జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగాలు జిల్లాకే దక్కాలి

0
67
Spread the love

జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగాలు జిల్లాకే దక్కాలి

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకాంక్ష

ప్రీ కోచింగ్ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

ఉచిత శిక్షణ ఏర్పాటులో ఎలాంటి రాజకీయ కోణం లేదని వెల్లడి

‘స్థానికత’ జీవోతో తెలంగాణ యువతకు ఎనలేని మేలు

సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు

జూన్ 2న ఉద్యోగార్థుల కోసం ప్రత్యేక యాప్ ఆవిష్కరణ

నిజామాబాద్ : స్థానిక కోటాలోని ఉద్యోగాలతోనే సరిపెట్టుకోకుండా జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగాలను కూడా నూటికి నూరు శాతం నిజామాబాద్ జిల్లా అభ్యర్థులే కైవసం చేసుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షించారు. సరైన ప్రణాళికను నిర్దేశించుకుని శ్రద్ధగా ఇష్టపడి చదివితే కోరుకున్న ప్రభుత్వ కొలువు సాధించడం కష్టమైన పనేమీ కాదని అన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో పోలీస్ ఉద్యోగాల కోసం సన్నద్ధం అవుతున్న యువతీ యువకులకు స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జిల్లా పోలీస్ శాఖ ద్వారా ప్రీ కోచింగ్ నిర్వహిస్తున్న విషయం విధితమే. ముందస్తు కోచింగ్ పొందుతున్న అభ్యర్థులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఆయన చేతుల మీదుగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కె ఆర్. నాగరాజు తదితరులతో కలిసి మంత్రి వేముల అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముందస్తు శిక్షణ కేంద్రాలను నిర్వహించడంలో ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతకు మేలు జరగాలనే తపనతోనే కోచింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 89 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అంతటితోనే సరిపెట్టుకోకుండా తెలంగాణ యువతకు పూర్తి న్యాయం చేయాలనే కృతనిశ్చయంతో కేంద్రాన్ని ఎలాగోలా మెప్పించి స్థానికత జీవోను జారీ చేయించారని చెప్పారు. తెలంగాణ తెచ్చుకోవడం ఎంత గొప్పదో.. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరింపజేసి ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో 317 జీవోను అమలు చేయడం అంతే గొప్పదని మంత్రి ప్రశాంత్ రెడ్డి అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితంగానే ప్రస్తుతం 95 శాతానికి పైగా ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయని హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. నిజామాబాద్ జిల్లాలోనే 1997 ఉద్యోగాలు స్థానిక కోటా లో భర్తీ కానున్నాయని వివరించారు. వీటితో పాటు జోనల్, మల్టీ జోనల్ కొలువులను కూడా జిల్లాకు చెందిన యువతీ, యువకులే సాధించాలని పిలుపునిచ్చారు. మునుపెన్నడూ లేని రీతిలో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల నోటిఫికేషన్ లు వెలువరిస్తున్న నేపధ్యంలో, హైదరాబాద్ కోచింగ్ సెంటర్లకు ధీటుగా జిల్లాకు చెందిన యువత కోసం స్థానికంగానే అన్ని వసతులను సమకూరుస్తూ నాణ్యమైన శిక్షణను ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. ఈ సదవకాశాన్ని జారవిడుచుకోకుండా, ఉద్యోగ సాధన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని సూచించారు.

కష్టపడితే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని, సెల్ఫోన్లతో కాలక్షేపం వంటి వ్యాపకాలకు దూరంగా ఉంటూ శిక్షణ తరగతులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. అభ్యర్థులకు ఇంకనూ ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా, వాటిని అందించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. ఎలాగైనా నూటికి నూరు శాతం అభ్యర్థులు ఉద్యోగాలు సాధించడమే తమ కర్తవ్యంగా పెట్టుకోవాలని వారిని కార్యోన్ముఖులు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల పోటీపరీక్షలకు ఎంతగానో ఉపకరించే రీతిలో ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ను జూన్ 2వ తేదీన ఆవిష్కరించడం జరుగుతుందని మంత్రి ప్రకటించారు. కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగ సాధన కోసం సాగిస్తున్న పయనంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా అలసిపోకుండా అకుంఠిత లక్ష్యంతో ముందుకు సాగాలని అభ్యర్థులకు పిలుపునిచ్చారు. అంకితభావం, పట్టుదల, క్రమశిక్షణతో శ్రమిస్తే తప్పనిసరిగా ఉద్యోగ సాధన లక్ష్యం నెరవేరుతుందని అన్నారు.

జిల్లా యువత కోసం ఇతోధికంగా తోడ్పాటును అందిస్తున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషికి ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు సాధించి గుర్తింపు తేవాలన్నారు. ఇప్పటికే అభ్యర్థులు ఉద్యోగాల సాధన ప్రక్రియలో 50 శాతం లక్ష్యాన్ని చేరుకున్నారని, చివరి వరకు ఇదే పట్టుదలతో ముందుకు సాగుతూ ఉద్యోగ లక్ష్యాన్ని సాధించుకోవాలని అన్నారు. పోలీస్ కమిషనర్ కె ఆర్. నాగరాజు మాట్లాడుతూ, తాను కోరిన వెంటనే ఉచిత శిక్షణకు తోడ్పాటును అందించేందుకు ముందుకు వచ్చిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు ప్రకటించారు. ఎమ్మెల్సీ కవిత కూడా ప్రీ కోచింగ్ పొందుతున్న 135 మంది యువతులకు ఉచిత భోజన వసతి కల్పిస్తున్నారని తెలిపారు. ఈ అవకాశాలు, విస్తృత సదుపాయాలను యువతీయువకులు సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని సూచించారు. రాష్ట్రంలోనే అత్యధిక మందికి భోజన వసతి సదుపాయాలతో శిక్షణ అందిస్తుండడంలో నిజామాబాద్ జిల్లా ముందంజలో ఉందన్నారు. మరో 200 మందికి త్వరలోనే వసతి సదుపాయం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని సి పి నాగరాజు తెలిపారు. ప్రభుత్వం 90 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్న క్రమంలో స్థానికులకే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జీవో వెలువరించడం తెలంగాణ నిరుద్యోగులకు వరం లా మారిందన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ కొలువు సాధించాలనే కలను సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, డి సి పి వినీత్, నిజామాబాద్ ఆర్డీఓ రవి, కోచింగ్ కేంద్రాల సమన్వయకర్త చక్రవర్తి, తారిక్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here