పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో తప్పుడు సమాచారం అడ్డుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది:
డాక్టర్ డి.ఎం. సుబ్బారావు, ఎన్ఐఎన్
హైదరాబాద్, మార్చి 24, 2021 సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకొని, తద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకొని కొవిడ్-19 ను ఎదుర్కోవాలని ఎన్ఐఎన్ డైరెక్టర్ డి.ఎం. సుబ్బారావు తెలిపారు.
పోషణ-ఆహార వైవిధ్యం, ఆరోగ్యం అనే అంశంపై పత్రికా సమాచార కార్యాలయం (పిఐబి), రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో (ఆర్ఒబి) హైదరాబాద్ నిర్వహించిన వెబినార్ లో ఈ రోజు ఆయన ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు పోషకాహార లోపం కొన్ని వర్గాలకే పరిమితమయ్యేదని, ఇప్పుడు మారుతున్న అలవాట్లతో ఈ సమస్య అన్ని వర్గాలలో కనబడుతోందన్నారు. తగ్గిన శారీరక శ్రమ, జంక్ ఫుడ్ వాడకం, మారుతున్న ఆహారపు అలవాట్లు వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయని పేర్కొన్నారు.
పోషకాహారం-సమతుల్య ఆరోగ్యానికి సంబంధించిన పలు అంశాల గురించి డాక్టర్ డి.ఎం. సుబ్బారావు ఈ వెబినార్ లో వివరించారు. పెరిగిన ఇంటర్ నెట్, సెల్ ఫోన్ వాడకంతో సామాజిక మాధ్యమాల ద్వారా మనం ఏదైనా సమాచారాన్ని ఇతరులకు పంపించే ముందుగా దానిని నిర్ధారించుకొని, ఆ తరువాత ఇతరులకు ఫార్వార్డ్ చేయాలని తెలిపారు. ఈ కొవిడ్-19 మహమ్మారి సమయం లో మనం బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
పత్రికా సమాచార కార్యాలయం, దక్షిణ ప్రాంత డైరెక్టర్ జనరల్ శ్రీ ఎస్. వెంకటేశ్వర్లు ప్రారంభోపన్యాసం చేస్తూ, కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి మనం తీసుకొనే ఆహారం మరియు పాటించాల్సిన ఆహార నియమాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్-19 మార్గదర్శకాలు పాటిస్తూ, మరింత జాగ్రత్తగా మెలగాలని సూచించారు.
పిఐబి, ఆర్ఒబి డైరెక్టర్ శ్రీమతి శృతి పాటిల్ మాట్లాడుతూ, మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘పోషణ్ పక్వాడా వారోత్సవాల’ సందర్భంగా ఈ వెబినార్ ను నిర్వహించినట్లు తెలిపారు.
పిఐబి, ఆర్ఒబి అధికారులతో పాటు, వివిధ జిల్లాలలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థులు ఈ వెబినార్ లో పాల్గొన్నారు.
Post Views:
278