‘ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఇ’, వజ్రోత్సవాలను ప్రారంభించిన మంత్రి

0
84
Spread the love

ఉపాధి అవకాశాల సృష్టికి ‘ఎంఎస్‌ఎంఇ’ మంత్రిత్వశాఖ నిరంతర కృషి: శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ
‘ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఇ’, హైదరాబాద్‌ వజ్రోత్సవాలను ప్రారంభించిన ‘ఎంఎస్‌ఎంఇ’ మంత్రిత్వశాఖ సహాయమంత్రి

హైదరాబాద్‌, 29 ఆగస్టు (తూఫాన్‌) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పెరుగుదలకు తనవంతు తోడ్పాటుద్వారా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగాన్ని పెంచడంలో సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ) రంగం ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాకుండా సరికొత్త ఉపాధి అవకాశాలు కల్పిస్తూ నైపుణ్యంగల యువతను ప్రోత్సహిస్తోంది. గౌరవనీయులైన కేంద్ర ‘ఎంఎస్‌ఎంఇ’ శాఖ సహాయ మంత్రి  భానుప్రతాప్‌ సింగ్‌ వర్మ ఇవాళ ‘ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఇ’, హైదరాబాద్‌ వజ్రోత్సవాలను ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తూ- ఈ మేరకు వెల్లడించారు. దేశంలోని మొత్తం పరిశ్రమలలో 90 శాతం ‘ఎంఎస్‌ఎంఇ’ రంగంలోనివేనని, ఇవి 8 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. 
 ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘నైపుణ్య భారతం’ వంటి కార్యక్రమాల ద్వారా నిపుణులైన యువతకు ఉపాధి అవకాశాల కల్పన కోసం ‘ఎంఎస్‌ఎంఇ’ మంత్రిత్వ శాఖ నిరంతరం కృషి చేస్తోందని శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ చెప్పారు. ఈ నేపథ్యంలో 1962లో ప్రారంభమైన ‘ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఇ’, హైదరాబాద్‌ సంస్థ 60 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం వేడుక నిర్వహించుకోవాల్సిన సందర్భమని ఆయన అన్నారు.


‘ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఇ’ వజ్రోత్సవ కార్యక్రమంలో ఆ శాఖ మంత్రి  నారాయణ్‌ రాణే వర్చువల్‌ మాధ్యమంద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ- విధాన రూపకల్పనలో ప్రభుత్వానికి తోడ్పాటునిచ్చేందుకు 1962లో ‘ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఇ’ ప్రారంభించబడిందని గుర్తుచేశారు. ఈ బాధ్యతతోపాటు శిక్షణ, విస్తృత విద్యా కార్యక్రమాల నిర్వహణసహా సూక్ష్మ-చిన్న పరిశ్రమల రంగంలో పరిశోధనలు కూడా చేపడుతున్నదని తెలిపారు. మరోవైపు నిపుణులైన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం కూడా దీని లక్ష్యాల్లో ఒకటిగా ఉన్నదని శ్రీ నారాయణ్ రాణే ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి పథకం కింద ఇప్పటివరకూ దాదాపు 6,096 శిక్షణ కార్యక్రమాలతో 1,75,000 మంది యువతకు శిక్షణ ఇవ్వడంపై ఈ సంస్థను ఆయన ప్రశంసించారు. అలాగే ‘ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఇ’ వజ్రోత్సవాల నేపథ్యంలో సంస్థలో సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు.

తమ సంస్థ వజ్రోత్సవాలకు హాజరైన గౌరవనీయ కేంద్ర ‘ఎంఎస్‌ఎంఇ’ శాఖ సహాయ మంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ, ఇతర ప్రతినిధులకు ‘ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఇ’ డైరెక్టర్‌ జనరల్‌ శ్రీమతి గ్లోరీ స్వరూప కృతజ్ఞతలు తెలిపారు. సూక్ష్మ-చిన్న పరిశ్రమల రంగానికి గత 60 ఏళ్లలో ‘ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఇ’ అందించిన సేవలను ఆమె తన ప్రసంగంలో వివరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా “సాగా ఆఫ్‌ ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఇ ఆంత్రప్రెన్యూర్స్‌” పుస్తకాన్ని  భాను ప్రతాప్ సింగ్ వర్మ ఆవిష్కరించారు. అంతకుముందు సంస్థ ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతోపాటు వజ్రోత్సవ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అటుపైన సంస్థ ఆవరణలో ఏర్పాటు చేసిన ‘ఎంఎస్‌ఎంఇ’ ఎగ్జిబిషన్ స్టాళ్లను సందర్శించారు.
ఈ కార్యక్రమంలో ‘ఎంఎస్‌ఎంఇ’ మంత్రిత్వ శాఖ కార్యదర్శి  బి.బి.స్వయిన్‌, సహాయ కార్యదర్శి-డెవలప్‌మెంట్‌ కమిషనర్‌  S.K సింగ్, సంయుక్త కార్యదర్శి మెర్సీ ఎపావో, ‘ఎన్‌ఐ-ఎంఎస్‌ఎంఇ’లోని వివిధ రంగాల భాగస్వాములు కూడా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here