జల్ జంగల్ జమీన్ పేరుతో తొలిదశలో స్వాతంత్ర పోరాటాలు
ఆదివాసీ స్వాతంత్ర పోరాటాలది ప్రత్యేక స్థానం
అసమాన త్యాగాలతో కొనసాగిన పోరాట పరంపర
పీఐబీ, ఆర్వోబీ వెబినార్లో ఓయూ అధ్యాపకులు అప్కా నాగేశ్వరరావు
హైదరాబాద్(నవంబరు 15): భూమి, నీరు, అటవీ హక్కుల కోసం ప్రారంభమైన ఆదివాసీ గిరిజన ఉద్యమాలు మా ప్రాంతం మా రాజ్యం పేరుతో స్వాతంత్ర ఉద్యమానికి బాటలు వేశాయని ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకులు డాక్టర్ అప్కా నాగేశ్వరరావు పేర్కన్నారు. దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాలలో సొంత పాలన కోసం అసమాన త్యాగాలతో పోరాడిన ఆదివాసీ యోధులు అనంతరం బ్రిటీష్ వలస పాలకులకు వ్యతిరేకంగా కొనసాగిన మహోన్నత ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచాయని కొనియాడారు. ఆ ఉద్యమాల చరిత్రకు గౌరవం దక్కాలని అభిలాష వ్యక్తంగా చేశారు. ఆ స్వాతంత్య్ర సమర యోధులను స్ఫూర్తిగా తీసుకొని నూతన భారతావనికి మనం కృషి చేయాలని పిలుపునిచ్చారు. నవంబరు 15న బిర్సాముండా జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జన జాతీయ గౌరవ దినోత్సవం నిర్వహించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పత్రికా సమాచార కార్యాలయం (పిఐబి), రీజినల్ అవుట్ రీచ్ బ్యూరో (ఆర్వోబి) సంయుక్తంగా ఆజాది కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా “భారత స్వాతంత్రోద్యమం-గిరిజన స్వాతంత్ర ఉద్యమ యోధుల పాత్ర” అనే అంశంపై వెబినార్ నిర్వహించాయి. పీఐబీ డైరెక్టర్ శృతిపాటిల్ ప్రారంభోపన్యాసం చేయగా ముఖ్య వక్తగా పాల్గొన్న ఆప్కా నాగేశ్వరరావు రావు ప్రసంగిస్తూ భారత స్వాతంత్ర ఉద్యమం 16వ శతాబ్ధంలోనే ప్రారంభమైందని తెలిపారు. తెలంగాణలోని నిర్మల్ ప్రాంతంలో రాంజీగోండు తన రాజ్యంలో బ్రిటీషు వలసపాలకుల, నిజాం రాజు ఆంక్షలను వ్యతిరేకిస్తూ అసమాన పోరాటం చేశాడని గుర్తుచేశారు. అంతకు ముందు మధ్య భారతదేశంలో బిర్సా ముండా ఆధ్వర్యంలో కొన్ని లక్షల మంది తమ రాజ్యంలో తమ హక్కుల కోసం తిరుగుబాటు చేశారని తెలిపారు. బిర్సాముండాతోపాటు సంతాల్ తిరగుబాటు, కోల్ తిరుగుబాట్లు బ్రిటీషు వలస పాలకుల్ని వణికించాయని వివరించారు. మహారాష్ట్ర, బీహార్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక ప్రాంతాలలో ఆదివాసీ రాజ్యాలు తమ సొంత పాలన కోసం వలస పాలకులపై గెరిల్లా తరహాలో పోరాటాలు చేశాయని తెలిపారు. అత్యాధునిక ఆయుధాలతో బ్రిటీషు సైన్యం దాడులు చేసినా వెనకడుగు వేయకుండా సంప్రదాయ ఆయుధాలతో ఆదివాసీ యోధులు పోరాడారని కొనియాడారు. 1857 తొలి స్వాతంత్ర సంగ్రామం కంటే ముందు కొనసాగిన ఈ పోరాటాలకు గుర్తింపు దక్కాలని అభిలాష వ్యక్తం చేశారు. తెలంగాణలో కుంరం భీం నేతృత్వంలో కొనసాగిన ఉద్యమం మా ప్రాంతం మా రాజ్యం పేరుతో సంపూర్ణ స్వాతంత్ర ఉద్యమానికి ప్రతీకగా నిలుస్తుందని తెలియజేశారు. కుంరం భీం త్యాగంతోనే ఆదివాసీ గిరిజన ప్రాంతాల సమస్యలపై నిజాం రాజు ప్రముఖ ఆంత్రోపాలజిస్టు హేమండార్ఫ్ తో అధ్యయనం చేయించి ప్రత్యేక ఏజెన్సీ ఏర్పాటుచేయడంతోపాటు భూములపై హక్కులు కల్పించాల్సి వచ్చిందన్నారు. ఈ వెబినార్లో పిఐబి, ఆర్.వో.బి అధికారులు, ఎన్.వై.కే, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ , కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.