దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ద‌ళిత‌బంధు – మంత్రి స‌త్య‌వ‌తి

0
71
Spread the love

దేశంలో దళిత, గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం పెట్టిన పథకాలను తీసేసిన చరిత్ర లేదని, దళితుల జీవితాల్లో వెలుగులు నింపి వారి పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు తెచ్చారని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా, ఇల్లందు క్లబ్బులో జిల్లా ఎస్సీ కులాల సహకార సంఘం ఆధ్వర్యంలో నేడు ఏర్పాటు చేసిన దళిత బంధు అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. “దళిత లబ్దిదారులు దళిత బంధు కింద వచ్చిన మొత్తంతో లాభసాటి వ్యాపారాలు చేసి గొప్పగా ఎదగాలి. దేనికి డిమాండ్ ఉందో గుర్తించి వాటిని చేయాలి. మన పక్కన ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అముల్ నుంచి లక్ష లీటర్ల పాలు కొంటుంది. ప్రతి నెల వందల కోట్ల టర్నోవర్ ఉంది. కర్ణాటక డైరీ నుంచి 20 లక్షల లీటర్ల మహిళా శిశు సంక్షేమ శాఖ కోసం తీసుకుంటున్నాం. పాలకు అంత డిమాండ్ ఉంది. ఇలా నిత్యావసరాలకు ఉన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది. దళిత బంధు కింద ఇచ్చే పది లక్షల యూనిట్ ను సద్వినియోగం చేసుకోవాలి. సాధారణంగా లోన్ ఉంటే భయం ఉంటుంది. నాకు కూడా లోన్ ఉంది. నెల నెలా కడతాను. 
దళిత బంధు పథకం కింద ఇచ్చే పది లక్షల రూపాయిలను వడ్డీతో తెచ్చామని అనుకుని పని చేస్తే మీరు విజయవంతం అవుతారు. మన శ్రమ, నిజాయతీ జోడించి పని చేయాలి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల మనం మూడు తరాలు వెనక్కి పోయాం. దీనిని మార్చాలనే గొప్ప సంకల్పముతో సీఎం కేసిఆర్ గారు దళిత బంధు పథకం తెచ్చారు. ఈ దేశంలో సంక్షేమ పథకం పెడితే తీసేసిన దాఖలా లేదు. దీన్ని తీసేసే ధైర్యం ఎప్పటికీ ఉండదు. రైతు బంధు పెట్టినప్పుడు కూడా కొంతమంది ఈ పథకం ఎక్కువ రోజులు ఉండదు అన్నారు. రైతు బంధు తాను బతికున్నంత కాలం ఆగదని సీఎం కేసిఆర్ గారు చెప్పారు. కరోనా కష్ట కాలంలో అయినా సరే ఆపేది లేదన్నారు. మాకు జీతాలు కట్ చేశారు కానీ రైతు బంధు ఆపలేదు. ఈ ఏడాది 2.50 లక్షల కోట్లు మన బడ్జెట్. గత ఏడాది 40 వేల కోట్లు సంక్షేమం కోసం కేటాయిస్తే ఈసారి 90 వేల కోట్లు కేటాయించారు.

ప్రజలు అవకాశం ఇస్తే వచ్చే 6,7 ఏళ్లలో దళిత బంధు పథకం ద్వారా ప్రతి దళితునికి 10 లక్షల రూపాయలు ఇచ్చి పథకాన్ని పూర్తి చేస్తాను అని సీఎం చెప్పారు. దళిత బంధు పథకం పెట్టే ముందు చర్చలు జరిగినప్పుడు ఇంకా కూడా వెనుకబడ్డ దళితులను ముందుకు తీసుకు రాకపోతే వారికి ఈ రాజ్యం, రాజ్యాంగం పట్ల నమ్మకం పోతుంది కాబట్టి అలా జరుగొద్దు అని సీఎం కేసిఆర్ గారు అన్నారు. ప్రజల అవసరాలు తెలిసిన వ్యక్తి మనకు సీఎం కావడం మన అదృష్టం. ఆయనకు మరింత శక్తిని ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. దళిత బంధు పథకానికి సంబంధించి 150 మంది లబ్దిదారుల అమౌంట్ కలెక్టర్ అకౌంట్లో ఉంది. వీరికి రక్షణ నిధి కూడా ఏర్పాటు చేసుకున్నాం. మీరు విజయాలు సాధించి నలుగురికి మార్గదర్శకంగా ఉండాలి.” అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ శ్రీ భవేష్ మిశ్రా, జిల్లా అధికారులు, నేతలు, దళిత బంధు లబ్ది దారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here