లాక్డౌన్పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతోన్న సమయంలో జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ లాక్డౌన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ ప్రసంగం అనగానే అందరిలో ఆసక్తి పెరిగిపోయింది. ఎలాంటి ప్రకటన ఉంటుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఇప్పుడు లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితులు లేవన్నారు. కరోనాను కట్టడి చేయడానికి కొన్నాళ్లుగా కఠినమైన పోరాటం చేస్తున్నాం. రెండో దశలో కరోనా మరింత తీవ్రమైన సవాల్ విసురుతుందన్న ఆయన.. కోవిడ్ సెకండ్ వేవ్ తుపాన్ వలే విరుచుకు పడుతుందన్నారు.. కరోనాపై పోరాటం చేస్తున్న వైద్యులు, ఇతర వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపిన ఆయన ధైర్యంగా ఉంటేనే కఠిన పరిస్థితులను ఎదుర్కోగలం.. ఇటీవల మనం తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్లో పరిస్థితులను చక్కదిద్దుతాయి. సరిపడా ఆక్సిజన్ సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైన ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ సరఫరా చేయడానికి కృషి చేస్తున్నాం. ప్రత్యేక రైళ్లతో ఆక్సిజన్ పంపించి ఆ కొరత తీరుస్తున్నాం అన్నారు.
కరోనా మొదట వచ్చినప్పుడు అది ఏంటి ? ఎలా ఎదుర్కోవాలని అనే విషయంపై కూడా క్లారిటీ లేదన్న ప్రధాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయన్నారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన ఔషధ సంస్థలు భారత్లో ఉన్నాయి. కరోనా రెండో దశలో ఔషధాల కొరత లేదు. ప్రపంచంలోనే అత్యధికంగా టీకాలు వేస్తున్న దేశంగా మనదేశం నిలిచింది.. ఫార్మా కంపెనీలు ఔషధాల ఉత్పత్తిని పెంచాయి. ఫ్రంట్ లైన్ వారియర్స్, సీనియర్ సిటిజన్లకు టీకాల ప్రక్రియ పూర్తి చేశామని, ప్రస్తుతం 45 ఏళ్లు నిండినివారికి వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన అందరికీ టీకాలు అందిస్తామన్నారు. ఇక, లాక్డౌన్పై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోడీ.. అత్యవసర పరిస్థితులు తప్పితే ప్రజలు బయటకు రావొద్దు అని లాక్ డౌన్ విధించే పరిస్థితి తీసుకు రావొద్దు అని విజ్ఞప్తి చేశారు. అయితే, కరోనాను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను చివరి అస్త్రంగానే భావించాలి అని సూచించారు.. లాక్డౌన్ నుంచి దేశాన్ని కాపాడాలి అని దేశ ప్రజలను కోరారు ప్రధాని మోడీ.