దేశంలోని ఇతర మెట్రోల కంటే హైదరాబాద్ లో పొల్యూషన్‌ అధికం

0
213
Spread the love

*శ్వాస, హృదయ, చర్మ సంబంధితవ్యాధులు వచ్చే అవకాశం

*చిన్నారులకు తీవ్ర ముప్పు

*హైదరాబాద్‌, ముంబై, బెంగళూరు, ఢిల్లీలో డైసన్‌ సర్వే

*హైదరాబాద్ ప్రజలు తస్మాత్‌ జాగ్రత్త..

హైదరాబాద్ ఏప్రిల్ 2 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );మీరు ఇంట్లోనే ఉన్నారా.. అయినా తస్మాత్‌ జాగ్రత్త.. మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేసే కాలుష్య కారకాలు మీ ఇంట్లోనే దాగి ఉన్నాయి. పిల్లల ప్రాణాలను బలి తీసుకునే పొల్యూషన్‌ భూతం మిమ్మల్ని వెంటాడుతున్నది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా శ్వాస, హృదయ సంబంధిత వ్యాధులు మీ దరిచేరే ప్రమాదం ఉంది. ఇటీవల దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో జరిగిన డైసన్‌ సర్వేలో విస్తుగొల్పే విషయాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇతర నగరాలతో పోలిస్తే గ్రేటర్‌ ప్రాంతంలోని ఇండ్లలో దుమ్ము, ధూళీ కణాల తీవ్రత 20 మైక్రో మీటర్ల కన్నా అధికంగా నమోదైందని సర్వేలో పేర్కొన్నది.సర్వే సాగిందిలా..!

సాధారణంగా కాలుష్య అనగానే ఫ్యాక్టరీలు, రోడ్లు, వాహనాలే గుర్తొస్తాయి. కానీ మీకు తెలుసా.. వాటికన్నా ప్రమాదకరమైన కాలుష్యం మన ఇంట్లోనే నమోదవుతున్నది. దుమ్ము, ధూళీ పోగై ఇంటిని కాలుష్యభరితంగా మారుస్తున్నదని ఫిక్కీ రీసెర్చ్‌ సహకారంతో డైసన్‌ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో హైదరాబాద్‌, ముంబై, బెంగళూరు, ఢిల్లీ నగరాలకు చెందిన 227 ఇండ్లల్లో దుమ్ము, ధూళీ తదితర 11 కాలుష్య కారకాలను సేకరించారు. సోఫా, పరుపు, కార్పెట్‌, కారు తదితర వాటిపై ఉన్న దుమ్మును స్టడీ చేశారు. నగరంలో అత్తాపూర్‌, సోమాజిగూడ, న్యూ మలక్‌పేట్‌, సుముఖి ఆర్బిట్‌ మాదాపూర్‌, గాంధీనగర్‌ తదితర ప్రాంతాల్లో ఈ స్టడీ జరిపారు. అక్కడి ఆవాసాల నుంచి సేకరించిన కలుషితాలను రీసెర్చ్‌ చేయగా. హైదరాబాద్‌ ఆవాసాలు ప్రమాదంలో ఉన్నాయని సర్వే హెచ్చరించింది. బ్యాక్టీరియా, శిలింధ్రాలు, దుమ్ము, పురుగులు, పిల్లి, బొద్దింక కాలుష్య కారకాలతో పాటు పెంపుడు కుక్కల వల్ల కూడా ఇండ్లల్లో కాలుష్యం నమోదైందని సర్వే తెలిపింది.

మేల్కోకపోతే ముప్పే..!

ఇండ్లల్లో పేరుకుపోయిన కలుషితాలతో శ్వాస, హృదయ, చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని స్టడీ హెచ్చరించింది. బొద్దింకలు, ఇతర పురుగులు, వాటి మలం వలన కాలుష్యం ఏర్పడుతున్నదని పేర్కొన్నది. ముఖ్యంగా ఆస్థమా, ఇతర శ్వాస వ్యాధులకు కారణమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నది. అంతేకాదు ఇంట్లో ఉండే కాలుష్యం వలన పెద్దల కంటే చిన్నారులకే రెట్టింపు ప్రమాదం ఉందని డైసన్‌ సర్వేలో తేలింది. హృదయ, శ్వాస వ్యాధిగ్రస్తులకు మరింత ప్రమాదమని హెచ్చరించింది. అంతేకాదు కండ్లు, గొంతు, ముక్కు సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇంట్లో ఉండే కాలుష్యాన్ని గుర్తించకపోతే అది సుదీర్ఘ సమస్యలకు కారణమయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంటుందని సూచించింది. గ్లోబల్‌ ఆస్థమా రిపోర్ట్‌ ప్రకారం 6 శాతం మంది పిల్లలు, 2 శాతం మంది అడల్ట్స్‌ ఆస్థమాతో బాధపడుతున్నారు. ఇండియాలో 15 నుంచి 20మిలియన్ల మందిని బాధిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉండే దుమ్ము, ఇతర కాలుష్య కారకాలతో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సర్వే తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here