నకిలీ విత్తనాల విక్రేతలపై ఉక్కుపాదం

0
143
Spread the love

నకిలీ విత్తనాల విక్రేతలపై ఉక్కుపాదం

   అధికారులకు మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశం 

హైదరాబాద్‌ జూన్ 12 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: తెలంగాణలో నకిలీ విత్తనాల విక్రేతలపై ఉక్కుపాదం మోపాలని  రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల నిరోధానికి పోలీసు, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో మంత్రి శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఇతర ఉన్నతాధికారులు ఈ వర్చువల్‌ సమావేశంలో పాల్గొన్నారు. నకిలీ విత్తనాల నిరోధంపై తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో మంత్రి సమీక్షించారు. నాసిరకం విత్తనాలు విక్రయిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీసు, వ్యవసాయ శాఖలతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. టాస్క్‌ఫోర్స్‌ దాడులు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ఇంకా అక్కడక్కడ నకిలీ విత్తనాలు బయట పడుతున్నాయన్నారు. రాష్ర్టాన్ని నకిలీ విత్తనరహితంగా తీర్చిదిద్దాలనేది సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అని తెలిపారు. విత్తన కంపెనీల లైసెన్స్‌ సరళతరం చేసే అవకాశం ఉందని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.దేశంలో నకిలీ విత్తన తయారీదారులపై పీడీ యాక్ట్‌ పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ప్రధానంగా పత్తి, మిరప విత్తనాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు 3,468 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు సీజ్‌ చేసినట్లు చెప్పారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న 320 మందిపై 209 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here