భారత గణతంత్రం: శక్తిమంతం… ప్రగతిశీలం

0
154
Spread the love

భారత గణతంత్రం: శక్తిమంతం… ప్రగతిశీలం

రాజ్యాంగం గడచిన ఏడు దశాబ్దాలుగా సమగ్రత, సుస్థిరతలను ఇచ్చినప్పటికీ మన గణతంత్రంలో నిత్యచైతన్యం మాత్రం ప్రజల ఘనతే

ఏ గణతంత్రమైనా దృఢంగా, నిత్య చైతన్యంతో ముందుకు సాగుతున్నదంటే- ఆ ఘనత కచ్చితంగా ప్రజలదే. ఆ విధంగా 73 సంవత్సరాలుగా భారత గణతంత్రం ప్రస్తుత రూపంలో క్రియాశీల సమతూకం కొనసాగిస్తున్నది. అయితే- భారతదేశానికి ప్రత్యేకమైన బహుళత్వం, వైవిధ్యాలను ప్రతిబింబించే శక్తుల ఒత్తిడి తరచూ ఈ సమతూకంపై పడుతూంటుంది. ఇక మనలను పరిపాలించే పిరమిడ్‌ ఆకారపు మూడంచెల ఎన్నికైన ప్రజాప్రతినిధుల వ్యవస్థ ఉండటం కూడా మన ప్రజల ఘనతే. ఈ వ్యవస్థలో స్వాభావిక ఒడుదొడుకులు ఉన్నప్పటికీ 30 లక్షల మందికిపైగా (10 లక్షల మంది మహిళలు) ఎన్నికైన ప్రతినిధులు ఉండగా, వీరిలో 4,000 మంది రాష్ట్ర శాసనసభలకు, 500 మందికిపైగా పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గణతంత్ర రాజ్యాన్ని తామెన్నుకున్న ప్రతినిధుల ద్వారా ప్రజలు స్వేచ్ఛగా పరిపాలించుకోవాలని రాజ్యాంగ అవతారిక నిర్దేశిస్తోంది. ప్రత్యక్షంగా ఎన్నికైన ఇంత భారీస్థాయి ప్రతినిధుల వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. ఇది వాదవివాదాలతో, రణగొణ ధ్వనులతో.. కొన్నిసార్లు మితిమీరిన స్థాయి ఖండనమండనలతో సాగేదిగా ఉంటుందన్న విమర్శ ఉండొచ్చుగానీ, అది జీవంతో తొణికిసలాడుతూండటమే దాని ప్రత్యేకత. కాగా, సంపూర్ణ స్వరాజ్యం కోసం 1929నాటి కాంగ్రెస్‌ లాహోర్‌ మహాసభ తీర్మానాన్ని ఆమోదించిన మేరకు 1950కి ముందు జనవరి 26ను స్వాతంత్ర్య దినోత్సవంగా పరిగణించేవారు. సామ్రాజ్యవాద పాలకుల నుంచి దేశం విముక్తమై, రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటినుంచీ ఆ రోజు (జనవరి 26)ను మనం గణతంత్ర దినోత్సవంగా నిర్వహిస్తున్నాం.
రాజ్యాంగం గురించి కె.ఎం.మున్షీ తన ‘పిలిగ్రిమేజ్‌ టు ఫ్రీడమ్‌’లో- “స్వాతంత్ర్య పోరాటంలో విజయం సాధించిన రాజకీయ నాయకుల తోడ్పాటుతో న్యాయవాదులు దీన్ని రచించడం వాస్తవమేగానీ, రాజ్యాంగం కేవలం ఓ చట్టపరమైన లేదా రాజకీయపరమైన పత్రం కాదు. ఇందులో వారు చారిత్రక పాత్ర పోషించారు: ఆ మేరకు జాతీయ ఐక్యత, ప్రజాస్వామ్యబద్ధ జీవన విధానం పరిఢవిల్లే విధంగా చట్రాన్ని రూపొందించారు. తదనుగుణంగా సమాజంలోని ప్రతి వర్గం న్యాయం పొందేలా మన రాజ్యాంగం ఒక నైతిక నేపథ్యం కలిగి ఉంది. అలాగే ఆధ్యాత్మికంగా- అన్ని మతాలూ తమతమ ధర్మాల రక్షణ, సంరక్షణను కొనసాగించుకునే వీలు కల్పించబడింది. అంటే- 500 సంవత్సరాలపాటు ఎన్నడూ అనుభవంలోకి రాని చట్టబద్ధ పాలన, వాక్‌-మతానుసరణ స్వాతంత్ర్యం, అన్నిటికీ మించి సమగ్రత-సుస్థిరతలతో కూడిన స్వేచ్ఛా వారసత్వంగా నా తరం నాయకులు రాజ్యాంగాన్ని ప్రసాదించారు” అని పేర్కొన్నారు.
మన రాజ్యాంగం గత ఏడు దశాబ్దాలుగా మన గణతంత్రానికి ఎంతో కీలకమైన సమగ్రత, సుస్థిరతలను ఇచ్చిందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. కానీ, మన సమాజంలోని ప్రతి వర్గానికీ న్యాయం లభించడంలో సవాళ్లు కొనసాగుతున్నాయి. వెనుకబడిన, షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ), షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ), నిరుపేద వర్గాల ప్రజలంతా మెరుగైన అవకాశాల కోసం, సరళ న్యాయలభ్యత కోసం గళమెత్తుతూనే ఉన్నారు. ఇన్ని దశాబ్దాల మన గణతంత్రంలో దేశంలోని ఒక ప్రాంతంలోగల ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు రాజ్యాంగ హక్కులు తిరస్కరించబడిన దుస్థితి ఆర్టికల్‌ 370 రద్దు ద్వారా సరిదిద్దబడింది.

అన్ని మతాలకూ రక్షణ, సంరక్షణకు సంబంధించి మున్షీ పేర్కొన్న రాజ్యాంగంలోని ఆధ్యాత్మిక ప్రాతిపదికపైనా ఒత్తిడి ప్రస్ఫుటమవుతోంది. ఎన్నికల ప్రయోజనాల కోసం మైనారిటీలను బుజ్జగించడం లక్ష్యంగా లౌకికవాదం (ఎమర్జన్సీ సమయంలో ప్రవేశపెట్టబడిన) ఆచరణను వక్రమార్గం పట్టించిన ఫలితంగా ఆ వర్గంలోని మహిళలకు చట్టబద్ధ హక్కులు నిరాకరించబడ్డాయి. అలాగే ‘ముమ్మారు తలాఖ్‌’ చెల్లుబాటును రద్దుచేస్తూ తెచ్చిన చట్టంపై వ్యతిరేకత కూడా ఎన్నికల ప్రయోజనాలతో ముడిపడినదే కావడం గమనార్హం. తద్వారా అనేక ఇస్లామిక్‌ దేశాల్లోనూ ముస్లిం మహిళలకుగల ఈ హక్కు భారత్‌లో నిరాకరించబడింది. అదేవిధంగా కొన్నిఇతరవర్గాల హక్కుల నిరాకరణ ద్వారా మతపరంగా సమాన హక్కులను సమర్థించినప్పుడూ మైనారిటీల బుజ్జగింపు వ్యవహారం కొనసాగుతూంటుంది. వాస్తవానికి మతపరమైన హక్కుల సమస్య తీవ్రతలో రాష్ట్రానికీ, రాష్ట్రానికీ మధ్య తేడా ఉంటుంది. కానీ, సంకుచిత అవగాహనగల శక్తులు దీన్నొక దేశవ్యాప్త వ్యతిరేకతగా చిత్రించడం ఎంతమాత్రం సముచితం, సహేతుకం కాదు. ఎవరైనా తమ మతాన్ని అనుసరించే హక్కు నిరాకరించబడినప్పుడు లేదా అందుకు భంగం కలిగినప్పుడు ఆలోచనాపరులైన ప్రజానీకం లేదా మాధ్యమాలు మౌనం వహించడం రాజ్యాంగపరంగా వారికి లభించే రక్షణను బలహీనపరుస్తుంది. ఆ మేరకు రక్షకులమని చాటుకునేవారి ఉద్దేశపూర్వక మౌనం, బూటకపు విలువలు గణతంత్రం శక్తిని బలహీనం చేస్తాయి.
సమాచార సాంకేతిక పరిజ్ఞానాలు ఆధునిక గణతంత్రాలను బలోపేతం చేస్తాయనడంలో సందేహం లేదు. ప్రజల మధ్య సమాచార ఆదానప్రదానం, అవగాహన పెంచే వ్యయాన్ని సాంకేతికత ఎంతగానో తగ్గించింది. నేడు ఇది చక్కగా ప్రజాస్వామ్యీకరణ చేయబడిన శక్తిమంతమైన ఉపకరణం. అయితే, ధ్రువీకరించబడని లేదా తప్పుడు వార్తల సృష్టి, భాగస్వామ్యం ఫలితంగా ఈ ప్రజాస్వామ్యీకరణలో అనూహ్య పతనం సంభవిస్తుంది. ఇక సాంకేతిక పరిజ్ఞానానికి మరొక శక్తి, భారీస్థాయిలో సమాచార ప్రదాన సామర్థ్యంగల ఇంకొక ఉపకరణం సామాజిక మాధ్యమం. కానీ, ఇది మన రాజ్యాంగంలో పొందుపరచబడిన ఒకటి లేదా అనేక హక్కులకు సవాలుగానే కాకుండా కొన్ని సందర్భాల్లో ముప్పుగానూ పరిణమించింది. ఈ నేపథ్యంలో పౌరుల హక్కుల పరిరక్షణ దిశగా ఇలాంటివాటిని అరికట్టే ప్రయత్నం చేసినపుడు దాన్ని- అణగదొక్కడంగా, వాక్ స్వాతంత్య్ర హక్కును తుంగలో తొక్కడంగా చిత్రించడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి విస్తృత తప్పుడు వార్తలు, సమాచారం నిరోధానికి చర్యలేవీ తీసుకోకపోతే వాటివల్ల సామాజిక సామరస్యానికి నష్టం వాటిల్లడమేగాక అసలు రాజ్యాంగంపైనే ప్రజలు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది.
సుభాష్‌ సి.కశ్యప్‌ పేర్కొన్నట్లు- “మన రాజ్యాంగం ఒక సజీవ, గతిశీల ప్రక్రియ.. ఇది నిత్య పరిణామశీలమైదేగాక నిరంతర సవరణలు, సహేతుక భాష్యాలు, వాస్తవ కార్యాచరణతో ప్రగతిశీలం.” ప్రపంచంలోని అనేక రాజ్యాంగాలతో పోలిస్తే మన రాజ్యాంగం చాలాసార్లు సవరించబడింది. ఆ మేరకు వరుసగా వచ్చిన ప్రభుత్వాలు కాలమాన పరిస్థితులకు, ప్రజల ఆకాంక్షలకు తగినట్లు రాజ్యాంగాన్ని ఎల్లప్పుడూ తాజాగా ఉంచుతూ వచ్చాయి. తదనుగుణంగా 100కుపైగా రాజ్యాంగ సవరణలే కాకుండా కాలం చెల్లినవిగా గుర్తించిన 1,500 చట్టాలు కూడా రద్దుచేయబడ్డాయి. కాగితాలకు మాత్రమే పరిమితమైన ఈ కాలంచెల్లిన చట్టాలు కొన్ని సందర్భాల్లో పేచీకోరు శక్తుల చేతుల్లో ఆయుధాలుగా మారుతున్నాయి. పాలన సంస్కరణల్లో భాగంగా వాటిని తొలగింపు ద్వారా కార్యనిర్వాహక వర్గంలో పారదర్శకత, జవాబుదారీతనానికి హామీ ఇవ్వబడింది. అంటే- రాజ్యాంగంలోని ప్రతి మార్పు నిర్దిష్ట లక్ష్యంతో కూడినదిగా, రాజ్యాంగ నిర్మాతల వాస్తవ ఉద్దేశాలకు భంగం కలగనిదిగా ఉండాలి.
రాజ్యాంగం నిత్య పరిణామశీలం అనడానికి వస్తుసేవల పన్నును ప్రవేశపెడుతూ తెచ్చిన 101వ సవరణ సరైన నిదర్శనం. కేంద్ర, రాష్ట్రాల పరిధిలోని అనేక రకాల పన్నుల స్థానంలో ఏకీకృతం పరోక్ష పన్నువిధానానికి ఇది నాంది పలికింది. దీనికి అనుగుణంగా ‘జీఎస్టీ మండలి’ కూడా ఏర్పాటు చేయబడింది. ‘జీఎస్టీ’కి సంబంధించిన సమస్యలు… ముఖ్యంగా దాని పరిధిలోకి వచ్చే ప్రతి అంశానికీ వర్తించే పన్ను శాతాలపై దీనికి నిర్ణయాధికారం ఉంటుంది. ఈ మండలికి ఐదేళ్ల పదవీకాలం పూర్తికావాల్సిన నేపథ్యంలో తొలి సంవత్సరాల్లో ఎదురైన సవాళ్లను కూడా మండలి సమర్థంగా ఎదుర్కొని నిలిచింది. సహకారాత్మక సమాఖ్య తత్వానికి ఇదొక శుభసూచన.
ఈ ఏడు దశాబ్దాల్లో మన రాజ్యాంగం మనకెంతో సేవ చేసింది. సామ్రాజ్యవాద తదనంతర కాలంలో అనేక గణతంత్ర దేశాలు తమ పూర్వ రాజ్యాంగాలను మూలన పడేసి, కొత్త వాటిని పరీక్షించాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ అభిప్రాయం ప్రకారం- “రాజ్యాంగం పనితీరు రాజ్యాంగ స్వభావంపై పూర్తిస్థాయిలో ఆధారపడి ఉండదు. శాసనసభ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ వంటి యంత్రాంగాలను మాత్రమే అది సమకూరుస్తుంది. ప్రజలు, రాజకీయ పార్టీలు తమ ఇష్టాయిష్టాలు, రాజకీయాల అమలుకు సాధనాలుగా ఆయా అంగాలను ఏర్పరచుకుంటాయి.” అందువల్ల గణతంత్రాన్ని పటిష్టంగా, సజీవంగా ఉంచగలిగేది అంతిమంగా ప్రజలే.


-నిర్మలా సీతారామన్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here