రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో కళాబృందాల ఎంపిక
హైదరాబాద్, మే 19, 2022 – కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో (ఆర్ఒబి), హైదరాబాద్ కార్యాలయం ఎంపానెల్మెంట్ నిమిత్తం తెలంగాణ రాష్ట్రంలోని సాంస్కృతిక బృందాలు, కళాకారుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నాటిక, నృత్య నాటిక, వీధి నాటకాలు, ఫ్లాష్ మాబ్, కాంపొసిట్ బృందాలు, జానపద, సాంప్రదాయ, పౌరాణిక కళలు, మాజిక్, తోలుబొమ్మలాటలు, ఒగ్గుకథ, యక్షగానం, చిందు యక్షగానం, కోయ, ధింస, గోండు, లంబాడ తదితర కళారూపాలు ప్రదర్శించగల తెలంగాణ రాష్ట్రానికి చెందిన కళాకారులు, గాయకులు, సంగీత కళాకారులు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులు 2022 జూన్,14వ తేదీ లోపు హైదరాబాద్ రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో కార్యాలయానికి పంపించాలి.
కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆమోదించిన నియమ నిబంధనలకు అనుగుణంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం WWW.davp.nic.in వెబ్ సైట్ లోను, తాజా ‘ఎంప్లాయ్ మెంట్ న్యూస్’ లోనూ అందుబాటులో వుంది. దరఖాస్తు చేసుకోదలచిన వారు ప్రకటనలో పేర్కొన్న నియమ నిబంధనలను తప్పక అనుసరించాలి.
దేశ వ్యాప్తంగా రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో విభాగాలు కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆరోగ్యం, సంక్షేమం వంటి వివిధ అంశాలపై స్థానిక కళాకారులచే కళారూపాల ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తాయి. తెలంగాణ రాష్ట్రం లోని అన్ని జిల్లాలకు చెందిన కళాకారులు దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో సంచాలకులు శ్రీమతి శృతి పాటిల్ తెలియజేశారు.