సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్ ను పునరుద్ధరించాలి

0
73
Spread the love

సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్ ను పునరుద్ధరించాలి

సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ)ను పునరుద్ధరించాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు అదిలాబాదులో మూతపడిన సి సి ఐ ని తిరిగి పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేకి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని గతంలో కూడా పలు సార్లు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు వచ్చామని అయితే ఇప్పటివరకు సానుకూల నిర్ణయం రాలేదని తన లేఖలో పేర్కొన్నారు. 1984లో ఆదిలాబాద్ పట్టణంలో సుమారు 47 కోట్ల వ్యయంతో సీసీఐ ని ఏర్పాటు చేయడం జరిగిందని, సి సి ఐ కి 772 ఎకరాల్లో ప్లాంట్ ఉన్నదని, దీంతోపాటు 170 ఎకరాల్లో సిసిఐ టౌన్షిప్ కూడా ఉన్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ ప్లాంట్ ద్వారా మరట్వాడ, విదర్భ, ఉత్తర తెలంగాణ ప్రాంతాల సిమెంట్ అవసరాలు తీరేవని, దురదృష్టవశాత్తు 1996లో నిధుల లేమితో కార్యకలాపాలు ఆగాయని, 2008లో సిసిఐ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించి పూర్తిగా మూసి వేయడం జరిగిందని అన్నారు. అయితే ఈ మూసివేతకు సంబంధించి ఉద్యోగులు కోర్టుకు వెళ్లారని, అప్పటి నుంచి ఈ అంశం పైన స్టేటస్ కో ఉందని, ఇప్పటికీ సుమారు 75 మంది ఉద్యోగులు కంపెనీ ఉద్యోగుల జాబితాలో ఉన్నారని తెలిపారు.

సీసీఐ కి ప్రత్యేకంగా 1500 ఎకరాల్లో సుమారు 48 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ డిపాజిట్ల మైనింగ్ లీజు ఉన్నదని ఇప్పటికీ 32 కెవిఏ విద్యుత్ సరఫరా కనెక్షన్ మరియు అవసరమైన నీటి లభ్యత ప్లాంట్ కి ఇప్పటికీ ఉన్నదని కేటీఆర్ తన లేఖలో తెలిపారు. కంపెనీ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి అవసరమైన బొగ్గు సరఫరాను స్థానిక సింగరేణి కార్పొరేషన్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్న విషయాన్ని కూడా తన లేఖలో ప్రస్తావించారు. ఇలా సిసిఐ ప్లాంట్ పునరుద్ధరణకు  అనేక సానుకూల అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ దిశగా తగిన చర్యలను వెంటనే చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని ఈ సందర్భంగా కేంద్రమంత్రిని కేటీఅర్ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here