకు సభా కార్యక్రమాలకు క్రమశిక్షణతో హాజరు కావాలి.
  • సమావేశంలో పార్టీ తరఫున ప్రతిపాదించే తీర్మానాలకు సంబంధించిన ప్రతులను సభకు హాజరైన ప్రతినిధులకు ఇచ్చే బ్యాగ్‌లో ఉంచడం జరుగుతుంది.
  • ఈ తీర్మానాలకు సంబంధించిన అంశాలపై జరిగే సభా కార్యక్రమాలు అత్యంత ముఖ్యమైనవి.
  • ప్రస్తుతం రాజకీయంగా ప్రతిపక్షాలు లేవనేత్తే వివిధ రకాల ప్రశ్నలకు ఇందులో సమాధానం దొరుకుతుంది.
  • సీఎం నాయకత్వంలో వివిధ అంశాలపై దిశానిర్దేశం జరుగుతుంది.
  • ప్రతినిధులు తిరిగి వెళ్లిన తర్వాత తీర్మానాలకు సంబంధించిన చర్చను తమ కార్యక్షేత్రాల్లో కొనసాగించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here