మహ్మమారిని జయించడం మన చేతుల్లోనే ఉంది

0
139
Spread the love

మహ్మమారిని జయించడం మన చేతుల్లోనే ఉంది

ఎవరికి వారు తగిన జాగ్రత్తలు పాటిస్తే కరోనా వ్యాప్తిని నియంత్రించవచ్చు

లాక్‌డౌన్‌ ఆఖరి అస్త్రం కావాలి

వలస కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా కల్పించాలి

 వారు స్వస్థలాలకు తరలిపోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలి

మన ముందున్న సవాల్‌ చాలా పెద్దది

మన దృఢసంకల్పం, ధైర్యం, సన్నద్ధతతో దీన్ని అధిగమించాలి

 ప్రజలనుద్దేశించి ప్రసంగంలో ప్రధానమంత్రి మోదీ

న్యూఢిల్లీ ఏప్రిల్ 21 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: కోవిడ్‌-19 కోరలు చాస్తున్న వేళ… మహ్మమారిని జయించడం మన చేతుల్లోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. లాక్‌డౌన్‌కు పోవాల్సిన పనిలేదని అన్నారు. మైక్రో కంటైన్మైంట్‌ జోన్లకు పరిమితమై, ఎవరికి వారు తగిన జాగ్రత్తలు పాటిస్తే కరోనా వ్యాప్తిని నియంత్రించవచ్చని పేర్కొన్నారు. తాళం చెవి మన చేతుల్లోనే ఉందని, అనవసరంగా బయటకు వెళ్లకుండా వీలైనంతగా ఇళ్లకు పరిమితమైతే.. లాక్‌డౌన్‌ పెట్టే పరిస్థితి రాకుండా చూసుకోవచ్చన్నారు. లాక్‌డౌన్‌ ఆఖరి అస్త్రం కావాలన్నారు.వలస కార్మికులకు భరోసా కల్పించి వారు స్వస్థలాలకు తరలిపోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలని కోరారు. వలస కార్మికుల జీవితాలకు, జీవనోపాధికి ఢోకా లేదనే నమ్మకాన్ని రాష్ట్రాలు కల్పించాలన్నారు. వారికి వ్యాక్సినేషన్‌ హామీ ఇవ్వాలన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో మంగళవారం రాత్రి ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. భిన్న రంగాలకు చెందిన నిపుణులు, ప్రజలందరి భాగస్వామ్యంలో సమష్టిగా పోరాడి మరోసారి కరోనాను కట్టడి చేద్దామన్నారు. ఆక్సిజన్, మందుల కొరతను అధిగమించేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని ఫార్మా రంగానికి పిలుపునిచ్చారు.

దృఢసంకల్పంతో పోరాడుదాం

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు వివరిస్తూ… ఆక్సిజన్, టీకాలు, మందుల ఉత్పత్తిని, సరఫరాను పెంచామన్నారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ వాక్సినేషన్‌కు వీలుకల్పించామన్నారు. ఈ మహమ్మారికి కుటుంబసభ్యులను కోల్పోయిన వారి బాధను తాను అర్థం చేసుకోగలనన్నారు. దేశం కోవిడ్‌పై పెద్ద సమరమే చేస్తోందన్నారు. తొలిదశ తర్వాత పరిస్థితి కుదుటపడిందని అనుకుంటున్న తరుణంలో సెకండ్‌ వేవ్‌ తుపాన్‌లా విరుచుకుపడిందన్నారు. ‘మన ముందున్న సవాల్‌ చాలా పెద్దది. మన దృఢసంకల్పం, ధైర్యం, సన్నద్ధతతో దీన్ని అధిగమించాలి’ అని దేశ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ 20 నిమిషాల ప్రసంగంలో… రెండు అంశాలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. ఒకటి… దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పెట్టే అవకాశాల్లేవనే విషయాన్ని ప్రస్పుటం చేశారు. గతేడాది లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్రమలు మూతపడి మహానగరాల నుంచి వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోవడంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిన విషయం తెలిసిందే. రెండు… వలస కార్మికులకు ప్రభుత్వాలు అండగా నిలుస్తాయని చెబుతూ వారిలో భరోసా నింపే ప్రయత్నం చేశారు. ఆర్థిక రంగాన్ని కాపాడటం, ప్రజారోగ్యాన్ని సంరక్షించడం..రెండింటికీ కేంద్రం సమప్రాధాన్యత ఇస్తుందనే సంకేతాలిచ్చారు.

ఆ పరిస్థితి రానీయెద్దు

‘ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని లాక్‌డౌన్‌ నుంచి కాపాడుకోవాలి. లాక్‌డౌన్‌ను ఆఖరి ఆస్త్రంగా మాత్రమే వాడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి్త చేస్తున్నా. లాక్‌డౌన్‌ దాకా పరిస్థితులు రాకుండా చేయగలినంతా చేయాలి. మైక్రో కంటైన్మెంట్‌ జోన్లపై దృష్టి పెట్టాలి’ అని ప్రధాని అన్నారు. ఢిల్లీ ఇప్పటికే వారం రోజులు లాక్‌డౌన్‌ను ప్రకటించగా, జార్ఖండ్‌ 22 నుంచి 29 దాకా లాక్‌డౌన్‌ను ప్రకటించింది. భారత్‌లో తయారైన రెండు వ్యాక్సిన్లతో ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని చేపట్టామని మోదీ అన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా 12 కోట్ల వ్యాక్సిన్లను వేసింది భారతదేశమేనన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని… అయినా పూర్తి మనోనిబ్బరంతో పోరాడాలన్నారు. దేశప్రజల సమష్టికృషితో కరోనాను జయిస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

చిన్నారులు చొరవ చూపాలి.. 

‘కోవిడ్‌పై అలుపెరుగని పోరాటం చేస్తున్న వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వ్యాక్సిన్‌ అభివృద్ధి, ఉత్పత్తి, సరఫరాలో ఫార్మా రంగం నిర్విరామంగా శ్రమిస్తోంది. ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత పెద్ద సమస్యగా మారింది. దీన్ని అధిగమించడానికి సంబంధిత వర్గాలు సమష్టిగా కృష్టి చేస్తున్నాయి. కోవిడ్‌ తొలివేవ్‌లో పీపీటీ కిట్లు, ఇతర సదుపాయాలు లేవు. చికిత్స నిర్దిష్టంగా తెలియదు. వ్యాక్సిన్లు లేవు… అప్పటితో పోలిస్తే ఇప్పుడు కరోనాను సమర్థంగా ఎదుర్కొనగలిగే స్థితిలో ఉన్నాం’ అని ప్రధాని అన్నారు. ప్రజలందరూ కోవిడ్‌ జాగ్రత్తలను కచ్చితంగా పాటిస్తే లాక్‌డౌన్‌లతో అవసరం ఉండదన్నారు. అనవసరంగా బయటకు రావొద్దని, వ్యాక్సిన్‌ తీసుకోవాలని ప్రజలను కోరారు. స్వచ్ఛభారత్‌లో పెద్దలకు ఆదర్శంగా నిలిచినట్లే… కోవిడ్‌పై పోరులో కూడా చిన్నారులు ముందుండాలన్నారు. ముఖ్యమైన పని లేకుండా ఇళ్లను వదిలి వెళ్లొద్దని తమ తల్లిదండ్రులను, పెద్దలను పిల్లలు ఒప్పించాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here