శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా

0
156
Spread the love

శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా
హైదరాబాద్, జూన్ 17, 2021
మనసును, శరీరాన్ని ఏకం చేసి మన జీవన శైలిని మార్చే అద్భుత ప్రక్రియ యోగా అని పూణే లో ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ నేచురోపతిలో శిక్షణ పొందిన యోగా ట్రైనర్ శ్రీమతి జి. సుశీల అన్నారు. ప్రాణాయామం, యోగ, ధ్యానం వంటివి క్రమం తప్పకుండా ప్రతిరోజు చేయటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుందని, కోవిడ్ వంటి వైరస్ లను సులభంగా ఎదుర్కొనగలమని శ్రీమతి సుశీల తెలిపారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో (ఆర్ఒబి), పత్రికా సమాచార కార్యాలయం (పిఐబి) ఈ నెల 21 ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ సందర్భంగా గురువారం ‘ఆరోగ్యవంత మైన జీవనశైలికి యోగా’ అన్న అంశం పై నిర్వహించిన వెబినార్ లో ముఖ్య వక్త గా శ్రీమతి జి. సుశీల పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీమతి సుశీల ప్రసంగిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఒక వ్యక్తి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నట్లని ఆమె అన్నారు. సహజ సిద్ధంగా లభించే పండ్లు, ఆకు కూరలు, కూరగాయలు వంటి సాత్విక ఆహారం తీసుకోవడం, యోగ, ప్రతి రోజు కనీసం 4 లీటర్ల మంచి నీళ్లు త్రాగటం, 8 గంటలు నిద్ర పోవటం వంటి నియమాలు పాటించటం ద్వారా మానసిక వత్తిడిని అధిగమించడమే గాక శారీరకంగా దృఢంగా తయారవుతామన్నారు. సూక్ష్మ యోగ క్రియలు, ముఖ్యమైన యోగాసనాలు వివిధ ప్రాణాయామ పద్దతులు ప్రదర్శనాత్మకంగా వివరించారు. వాటి వలన మన ఆరోగ్యానికి లభించే ప్రయోజనాలను గురించి తెలియజేశారు. తమ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ వెబినార్ ను నిర్వహించినట్లు పిఐబి & ఆర్ఒబి డైరెక్టర్ శ్రీమతి శృతి పాటిల్ తెలిపారు. కోవిడ్ సంక్షోభ సమయంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు యోగా ఉపయోగ పడుతుందని, అలాగే, ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచుకునేందుకు ప్రాణాయామం సహకరిస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు అలవాటు లేనివారు కూడా ఈ యోగా దినోత్సవం సందర్భంగా యోగ, ప్రాణాయామం ప్రారంభించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here