స్పెశాలిటి స్టీల్ కోసం ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహకం (పిఎల్ఐ) పథకాని కి ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రిమండలి;
ఈ కోవ కు చెందిన ఉత్పత్తుల ను భారతదేశం లో తయారు చేయడానికి అయిదు సంవత్సరాల లో 6,322 కోట్ల రూపాయల విలువ చేసే ప్రోత్సాహకాల ను ఇవ్వడం జరుగుతుంది;
ఈ పథకం దాదాపు గా 40,000 కోట్ల రూపాయల అదనపు పెట్టుబడి ని ఆకర్షించనుంది;
ఈ పథకం 68,000 ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు సహా సుమారు 5,25,000 మంది కి ఉద్యాగాలను కల్పించగలదు
స్పెశాలిటీ స్టీల్ కోసం ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహక (పిఎల్ఐ) పథకాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ఆమోదాన్ని తెలిపింది. ఈ పథకం కాలపరిమితి 2023-24 నుంచి అయిదు సంవత్సరాల పాటు 2027-28 వరకు ఉంటుంది. బడ్జెటు లో నుంచి 6322 కోట్ల రూపాయల ను ఖర్చు చేస్తూ అమలుపరచే ఈ పథకం ఇంచుమించు 40,000 కోట్ల రూపాయల పెట్టుబడిని తీసుకు వస్తుందని, 25 ఎమ్టి స్పెశాలిటీ స్టీల్ సామర్థ్యాన్ని అదనం గా జతపరుస్తుందని అంచనా వేయడమైంది. ఈ పథకం తో దాదాపు 5,25,000 మంది కి ఉపాధి దొరుకుతుంది. వీటి లో 68,000 ఉద్యోగాలు ప్రత్యక్ష ప్రాతిపదిక న ఉంటాయి.
భారతదేశం లో 2020-21 లో ఉత్పత్తి అయిన 102 మిలియన్ టన్నుల ఉక్కు లో విలువ ను జోడించిన ఉక్కు/స్పెశలిటి ఉక్కు కేవలం 18 మిలియన్ టన్నులు గా ఉన్న కారణం గా స్పెశలిటి స్టీలు ను లక్ష్య సెగ్మెంట్ గా ఎంపిక చేయడమైంది. దీనికి అదనం గా, అదే సంవత్సరం లో 6.7 మిలియన్ టన్నుల దిగుమతులు చోటు చేసుకోగా, సుమారు 4 మిలియన్ టన్నుల దిగుమతులు ఒక్క స్పెశాలిటీ స్టీల్ వే ఉన్నాయి. ఫలితం గా దాదాపు 30,000 కోట్ల రూపాయల వరకు విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు పెట్టవలసి వచ్చింది. స్పెశలిటి స్టీల్ ఉత్పత్తి చేయడం లో ఆత్మనిర్భర్ గా రూపొందితే భారతదేశం స్టీల్ వేల్యూ చైన్ లో తన స్థానాన్ని మెరుగు పరచుకొని, కొరియా, జపాన్ వంటి అధునాతన ఉక్కు తయారీ దేశాల సరస న నిలువగలుగుతుంది.
2026-27 ఆఖరు కల్లా స్పెశలిటి ఉక్కు ఉత్పత్తి 42 మిలియన్ టన్నుల కు చేరుతుందని ఒక అంచనా. దీనితో సుమారు 2.5 లక్షల కోట్ల విలువైన స్పెశలిటి స్టీల్ ను దేశం లో ఉత్పత్తి చేయడం, వినియోగించడం జరగవచ్చు. అదే జరగని పక్షం లో దిగుమతి చేసుకోవలసి వస్తుంది. అదే మాదిరి గా, వర్తమానం లో 1.7 మిలియన్ టన్నులు గా ఉంటున్న స్పెశలిటి స్టీల్ ఎగుమతులు కాస్తా ఇంచుమించు 5.5 మిలియన్ టన్నులు గా నమోదు కావచ్చు. దీనితో 33,000 కోట్ల రూపాయల విదేశీమారక ద్రవ్యం చేజిక్కుతుంది.
ఈ పథకం తాలూకు ప్రయోజనం అటు పెద్ద పాత్రదారుల తో పాటు అంటే ఏకీకృత ఉక్కు ప్లాంటుల తో పాటు చిన్న తరహా పాత్రదారుల కు (సెకండరీ స్టీల్ ప్లేయర్స్) కు కూడా అందనుంది.
స్పెశాలిటీ స్టీల్ అనేది విలువ ను జోడించిన ఉక్కు. దీని లో సాధారణం గా తయారు చేసే ఫినిష్ డ్ స్టీల్ ను అధిక విలువ ను జత చేసిన ఉక్కు గా మార్చడం కోసం కోటింగు, ప్లేటింగు, హీట్ ట్రీట్మెంట్ తదితర పద్ధతుల ద్వారా పోత పోయడం జరుగుతుంది. ఈ రకమైన ఉక్కు ను ఆటోమొబైల్ సెక్టర్, స్పెషలైజ్ డ్ కేపిటల్ గుడ్స్ మొదలైన రంగాల తో పాటు రక్షణ, అంతరిక్షం, విద్యుత్తు రంగాల లో వ్యూహాత్మక వినియోగాని కి వినియోగిస్తారు.
స్పెశలిటి స్టీల్ తాలూకు అయిదు శ్రేణులను పిఎల్ఐ స్కీము ను అమలు పరచడానికి ఎంపిక చేయడమైంది. అవి:
ఎ) కోటెడ్/ప్లేటెడ్ ఉక్కు ఉత్పత్తులు
బి) హై స్ట్రెంథ్/ వియర్ రెజిస్టెంట్ స్టీల్
సి) స్పెశలిటి రైల్స్
డి) అలాయ్ స్టీల్ ఉత్పత్తులు మరియు స్టీల్ వైర్స్
ఇ) ఎలక్ట్రికల్ స్టీల్
ఈ ఉత్పత్తుల శ్రేణిలో నుంచి , ఈ స్కీము పూర్తి అయిన తరువాత భారతదేశం ఎపిఐ గ్రేడ్ పైపు లు, హెడ్ హార్డెన్డ్ రైల్స్, ఎలక్ట్రికల్ స్టీల్ ( ట్రాన్స్ ఫార్మర్ లు మరియు విద్యుత్తు ఉపకరణాల తయారీ లో ఇది అవసరమవుతుంది) వంటి ఉత్పత్తుల ను తయారు చేయడం మొదలు పెట్టేస్తుంది. వీటి ని ప్రస్తుతం చాలా పరిమితమైన పరిమాణం లోనే తయారు చేయడమో/ వీటి తయారీ జోలికి అసలు ఎంత మాత్రం వెళ్ళకపోవడమో జరుగుతున్నది.
పిఎల్ ఐ ప్రోత్సాహకాల లో మూడు శ్లాబు లు ఉన్నాయి. అతి తక్కువ శ్లాబు 4 శాతం కాగా, అత్యధిక శ్లాబు 12 శాతం గా ఉంటుంది. దీనిని ఎలక్ట్రికల్ స్టీల్ (సిఆర్జిఒ) కు కేటాయించడమైంది. స్పెశలిటి స్టీల్ కోసం ఉద్దేశించిన పిఎల్ఐ పథకం మౌలిక ఉక్కు ను దేశం లోపలే ‘కరగించి, పోత పోసేందుకు’ ఉపయోగించేలా పూచీ పడనుందిది. అంటే దీని ద్వారా స్పెశలిటి స్టీల్ ను తయారు చేయడానికి వాడేటటువంటి ముడిపదార్థం (తుది ఉక్కు) ను భారతదేశం లోనే తయారు చేయడం జరుగుతుందన్న మాట. తద్ద్వారా ఈ స్కీము దేశం లోపల ఎండ్ టు ఎండ్ మేన్యుఫాక్చరింగు కు ఈ పథకం అండదండలను అందిస్తుందన్న మాట.
**
కేంద్ర పాలిత ప్రాంతం అయిన లద్దాఖ్ కు ఒక ఇంటిగ్రేటెడ్ మల్టీ-పర్పస్ కార్పొరేశన్ ను ఏర్పాటు చేయడాని కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి
25 కోట్ల రూపాయల వాటా మూలధనం తో ఈ కార్పొరేశన్ ఆ ప్రాంతం అభివృద్ధి కి అంకితమైన తొలి సంస్థ గా ఉంటుంది
ఈ కార్పొరేశన్ పరిశ్రమ, పర్యటన, రవాణా రంగాల కోసం, అలాగే స్థానిక ఉత్పత్తులు, హస్త కళ వస్తువు ల మార్కెటింగ్ కోసం కృషి చేస్తుంది
లద్దాఖ్ లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఈ కార్పొరేశన్ ప్రధానమైన కన్స్ట్రక్షన్ ఏజెన్సీ గా పని చేయనుంది
లద్దాఖ్ ప్రాంతం లో సమ్మిళితమైన, సమగ్రమైన అభివృద్ధి, ఉపాధి కల్పన ల ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధన కోసం కృషి
కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్ లో ఒక ఇంటిగ్రేటెడ్ మల్టీ-పర్పస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డివెలప్మెంట్ కార్పొరేశన్ ను ఏర్పాటు చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది.
కార్పొరేశన్ కోసం రూ.1,44,200 – రూ. 2,18,200 స్థాయి పే స్కేలు తో మేనేజింగ్ డైరెక్టర్ పదవి ని ఏర్పాటు చేయడానికి కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
కార్పొరేశన్ అధీకృత వాటా మూలధనం 25 కోట్ల రూపాయలు గా, పునరావృత వ్యయం ప్రతి సంవత్సరాని కి దాదాపుగా 2.42 కోట్ల రూపాయలు గా ఉంటుంది. ఇది కొత్త గా ఏర్పాటు అవుతున్నటువంటి సంస్థ. ప్రస్తుతాని కి కొత్త గా ఏర్పాటైన కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ ఈ తరహా సంస్థ ఏదీ లేదు. ఈ కార్పొరేశన్ వివిధ రకాల అభివృద్ధి కార్యకలాపాల ను చేపట్టనున్న కారణం గా ఈ ఆమోదం ఉద్యోగ కల్పన కు బాట ను పరచనుంది. ఈ కార్పొరేశన్ పరిశ్రమ, పర్యటన, రవాణా, రంగాల లోనే కాకుండా, స్థానిక ఉత్పత్తులు, హస్త కళ వస్తువుల మార్కెటింగ్ కు కృషి చేయనుంది. ఈ కార్పొరేశన్ లద్దాఖ్ లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కి పాటుపడే ఒక ప్రధానమైన నిర్మాణ సంస్థ గా కూడా పని చేయనుంది.
ఈ కార్పొరేశన్ స్థాపన కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్ లో సమ్మిళితమైనటువంటి, సమగ్రమైనటువంటి అభివృద్ధి కి దారి తీయనుంది. అదే జరిగితే గనుక దాని ద్వారా యావత్తు లద్దాఖ్ ప్రాంతం లోను, జనాభా పరం గాను, సామాజిక-ఆర్థిక అభివృద్ధి కి పూచీ లభించినట్లు అవుతుంది.
అభివృద్ధి తాలూకు ప్రభావం అనేక విధాలు గా ఉండబోతోంది. ఈ కార్పొరేశన్ మానవ వనరుల ఇతోధిక అభివృద్ధి లోను, మానవ వనరుల ఉత్తమ వినియోగం లోను దోహద పడనుంది. ఇది వస్తువులు, సేవల ఉత్పత్తి ని పెంచుతుంది. ఇది వాటి సరఫరా సాఫీ గా సాగేందుకు కూడా మార్గాన్ని సుగమం చేస్తుంది. ఈ కారణం గా దీనికి ఆమోదం లభించడం వల్ల ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించడం లో ఊతం అందనుంది.
పూర్వరంగం:
i. ఇదివరకటి జమ్ము, కశ్మీర్ రాష్ట్రాన్ని జమ్ము, కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 2019 కి అనుగుణంగా పునర్ వ్యవస్థీకరణ చేసిన అనంతరం 2019 అక్టోబరు 31న కేంద్రపాలిత లద్దాఖ్ ప్రాంతం (చట్ట సభ లేకుండా)ఉనికి లోకి వచ్చింది.
ii. ఇది వరకటి జమ్ము, కశ్మీర్ రాష్ట్రాని కి చెందినటువంటి ఆస్తులు, అప్పుల ను కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ము, కశ్మీర్ మరియు లద్దాఖ్ ల మధ్య పంపకం చేసే విషయం లో సిఫార్సులు ఇవ్వడానికి గాను జమ్ము, కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 2019 లోని సెక్షన్ 85 ప్రకారం ఒక సలహా సంఘాన్ని నియమించడమైంది. ఆ కమిటీ ఇతర అంశాల తో పాటుగా అండమాన్, నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డివెలప్మెంట్ కార్పొరేశన్ లిమిటెడ్ (ఎఎన్ఐఐడిసిఒ) తరహా లో ఒక ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డివెలప్మెంట్ కార్పొరేశన్ లిమిటెడ్ ను ఏర్పాటు చేయాలని,లద్దాఖ్ నిర్ధిష్ట అవసరాల కు అనుగుణం గా వివిధ అభివృద్ధి కార్యకలాపాల ను చేపట్టాలన్న ఒక సముచితమైన ఆదేశం తో కార్పొరేశన్ ను స్థాపించాలని సిఫార్సు చేసింది.
iii. తదనుగుణం గా కేంద్రపాలిత లద్దాఖ్ ప్రాంతం అటువంటి ఒక కార్పొరేశన్ ను నెలకొల్పవలసింది గా ఒక ప్రతిపాదన ను 2021 ఏప్రిల్ లో ఆర్థిక మంత్రిత్వ శాఖ కు పంపించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కు చెందిన కమిటీ ఆన్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్ పెండిచర్ (సిఇఇ) కూడా ఇదే విధమైన సిఫార్సు ను చేసింది.