Spread the love
*ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణ, సరూర్ నగర్ స్ట్రాంగ్ రూమ్ కు తరలిన బాలెట్ బాక్సులు*
హైదరాబాద్, మార్చ్ 14 :: మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ శాసన మండలి గ్రాడ్యువేట్ స్థానానికి నేడు జరిగిన పోలింగ్ ఏవిధమైన స్వల్ప సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగాయి. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కావడంతోనే పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ బూత్ లకు వచ్చారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లలో కోవిద్ నిబంధనలు పాటిస్తూ లైన్లలో కూడా భౌతిక దూరాన్ని పాటించేలా, ప్రతి ఓటరుకు శానిటైసర్ అందుబాటులో ఉంచారు. విస్తృత పోలీస్ బందోబస్తు మధ్య జరిగిన ఈ ఓటింగ్ సందర్బంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఎండతీవ్రత ఉండడం తో ప్రతి పోలింగ్ కేంద్రంలో నీడకై టెంట్లు ఏర్పాటు చేయడం, ఫస్ట్‌ఎయిడ్ చికిత్స కై జాగ్రత్తలు తీసుకున్నారు. పలు పోలింగ్ కేంద్రాలను రిటర్నింగ్ అధికారి ప్రియాంక ఆలా పరిశీలించారు. కాగా, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుండి హైదరాబాద్ ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ వెబ్‌కాస్టింగ్ కెమెరాల ద్వారా ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు.
*అదనపు పోలింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటుకు ఆదేశించిన సి.ఈ.ఓ*
నేడు ఉదయం నుండి పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ఓటింగ్ కు రావడం, 93 అభ్యర్థులతో కూడిన బ్యాలెట్ పేపర్ పెద్దదిగా ఉండడంతో ఓటు వేయడానికి అధికసమయం పట్టింది. దీనితో, మధ్యాహ్నం 2 గంటలైనప్పటికీ పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద పెద్ద లైన్లు ఉండడంతో అవసరమైన పోలింగ్ కేంద్రాలలో అదనపు పోలింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ ఆదేశించారు. దీనితో, భారీ లైన్లు ఉన్న పోలింగ్ కేంద్రాలలో అదనపు ఓటింగ్ కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు.
*పోలింగ్ నమోదు సరళి*
ఉ. 10 గంటల వరకు 7.96 %
ఉ. 12 గం.లకు 21.63 %
మ 2 గం.లకు 39.09 %
సా. తుది సమయం వరకు 63 .86 %.