మోజంజాహీ పునరుద్దరణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన అర్వింద్‌కుమార్
సుప్రసిద్ద మోజంజాహీ మార్కెట్ పునరుద్దరణ పనులను రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ నేడు సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మార్కెట్ పునరుద్దరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అర్వింద్‌కుమార్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌తో పాటు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ, చార్మినార్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. 1935లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన రెండవ కుమారుడైన నవాబ్ మోజంజా బహదూర్ పేరుతో నిర్మించిన ఈ మోజంజాహీ మార్కెట్‌ను రూ. 10కోట్ల ప్రాథమిక అంచనాతో పునరుద్దరణ పనులను జీహెచ్ఎంసీ చేపట్టింది. మార్కెట్ పునరుద్దరణ బాధ్యతలను స్వయంగా పర్యవేక్షిస్తున్న అర్వింద్‌కుమార్ ఈ పనుల పురోగతిని ప్రతివారం సమీక్షిస్తున్నారు. 1.77 ఎకరాల విస్తీర్ణంలో 120షాపులతో నిర్మించిన ఈ మార్కెట్‌కు పునరువైభవం తెచ్చేందుకు చేపట్టిన పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. పూర్తిగా ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, బ్యానర్ల ఏర్పాటుతో పూర్వవైభవాన్ని కోల్పోయిన మోజంజాహీ మార్కెట్‌ను పునరుద్దరణ పనులు దాదాపుగా 50శాతంకు పైగా పూర్తయ్యాయని ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌కు జీహెచ్ఎంసీ అధికారులు వివరించారు. మార్కెట్ డోమ్స్లకు కలరింగ్ పనులు పురోగతిలో ఉన్నాయని, వాటర్ పైప్‌లైన్, స్టార్మ్ వాటర్ పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయని చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు వివరించారు. మార్కెట్ పై కప్పు పునరుద్దరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, అక్కడక్కడా స్టోన్ బ్లాస్టింగ్ పనులు జాగ్రత్తగా చేపట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు.