ఇప్పటికే 37 అంశాలపై ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించిన తహసీల్దార్లు
సమస్యల పరిష్కారానికి అధికారుల కసరత్తు త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనున్న ప్రభుత్వం
హైదరాబాద్ : వ్యవసాయ భూములకు సంబంధించి (ధరణి) పోర్టల్ ద్వా రా మరిన్ని సేవలను ఇరవై రోజుల్లో ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి త్వరలో మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. సమస్యలకు సంబంధించి ఇప్పటికే తహసీల్దార్లు ప్రభుత్వానికి నివేదికను అందించగా దానిపై తీసుకోవాల్సిన చర్యలను పునః పరిశీలించాలని సిసిఎల్ఏ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఎం కెసిఆర్ సూచించినట్టు తెలిసింది. వారం రోజుల క్రితం సిఎం కెసిఆర్ వ్యవసాయ భూవివాదాలు, ఇతర వ్యవహారాలకు సంబంధించి జిల్లా కలెక్టర్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. స్వయంగా జిల్లా కలెక్టర్లే ఈ బాధ్యతలను పర్యవేక్షించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
అయితే వ్యవసాయ భూముల విషయంలో నెలకొన్న కొద్దిపాటి సందిగ్ధతలను జిల్లా కలెక్టర్లు 2 నెలల వ్యవధిలో పరిష్కరిస్తారని సిఎం ప్రకటించారు. ధరణి పోర్టల్‌లో మరిన్ని ఆప్షన్లు పెట్టి, మరింత మెరుగుపరుస్తున్నట్లు సిఎం స్వయంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ధరణిలో నెలకొన్న సుమారు 37కి పైగా సమస్యలను తహసీల్దార్లు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఇవి క్లియర్ అయితే ధరణి ద్వారా జరిగే వ్యవసాయ రిజిస్ట్రేషన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తహసీల్దార్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, కలెక్టర్లకు ఏయే అధికారాలను అప్పగించాలన్న దానిపై నివేదిక ఇవ్వాలని సిఎం కెసిఆర్ రాష్ట్ర ప్రభుత్వ సిఎస్ సోమేష్‌కుమార్‌ను ఆదేశించినట్టుగా తెలిసింది. ఈనేపథ్యంలో దీనిపై ఇరవై రోజుల్లో నిర్ణయం తీసుకోవడంతో పాటు మార్గదర్శకాలను జారీ చేసి ధరణి పోర్టల్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన కృతనిశ్చయంతో ప్రభుత్వం ముందుకెళుతోంది.
ముఖ్యంగా తహసీల్దార్లు లేవనెత్తిన అంశాలు ఇలా
ధరణి పోర్టల్‌లో జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఏదైనా భూ వివాదంలో కోర్టులు జారీ చేసిన స్టే ఆర్డర్లు, స్టేటస్ కో వంటి ఉత్తర్వుల ప్రకారం తహసీల్దార్లు కలెక్టర్లకు పంపి రిజిస్ట్రేషన్లు నిలిపివేసే అంశం కల్పించలేదు. నిషేధిత భూముల జాబితా 22ఏ కింద నమోదైన ప్రభుత్వ భూముల వివరాలు ధరణి పోర్టల్‌లో పూర్తిస్థాయిలో కనిపించడం లేదు. దీంతో అసైన్డ్ భూములు, ఇతర ప్రభుత్వ భూములు పట్టా భూములుగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ధరణి అమల్లోకి రాకముందు జరిగిన రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, విరాసత్ అయిన పెండింగ్‌లు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
డిజిటల్ సంతకాలకు అవకాశం లేదు
గతంలో రిజిస్ట్రేషన్లు జరిగి ఆన్లైన్లో మ్యుటేషన్ కానీ భూములు మళ్లీ అమ్ముకునేలా అవకాశం ఉండడంతో తహసీల్దార్లు కేసులు, సస్పెన్షలకు గురవుతున్నారు. ఆర్ఎస్ఆర్ విస్తీర్ణం వ్యత్యాసంతో పెండింగ్‌లో ఉన్న కేసులకు రికార్డులు సరిచేయలేదు. గతంలో ఏజిపిఏ చేసుకొని మరొకరికి రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆప్షన్ ఇవ్వలేదు. ధరణి పోర్టల్‌లో విరాసత్ కేసుల్లో కుటుంబసభ్యులు కొందరు స్టేట్మెంట్లో వివాహం అయిపోయిన ఆడపిల్లల, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు ఇవ్వకుండానేఏ దరఖాస్తు చేసుకున్నారు. దీంతో సివిల్ తగాదాలకు అవకాశం, క్లరికల్ తప్పులను సవరించే అవకాశం లేదు. ఈజిఏ, పిపిఏ లీజు మార్పిడి, లీజు, లీజు సరెండర్,అవార్డు భూములు, అమ్మకం సర్టిఫికెట్, ఎక్సేంజ్, కన్వేయన్స్ డీడ్ వంటి పెండింగ్‌లో ఉన్నాయి. ఒక సర్వే నెంబర్లో సబ్ డివిజన్ వారీగా ఈసీలు కనిపిస్తున్నాయి. ఈ సర్వే నెంబర్ మొత్తం విస్తీర్ణానికి పూర్తి ఈసీలు కనిపించడం లేదు. ధరణి కంటే ముందు జరిగిన లావాదేవీలకు సంబంధించి డిజిటల్ సంతకాలకు తహసీల్దార్లకు అవకాశం లేదు.
కొత్త ఖాతాలు, పాత ఖాతాలకు ఆధార్ అనుసంధానం జరిగినప్పటికీ ఈకెవైసీ రావడం లేదు. డూప్లికేట్ పట్టాదారు పాసు పుస్తకం ఇచ్చేందుకు అవకాశం లేదు. పాత పుస్తకాల్లో మొదటిపేజీ మాత్రమే వస్తోంది. గతంలో రిజిస్ట్రేషన్లు జరిగిన వాటిల్లో విస్తీర్ణాల్లో వ్యత్యాసం, పట్టాదారుల పేర్లు, వ్యక్తిగత ఇతర వివరాల్లో తేడాలు, విలీన ఖాతాలు, సర్వే నెంబర్లు నమోదుకానీ వివరాలు ధరణిలో మార్చేందుకు వీలు కావడం లేదు. సాదాబైనామాల మ్యుటేషన్ల విషయంలో డిజిటల్ సంతకాలున్న భూముల వివరాలే కనిపిస్తున్నాయి. కోర్టులు ఇచ్చిన తుది ఉత్తర్వులు, తీర్పులు కనిపించడం లేదు. అసైన్డ్ భూములకు చెందిన అసైనీలు, వారి వారసులకు మ్యుటేషన్లకు అవకాశం లేదు. అధికారిక సమాచారానికి వీలుగా పహాణీ, పాసు పుస్తకాలు, హక్కుపత్రం వివరాలు ధరణిలో కానరావడం లేదు.
ఇతర అధికారాల అమల్లో జాప్యం
వీటితోపాటు కొత్తగా రిజిస్ట్రేషన్, నాలా, మ్యుటేషన్ బాధ్యతలతో పాటు ఇతర అధికారాల అమల్లో జాప్యం నెలకొంటోందని తహసీల్దార్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం 570 మండలాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ సమస్యలను 20 రోజుల్లో పరిష్కరించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించడంతో త్వరలోనే మార్గదర్శకాలను జారీ చేయనున్నట్టుగా తెలిసింది